ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పు.. నందమూరి కుటుంబం స్పంద‌న ఇదే!

Update: 2022-09-22 08:50 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విజయవాడలోని 'ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌' పేరును వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్సిటీగా మార్చుతూ ముఖ్యమంత్రి జగన్ మోహ‌న్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై నందమూరి కుటుంబం తీవ్ర అసంతృప్తి, అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఈ వ్య‌వ‌హారంపై దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ పేరుతో నందమూరి కుటుంబం ప్రెస్ నోట్ విడుదల చేసింది.

హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నామని ఆ ప్రెస్‌ నోట్‌లో ఎన్టీఆర్ కుటుంబం పేర్కొంది. హెల్త్ యూనివర్సిటీని స్థాపించింది.. ఎన్టీఆర్ అని, 1986లో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీని స్థాపించారని నందమూరి కుటుంబం గుర్తు చేసింది.

నాడు ప్రజలు, అన్ని పార్టీల నేతలు దీనిపై హర్షం వ్యక్తం చేశారని తెలిపింది. ఇక 1996లో ఎన్టీఆర్ మ‌ర‌ణించాక 1998లో అప్పటి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టారని వెల్ల‌డించింది.

వైఎస్ రాజశేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు కూడా ఎన్టీఆర్ మీద గౌరవంతో ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ వర్సిటీ ముందు డాక్ట‌ర్ ఎన్టీఆర్ మెడిక‌ల్ హెల్త్ యూనివ‌ర్సిటీగా నామకరణం చేశారని నందమూరి కుటుంబం ప్రెస్ నోట్లో పేర్కొంది.

ఆ పేరును‌ నేడు వైఎస్ జగన్ మార్చడం దురదృష్టకరమని నందమూరి కుటుంబం పేర్కొంది. ఎన్టీఆర్ పేరును తొలగించటం అంటే తెలుగు జాతిని అవమానించినట్లేనని అసంతృప్తి వ్య‌క్తం చేసింది. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని నందమూరి కుటుంబం డిమాండ్ చేసింది.

మ‌రోవైపు ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌లో ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మార్పు వ్య‌వ‌హారం ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది. ఎన్టీఆర్ పేరును తొల‌గించి వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్సిటీగా మార్చ‌డంపై ప్ర‌తిప‌క్ష పార్టీలు, వివిధ సంఘాలు, త‌ట‌స్థ వ్య‌క్తులు జ‌గ‌న్ నిర్ణ‌యింపై దుమ్మెత్తిపోస్తున్నారు. స్వ‌యంగా జ‌గ‌న్ పార్టీలోనే ఉన్న అధికార భాషా సంఘం అధ్య‌క్షుడు యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్‌, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ యార్ల‌గ‌డ్డ త‌న ప‌దవికి ఇప్ప‌టికే రాజీనామా చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News