పాకిస్థాన్‌.. చింత చచ్చినా పులుపు చావలేదు అంటే ఇదే!

Update: 2023-03-04 13:04 GMT
భారత్‌ దాయాది దేశం.. పాకిస్థాన్‌ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఎవరు తమను ఆదుకుంటారా అని బిత్తర చూపులు చూస్తోంది.. ఆ దేశం. చివరకు చైనాలాంటి మిత్ర దేశాలు కూడా పాకిస్థాన్‌ వైపు తొంగిచూడటం లేదు. ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు, చమురు ధరలు, కూరగాయలు, గుడ్లు.. ఇలా ఒకటేమిటి ప్రతిదాని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాకిస్థాన్‌ రూపాయి అమెరికా డాలర్‌ తో పోలిస్తే ఏకంగా 276 రూపాయలకు పడిపోయింది.

తన దాయాది దేశం.. భారత్‌ తనను ఆదుకోవాలని పాక్‌ కోరుకుంటోంది. చివరకు పాకిస్థాన్‌ ప్రజలు సైతం ప్రధాని నరేంద్ర మోడీలాంటి వారు తమకు ఉండి ఉంటే ఇలాంటి కష్టాలు తమకొచ్చేవి కావని భావిస్తున్నారు.

అయితే.. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు అంతర్జాతీయ వేదికలపైన పాకిస్థాన్‌.. భారత్‌ పై విషం కక్కుతూనే ఉంది. తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశంలో మాట్లాడిన పాక్‌ విదేశాంగ మంత్రి హీనా ర బ్బానీ ఖర్‌ ఈ మేరకు ఇండియాపై తన అసూయను బయటపెట్టుకున్నారు.

భారత్‌ కు ప్రపంచ దేశాల నుంచి అత్యాధునిక ఆయుధ సహాయం అందుతోందని పాక్‌ విదేశాంగ మంత్రి ఆరోపించారు. అయితే ఆమె పరోక్షంగా భారత్‌ పేరును ఎత్తారు. అత్యాధునిక ఆయుధ సహాయం అందడం దక్షిణాసియాలో స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందంటూ వ్యాఖ్యానించారు.

పాక్‌ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ మండిపడింది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్‌.. తన ప్రజల గురించి ఆలోచించకుండా తమపై దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పాక్‌ మంత్రి చేసిన వ్యాఖ్యలకు భారత్‌ దీటుగా బదులిచ్చింది.

పాక్‌ ప్రజలు దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా.. పాక్‌ మాత్రం భారత్‌ పై అక్కసు వెళ్లగక్కుతోందని ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి సీమా పుజానీ మండిపడ్డారు. పాకిస్థాన్‌ ప్రాధాన్యత సొంత ప్రజలు కాదని.. భారత్‌ పై దుష్ప్రచారం చిమ్మడమేనని పుజానీ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా దుష్ప్రచారాలు మానుకొని వారి ప్రజల శ్రేయస్సు కోసం పాకిస్థాన్‌ నాయకులు, అధికారులు కృషి చేయాలన్నారు.

ఇక జమ్మూ కశ్మీర్‌ పై తుర్కియే ప్రతినిధితోపాటు ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఐవోసీ) చేసిన వ్యాఖ్యలపైనా పుజానీ విచారం వ్యక్తం చేశారు. అది భారత్‌కు సంబంధించిన అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ వేదికలపై మాట్లాడేటప్పుడు అటువంటి ఉచిత సలహాలకు దూరంగా ఉండాలని తుర్కియే, ఐవోసీలకు సూచించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News