ఒవైసీ.... జగన్ కి టెన్షన్ పెట్టబోతున్నాడా...?

Update: 2022-07-28 08:48 GMT
అసదుద్దీన్ ఒవైసీ. మజ్లీస్ పార్టీ అధినేత. ఈ రోజు భారత దేశాన ముస్లిం మైనారిటీలకు సంబంధించిన పార్టీ ఒకటి గట్టిగా ఉందని నిరూపించబోయే ప్రయత్నం ఆయన మటుకు చాలానే  చేస్తున్నాడు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఒవైసీ అక్కడ తన మజ్లీస్ పార్టీని ముందు పెట్టి పోటీకి సై అంటున్నారు. గెలిచిన చోట బోణీ కొడుతున్నాడు. లేని చోట మాత్రం అధికార పక్షంలో విపక్షంలో ఎవరో ఒకరి ఓట్లను చీల్చి వారికి కావాల్సినంత రాజకీయ నష్టం చేకూరుస్తున్నాడు. దాంతో ఓవైసీ అంటేనే దేశంలోని చాలా పార్టీలు హడలెత్తిపోతున్నాయి.

ముఖ్యంగా ముస్లిం మైనారిటీ ఓట్లతో అధికారంలోకి వస్తున్న పార్టీలు, వారి ఓట్లను తన బ్యాంక్ గా మార్చుకున్న పార్టీలైతే ఇపుడు తెగ కలవరం చెందుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒవైసీ చూపు ఏపీ మీద కూడా పడుతుందా అన్న పెద్ద డౌట్ అయితే చాలా కాలంగా ఉంది. ఎందుకంటే దేశమంతా పోటీ చేస్తున్న ఓవైసీ సాటి తెలుగు రాష్ట్రం ఏపీలో ఎందుకు పోటీ చేయరు. కచ్చితంగా చేస్తారు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే ఏపీలో కొన్ని అసెంబ్లీ సెగ్మంట్లలో ముస్లిం మైనారిటీలు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. ముఖ్యనగా రాయలసీమలో రాయలసీమలో వారు ఎక్కువగా ఉన్నారు. దాంతో ఒవైసీ చూపు సీమ మీద పడింది అంటున్నారు. ఆయన అక్కడ విస్తృతంగా  తిరగాలని చూస్తున్నాడుట.

నిజంగా ఒవైసీ మదిలో ఈ ఆలోచన ఉంది అంటే మాత్రం కచ్చితంగా అది వైసీపీకి అతి పెద్ద దెబ్బ అని అంటున్నారు. ఎందుకంటే నూటికి తొంబై శాతం మైనారిటీల ఓట్లు గుత్తమొత్తంగా వైసీపీకే ఇప్పటిదాకా పడుతున్నాయి. దాంతో రాయల‌సీమలో తిరుగులేని శక్తిగా ఆ పార్టీ ఉంది. ఇపుడు ఒవైసీ అక్కడ తిరిగి తన పార్టీని బలోపేతం చేస్తే కనుక కచ్చితంగా వైసీపీ మీదనే దెబ్బ పడుతుంది అని అంటున్నారు.

ఎటూ టీడీపీకి ముస్లిం మైనారిటీ వర్గాలలో ఓట్లు పెద్దగా రావు అని చెబుతారు. దాంతో వచ్చే ఎన్నికల్లో మజ్లీస్ కనుక ఏపీలో పోటీ చేస్తే మాత్రం నేరుగా వైసీపీకే షాక్ ఇస్తుంది అని లెక్కలు వేస్తున్నారు. మరో వైపు ఏపీలో కచ్చితంగా పది సీట్ల దాకా పాగా వేయాలని ఒవైసీ కంకణం కట్టుకున్నారు అని అంటున్నారు. అదే జరిగితే మాత్రం ఆ మేరకు వైసీపీ చాలా దారుణంగా నష్టపోవాల్సి ఉంటుంది.

ఈసారి ఎన్నికలు ఎలా చూసుకున్నా కూడా కటా కటీగా సాగుతాయి. ప్రతీ ఓటూ కూడా  ప్రతీ పార్టికీ అతి ముఖ్యం. దాంతో వైసీపీకి ఏ మాత్రం ఎడ్జి ఉన్నా దాన్ని దెబ్బ తీసేందుకు ఓవైసీ అనే అస్త్రం ఉపయోగపడుతుంది అని విపక్షాలు కూడా భావిస్తున్నాయట. ఏపీలో డెబ్బై వేల పై చిలుకు ముస్లిం ఓట్లు ఉన్నాయని చెబుతున్నారు. వీటి మీద ఒవైసీ సాబ్ గురి పెట్టారూ అంటే ఏపీలో జగన్ కలవరపడాల్సిందే. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలు ఏపీలో చాలా రంజుగా సాగడం ఖాయం.
Tags:    

Similar News