ఆ కుటుంబానికి కలిసిరాని పాలకొండ

Update: 2023-06-23 09:26 GMT
నిమ్మక గోపాల రావు పేరు చెప్తే శ్రీకాకుళం జిల్లా ప్రజలు వివాదరహితుడైన నేత అంటూ గుర్తు చేసుకుంటారు. కొత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009లో ఆ నియోజకవర్గం రద్దవడంతో కొత్తగా ఎస్టీ నియోజకవర్గంగా మారిన పాలకొండ కు మారారు. కానీ, పాలకొండ లో ఆయన కు ఓటమి ఎదురైంది.

ఆ ఓటమి ఆయనకే కాదు ఆయన వారసుడు నిమ్మక జయకృష్ణ కూ తప్పలేదు. రెండు సార్లు వరుస ఓటములు చూసిన పాలకొండ టీడీపీ నేత నిమ్మక జయకృష్ణ ఈసారి గెలుపు కోసమే కాదు టికెట్ కోసం కూడా పోరాడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

2009లో డీలిమిటేషన్ తరువాత కొత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రద్దవడంతో పాటు ఎస్సీ నియోజకవర్గంగా ఉన్న పాలకొండ ఎస్టీ నియోజకవర్గంగా మారింది. దాంతో నిమ్మక గోపాలరావు ను తెలుగుదేశం పార్టీ పాలకొండ నుంచి పోటీ చేయించింది. కానీ.. ఆయన ఆ ఎన్నికల లో కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మక సుగ్రీవులు చేతి లో ఓటమి పాలయ్యారు. అనంతరం 2010లో గోపాలరావు మరణించారు.

దాంతో 2014 ఎన్నికల లో ఆయన కుమారుడు నిమ్మక జయకృష్ణకు టీడీపీ టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల లో రాష్ట్రంలో టీడీపీ విజయం సాధించి చంద్రబాబు సీఎం అయ్యారు కానీ, పాలకొండలో టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ మాత్రం సుమారు 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

వైసీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి ఆయన పై విజయం సాధించారు. ఆ తరువాత 2019 ఎన్నికల కు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. జగన్ గాలి తీవ్రంగా వీయడంతో నిమ్మక జయకృష్ణ కు మరోసారి ఓటమి తప్పలేదు. ఈసారి సుమారు 18 వేల ఓట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.

ఇప్పుడు రానున్న ఎన్నికల లో మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని జయకృష్ణ తహతహలాడుతున్నారు. స్థానికంగా వైసీపీ ఎమ్మెల్యే కళావతి పై వ్యతిరేకత ఉండడంతో ఈసారి టీడీపీ గెలుస్తుందన్న అంచనాలూ బలంగా ఉన్నాయి. కానీ.. పార్టీ లోనే జయకృష్ణ కు పోటీదారులు పెరిగారు.

టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ జయకృష్ణ ను బైపాస్ చేస్తూ సొంతంగా కార్యక్రమాలు చేస్తున్న నేతలూ కనిపిస్తున్నారు. జయకృష్ణ కు టికెట్ రాదని... వచ్చే ఎన్నికలలో టికెట్ తమదేనని ప్రచారం చేసుకుంటున్నారు. మరి.. జయకృష్ణ ఈ పార్టీ లో ప్రత్యర్థుల ను ఎదుర్కొని టికెట్ తెచ్చుకోగలుగుతారా అనేది ఆయన అభిమానుల కు ప్రశ్నగా మారింది.

Similar News