రాజ్ న్యూస్ చేతులు మారింద‌ట‌!

Update: 2019-05-11 07:31 GMT
టీవీ న్యూస్ ఛాన‌ళ్లు కొన్ని అదే ప‌నిగా చేతులు మారిపోతున్నాయి ఇప్పుడు.  ఇలా మారిన ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్ టీవీ9 యాజామ‌న్య లొల్లి ఇప్పుడు ప్ర‌ధాన వార్త‌గా మారిన సంగ‌తి తెలిసిందే. గ‌డిచిన నాలుగైదునెల‌లుగా మీడియా వ‌ర్గాల్లో.. రెండురోజులుగా జ‌నంలో హాట్ టాపిక్ గా మారిన ఈ వ్య‌వ‌హారం ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్లే చెప్పాలి. ర‌విప్ర‌కాశ్ ను టీవీ9 సీఈవో ప‌ద‌వి నుంచి తీసేసి.. ఆ స్థానంలో మ‌రొక‌రిని పెట్ట‌టంతో పాటు.. తాజాగా నిర్వ‌హించిన ప్రెస్ మీట్ తో ఇవ్వాల్సినంత క్లారిటీ టీవీ9 కొత్త యాజ‌మాన్యం ఇచ్చేసింద‌ని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. మీడియాలో పెద్ద‌గా చ‌ర్చ‌ల్లోకి రాకుండానే రాజ్ న్యూస్ ఛాన‌ల్ చేతులు మారిన విష‌యం కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ మ‌ధ్య‌న కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి చేతుల్లోకి వెళ్లిన రాజ్ న్యూస్ కాస్తంత హ‌డావుడి చేసినా.. ఫ‌లితం మాత్రం పెద్ద‌గా లేకుండా పోయిన సంగ‌తి తెలిసిందే. లాభాల సంగ‌తి త‌ర్వాత‌.. ఏ నెల‌కు ఆ నెల ఖ‌ర్చు త‌డిచి మోపెడు  కావ‌టంతో.. ఇక దాన్ని భ‌రించ‌లేమంటూ కోమ‌టిరెడ్డి చేతులు ఎత్తేసిన‌ట్లుగా చెబుతున్నారు. దీంతో.. రాజ్ న్యూస్ తెలుగు ఛాన‌ల్ ను న‌డిపించాల‌ని భావించార‌ట‌. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఎవ‌రు ఎక్క‌డ ట‌చ్ చేశారో కానీ.. అనూహ్యంగా రాజ్ న్యూస్ ను తీసుకునేందుకు ఊహించ‌ని వ్య‌క్తి తెర మీద‌కు వ‌చ్చార‌ట‌.

ఏపీ విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడైన విజ‌యసాయిరెడ్డి దృష్టి రాజ్ న్యూస్ మీద ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. దీన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు రావ‌టంతో రాజ్ న్యూస్ వ‌ర్గాలు హ్యాపీగా ఫీలై.. ఆయ‌న‌కు ఇచ్చేందుకు ఓకే చెప్పేయ‌ట‌. ఏపీలో అధికారం ఎట్టి ప‌రిస్థితుల్లో త‌మ‌దేన‌ని భావిస్తున్న జ‌గ‌న్ వ‌ర్గం.. సాక్షికి తోడు అద‌నంగా మ‌రో ఛాన‌ల్ ద‌న్ను త‌మ‌కు ఉండ‌టం మంచిద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

కేసీఆర్ ఏ మోడ్ లో అయితే.. ఒక‌టికి నాలుగు ఛాన‌ళ్ల ద‌న్ను ఉండేలా చూసుకోవ‌టం.. అనుకూల మీడియాను విస్త‌రించే ప‌నిలో ఉన్నారో.. అదే వ్యూహాన్ని విజ‌య‌సాయి ద్వారా జ‌గ‌న్ అనుస‌రించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. రాజ్ న్యూస్.. విజ‌య‌సాయి చేతుల్లోకి వెళ్లిపోయిన‌ట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌ట‌మే ఆల‌స్య‌మ‌ని చెబుతున్నారు.  ఇంత‌కీ ఈ డీల్ ను ఎవ‌రు సెట్ చేశార‌న్న విష‌యం మాత్రం గోప్యంగా ఉండ‌టం విశేషం.
Tags:    

Similar News