వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!

Update: 2019-09-26 05:27 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో అధికార వైసీపీలోకి వలసల పర్వం జోరుగా కొనసాగుతోంది. గత మూడు నెలలుగా టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు వైసీపీలోకి చేరిపోతున్నారు. అదే టైంలో తెలుగుదేశం పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు లేదన్న ఉద్దేశంతో మరి కొందరు బీజేపీలోకి జంప్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజా ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీలు - ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన నేతలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భవిష్యత్తులో కీలక పాత్ర పోషించాలన్న‌ ఉద్దేశంతో వైసీపీ కండువా కప్పుకున్నారు. గుంటూరు జిల్లా బాప‌ట్ల నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ అంత‌కు ముందే బీజేపీలో చేరిపోయారు.

ఇప్పటికే అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన ఆనంద్ కుమార్ వైసీపీలో చేరిపోగా... తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన వరుపుల రాజా సైతం అదే దారిలో ఉన్నారు. ఇక ఇప్పుడు అదే విశాఖ జిల్లా నుంచి టీడీపీకి చెందిన కీలక నేత - మరో మాజీ ఎమ్మెల్యే సైతం వైసీపీలో చేరేందుకు ముహుర్తం రెడీ చేసుకున్నారు. టీడీపీ నేత పంచకర్ల రమేష్‌ బాబు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. విజయదశమి రోజు (అక్టోబరు 8)న ఆయన వైసీపీ కండువా కప్పుకునేందుకు ముహుర్తం పెట్టుకున్నట్టు తెలిసింది.

గంటా శ్రీనివాసరావు వర్గంలో ఉండే పంచ‌క‌ర్ల‌ పెందుర్తి నియోజకవర్గం నుంచి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆతర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌ లో విలీనం కావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు గంటాతో పాటు టిడిపిలోకి జంప్ చేసిన రమేష్‌ బాబు ఎలమంచిలి నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తాజా ఎన్నికల్లో రమేష్ బాబు పెందుర్తి లేదా విశాఖ నార్త్ నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేశారు. ఈ ప్ర‌య‌త్నాలు నెరవేరక పోవడంతో ఆయన మరోసారి ఎలమంచిలిలో పోటీ చేసి ఓడిపోయారు.

ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తే టిడిపిలో రాజకీయ భవిష్యత్తు లేదన్న నిర్ణయానికి వచ్చిన ఆయన వైసీపీలో చేరాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రమేష్ బాబు ఇప్పటికే వైసిపి పెద్దలతో టచ్లోకి వెళ్లగా పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో జరుగనున్న గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో విజయం సాధించేందుకు జిల్లాలో ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలపై ఉన్న వైసిపి రమేష్ బాబుని సైతం తమ పార్టీలో చేర్చుకుని ఏదో ఒక కీల‌క బాధ్యత అప్పగించాలన్న‌ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News