విశాఖ తీరంలో ఎన్టీఆర్ మనవళ్ల సమరం

Update: 2019-02-07 04:45 GMT
ఎన్నికల సీజన్ వస్తోంది. దీంతో ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై రాజకీయ వారసులొస్తున్నారు. ఎన్నికల సీజన్ లో ఇది కామనే అయినా.. వచ్చేది మామూలు వారసులు కాదు.. ఎన్టీఆర్ మనవళ్లు. ప్రత్యర్థి కూడా ఎన్టీఆర్ మనవడే కావడం విశేషం. ఇలా ఎన్టీఆర్ మనవళ్లిద్దరూ ఏపీలోని ప్రధాన పక్షాలు టీడీపీ, వైసీపీ నుంచి పోటీపడుతుండడం చల్లని విశాఖ తీరంలో వేడి పుట్టిస్తోంది.  మరి ఈ విషయంలో నందమూరి హీరోలు ఎటువైపు నిలుస్తారన్నది సస్పెన్స్ గా మారింది. ఒకరిపై ఒకరు సమరగర్జన చేయబోతున్న ఆ ఎన్టీఆర్ మనవళ్లు ఎవరన్నది హాట్ టాపిక్ గా మారింది.

ఎన్టీఆర్ ఎంట్రీయే సంచలనం.. సినిమా రంగమైనా.. పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన అడుగుపెట్టిన విధానం.. సాధించిన విజయాలు సంచలనాలే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ కేంద్రంగా ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద ఆయన వారసుల ఫైట్ ఆసక్తి రేపుతోంది. ఎన్టీఆర్ మనవళ్ల సమరానికి విశాఖ తీరం వేదిక కాబోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

బాలక్రిష్ణ చిన్నల్లుడు భరత్, దగ్గుబాటి పురంధేశ్వరీ కుమారుడు హితేష్ లు రాజకీయంగా అతిపెద్ద కుటుంబాలకు వారసులు.. పైగా ఎన్టీఆర్ మనవళ్లు కావడం విశేషం. ఈ ఇద్దరూ ఈసారి విశాఖ నుంచి ముఖాముఖి తలపడుతుండడం చర్చనీయాంశంగా మారింది.

బాలక్రిష్ణ చిన్నల్లుడు భరత్ ని టీడీపీ నుంచి విశాఖ ఎంపీగా పోటీచేయించాలన్న ఆలోచనలో టీడీపీ ఉంది. గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఎంవీవీఎస్ మూర్తి, కావూరి సాంబశివరావుల ముద్దుల మనవడు అయిన భరత్ దివంగత ఎన్టీఆర్ కు కూడా మనవడి వరస. ఎంవీవీఎస్ మూర్తికి విశాఖలో ఉన్న ఇమేజ్.. బాలయ్య చిన్నల్లుడిగా పేరు తనను గెలిపిస్తుందని భరత్ ఆశిస్తున్నారు.

ఇక వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి హితేష్ ను బరిలోకి దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరీ కుమారుడే హితేష్ చెంచురామ్. టీడీపీ ఎంపీగా భరత్ ను దించితే పోటీగా హితేష్ ను దించాలని వైసీపీ భావిస్తోంది. విశాఖ ఎంపీగా పురంధేశ్వరీ చేసిన దరిమిలా హితేష్ సరైన ప్రత్యర్థి అని వైసీపీ భావిస్తోంది.

ఎన్టీఆర్ మనవళ్లిద్దరూ ఇలా ముఖాముఖి తలపడితే.. ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యులు, హీరోలు ఎటువైపు నిలుస్తారన్న చర్చ ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద హాట్ టాపిక్ గా మారింది.

విశాఖ వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జిగా ప్రస్తుతం ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు. విశాఖ ఈస్ట్ నుంచి సత్యనారాయణను బరిలోకి దింపి హితేష్ ను విశాఖ ఎంపీగా పంపాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. కానీ సత్యనారాయణ దీనికి ఒప్పుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏదీ ఏమైనా ఎన్టీఆర్ వారసులిద్దరూ ఇరు ప్రధాన పార్టీల నుంచి నిలబడితే అది ఏపీలోనే అత్యంత ప్రతిష్టాత్మక పోరుగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News