తెలుగు రాష్ట్రాల‌కు కూల్ క‌బురు వ‌చ్చేసిందోచ్!

Update: 2018-05-19 04:23 GMT
ఎండాకాలం మాట విన్నంత‌నే ఒళ్లంతా వేడెక్కిపోతోంది. మండే ఎండ‌ల్ని ఎలా అధిగ‌మించాల‌న్న ప్లాన్ను భారీగా వేసుకునే వారు భారీగా క‌నిపిస్తుంటారు. ఎండాకాలం మొత్తం ఏదోలా గ‌డిపేస్తే.. ఈసారికి గండం గ‌డిచిన‌ట్లేన‌ని అనుకునేవాళ్లు చాలామందే క‌నిపిస్తుంటారు. ఎండ‌ల దిగులు అక్క‌ర్లేదు. ఎందుకంటే.. ఎండ‌ల్ని ఇంటికి పంపించేసే చ‌ల్ల‌టి క‌బురు వ‌చ్చేసింది.

గ‌త ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది నైరుతి రుతుప‌వ‌నాలు వారం ముందుగా రానున్నాయి. దీంతో.. గ‌త ఏడాది జూన్ ఫ‌స్ట్ వీక్ లో కానీ క‌నిపించ‌ని రుతుప‌వ‌నాలు ఈసారి మే చివ‌ర‌కు.. లేదంటే జూన్ ఫ‌స్ట్ కే రానున్న విష‌యాన్ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు ప్ర‌క‌టించారు.

గ‌త ఏడాది మే 30న కేర‌ళ‌ను తాకిన నైరుతి రుతుప‌వ‌నాలు.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వారం రోజుల ముందే రానున్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో.. ఈ నెలాఖ‌రుతోనే వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డ‌టంతో పాటు.. వాన‌లు వ‌చ్చేయ‌టం ఖాయ‌మంటున్నారు. ఈసారి సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోదు అవుతుంద‌ని.. కాకుంటే గ‌త ఏడాదితో పోలిస్తే.. ఒక వారం ముందే తొల‌క‌రి వ‌ర్షాలు ప‌డ‌నున్నాయి.

సాధార‌ణంగా కేర‌ళ‌ను రుతుప‌వ‌నాలు తాకిన వారం వ్య‌వ‌ధిలో రెండు తెలుగు రాష్ట్రాల‌కు వ‌చ్చేస్తాయి. గ‌త ఏడాది ఆరేబియా స‌ముద్రంలో ఆవ‌ర్త‌నం కార‌ణంగా వాన‌లు ఆల‌స్య‌మ‌య్యాయి. ఈసారి అందుకు భిన్నంగా వారం ముందే రానుండ‌టంతో ఈ ఏడాది ఎండాకాలం వెళ్లిపోయిన‌ట్లే. గ‌డిచిన వారం రోజుల్లో క్యుమిలో నింబ‌స్ మేఘాల‌తో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డుతున్న ప‌రిస్థితి. అలాంటిది రుతుప‌వ‌నాలు కూడా ముందు వ‌చ్చేయ‌నున్న నేప‌థ్యంలో ఈసారి ఎండాకాలం మ‌రో ప‌ది రోజులు మాత్ర‌మే ఉన్న‌ట్లు సుమా.
Tags:    

Similar News