ప‌ళని వ‌ర్సెస్ దిన‌క‌రన్‌..ఎమ్మెల్యేల్లో చీలిక‌

Update: 2017-06-05 05:56 GMT
త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో మ‌రోమారు అనూహ్య‌ మ‌లుపులు చోటుచేసుకునే దిశ‌గా అడుగులు ప‌డుతున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. రెండాకుల గుర్తుకు ముడుపుల కేసులో బెయిల్‌పై విడుదలైన‌ చిన్న‌మ్మ శ‌శిక‌ళ మేన‌ల్లుడు టీటీవీ దినకరన్ త‌న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల ద్వారా త‌మిళ రాజ‌కీయాల్లో హీట్ పెంచేందుకు పావులు క‌దుపుతున్న‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. బెయిల్ అనంత‌రం ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడినప్పుడు తమిళనాడులో ఏం జరుగుతుందో తనకు తెలియదంటూ వ్యాఖ్యానించిన టీటీవీ దినకరన్‌ చెన్నై చేరుకున్న త‌ర్వాత అడయారులోని నివాసంలో తన మద్దతుదారులతో  సుదీర్ఘ మంతనాలు జరిపారు.

అన్నాడీఎంకే (అమ్మ) ఎమ్మెల్యేల్లో చీలిక రాగా చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌ వ‌ర్గంలో కీల‌క నేత అయిన టీటీవీ దిన‌క‌ర‌న్‌ కు మద్దతుగా ఇప్ప‌టికే పది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు నిలిచారు. మరో 20 మంది టీటీవీ దినకరన్‌ శిబిరానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. వారంతా దినకరన్‌ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని, అందువల్ల బేషరతుగా తమ శిబిరానికి రానున్నారని వివరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న బ‌లాబ‌లాలు తెలుసుకునేందుకు మ‌ద్ద‌తుదారుల‌తో స‌మావేశ‌మైన దిన‌క‌రన్‌ రాష్ట్ర రాజకీయ సమీకరణాల గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా అన్నాడీఎంకే (అమ్మ)లో స్థితిగతులు, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కార్యాచరణలు, తన నాయకత్వంలో నడిచేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య తదితర విషయాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం అన్నాడీఎంకే (అమ్మ) వర్గంలోని ఎమ్మెల్యేల్లో తనకు సానుకూలంగా ఉన్నవారి గురించి దినకరన్‌ అడిగి తెలుసుకున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న మ‌ద్ద‌తును చాటుకునేందుకు ఒక‌వేళ దిన‌క‌ర‌న్ ప్ర‌య‌త్నిస్తే....20 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని దినకరన్‌కు ఆయన మద్దతుదారులు తెలిపినట్టు సమాచారం.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి, ఆయ‌నకు మద్ద‌తుగా నిలుస్తున్న మంత్రుల‌పై దిన‌క‌ర‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. బెయిల్‌ పై విడుద‌ల అయిన‌ప్ప‌టికీ టీటీవీ దినకరన్‌ ను కలవబోమంటూ మంత్రి జయకుమార్‌ చేసిన వ్యాఖ్యలపై చిన్న‌మ్మ మేన‌ల్లుడు సుదీర్ఘంగా చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. జ‌య‌కుమార్‌తో స‌హా మరికొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వ్య‌తిరేక‌ వ్యాఖ్యలపైనా దినకరన్‌ తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. అంతేకాకుండా శశికళ బ్యానర్ల తొలగింపు వ్యవహారంపైనా దినకరన్‌ గుర్రుగా ఉన్నారని పార్టీ నేత‌ల‌ సమాచారం. ఇదిలాఉండ‌గా బెంగళూరులోని పరప్పణ‌ సెంట్రల్‌జైల్‌లో నేడు టీటీవీ దినకరన్‌, ఎమ్మెల్యేలు శశికళను కలవనున్నారు. అనంత‌రం భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై స్ప‌ష్ట‌త రానున్న‌ట్లు స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News