పాకిస్తాన్ లో అత్యంత దారుణమైన పరిస్థితులు

Update: 2023-05-03 21:55 GMT
ఉగ్రవాదంను పెంచి పోషించడమే లక్ష్యంగా పెట్టుకుని పరిపాలన సాగించిన పాకిస్తాన్‌ గత పాలకులు మరియు ప్రస్తుత పాలకుల వల్ల దేశం అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో సామాన్యులతో పాటు ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ఆసియాలో అత్యంత వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న దేశం గా పాకిస్తాన్‌ నిలిచింది. మొన్నటి వరకు అత్యంత వేగంగా ద్రవ్యోల్బనం పెరుగుతున్న దేశంగా శ్రీలంక ఉంది. కరోనా తర్వాత మెల్ల మెల్లగా ఆ దేశం ఆర్థికంగా కుదురుకుంటుంది. దాంతో ఆ దేశం ను మించి ఇప్పుడు పాకిస్తాన్ లో ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తున్నట్లుగా ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

1964 తర్వాత పాకిస్తాన్‌ లో ద్రవ్యోల్బణం ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. గత ఏడాది ఏప్రిల్‌ తో పోల్చితే 36.4 శాతం ద్రవ్యోల్బణం పెరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నారు. దాంతో రిటైల్ రంగం తీవ్ర సంక్షోభం ను ఎదుర్కొంటుంది. భారీ ఎత్తున రిటైల్ రంగంలోని రేట్లు పెరిగాయి. అంతే కాకుండా సామాన్యులు ఉపయోగించే వస్తువులు కూడా రెట్టింపు ధరలు పలుకుతున్నాయి.

ఇక పాకిస్తాన్‌ కరెన్సీ పతనం మరింతగా ఆ దేశ ఆర్థిక వ్యవస్ధను దెబ్బతిస్తోంది. గత నెలలో పాక్ రూపాయి జీవిత కాల కనిష్టానికి చేరినట్లుగా అంతర్జాతీయ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కూడా రవాణా ఖర్చులు 56.8 శాతం పెరిగాయి. దాంతో ఆహారంతో పాటు ప్రతి ఒక్క వస్తువు కూడా రేట్లు 50 శాతం వరకు పెరిగినట్లుగా తెలుస్తోంది. హౌసింగ్.. నీరు.. విద్యుత్‌ ఇలా ప్రతి రంగంలో కూడా సామాన్యులకు షాక్ ఇచ్చే విధంగా ద్రవ్యోల్బణం పెరిగింది.

అంతర్జాతీయ స్థాయికి చెందిన సంస్థల నుండి రుణాల కోసం పాకిస్తాన్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందుకు గాను సామాన్యులపై భారీ గా వడ్డీ రేటును పెడుతోంది. దాంతో పాక్ లో ప్రభుత్వం కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఆర్థిక సంక్షోభం నుండి పాకిస్తాన్‌ ఎప్పటికి బయట పడుతుందో ఏ ఒక్కరు చెప్పలేక పోతున్నారు.

Similar News