దేశ విభజన..తప్పు ఎవరిది... ?

Update: 2021-12-14 08:30 GMT
భారత దేశం అఖండమైనది. చరిత్ర పుటల్లోకి ఒక్కసారి వెళ్లి చూస్తే ఈ రోజున భారత్ మ్యాప్ చుట్టూ కనిపిస్తున్న బుల్లి బుల్లి దేశాలన్నీ భారత్ లో అంతర్భాగంగా ఒకనాడు ఉండేవి. గట్టిగా చెప్పాలీ అంటే భారత్ భౌగోళిక విస్తీర్ణం చైనాని మించేసి ఉండేది అన్న మాట ఉంది. ఇక భారత్ కనుక ఇంతలా వెలిగిపోయి ఈ రోజుకీ ఉంటే కనుక అమెరికా, చైనా వంటి వాటి కంటే ఎంతో ఎత్తున ఉండి అగ్ర భాగాన అలరారేది.

ఇది ఎవరో చెప్పే మాట కాదు, భారత్ కి ఉన్న శక్తిసామర్ధ్యాలు చరిత్ర పుటాల్లోకి వెళ్తే అందరికీ తెలిసేవే. రత్నగర్భగా భారత్ కి పేరు. ఈ దేశంలో ఉండే సంపద అంతా ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పుకునేలా ఉండేది అన్నది కూడా చరిత్ర చెప్పే మాట. మరి భారత్ కి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఒక్కసారి చరిత్రలో వందల ఏళ్ళ వెనక్కు వెళ్ళాలి. ఇప్పటికి సరిగ్గా ఎనిమిది వందల ఏళ్ళ క్రితం చూసుకుంటే భారతదేశం తొలిసారిగా పరాయి వారి బారిన పడింది.

భారత్ ని తమ స్వాధీనంలోకి తెచ్చుకుని ఎన్నో పరాయి జాతులు, వంశాలు ఏలాయి. ఆ తరువాత రెండు వందల ఏళ్ళ క్రితం చరిత్ర చూస్తే భారత్ ని డచ్చి ఫ్రెంచి వారుతో పాటు ఆంగ్లేయులు ఏలారు. ఇక ఇప్పటికి సరిగ్గా నూటాభై ఏళ్ళ కిర్తం నేడు తాలిబన్ల చేత చిక్కిన ఆఫ్ఘాన్ భారత్ లో అంతర్భాగం అన్న సంగతి కూడా గుర్తుంచుకోవాలి.

ఇలా చాలా ప్రాంతాలు రాజ్యాలు పోయిన భారత్ స్వాతంత్ర పోరాటంలో చివరికి సాధించింది ఏంటి అంటే దేశాన్ని అధికారికంగా రెండు ముక్కలు చేసుకోవడం. మహమ్మద్ ఆలీ జిన్నా మొదట్లో కాంగ్రెస్ తో కలసి ఉద్యమించారు. అయితే మధ్యలోనే అంతా కధ మారింది. ఆయన ఈ దేశంలో ముస్లిములకు రక్షణ లేదని పేర్కొన్నారు. ఆయన వెనక ఉన్నది బ్రిటిష్ వారి కౌటిల్యం అని తెలిసినా ఆ ఉచ్చులో పడిపోవడమే ఈ దేశానికి పట్టిన దుర్గతిగా చెప్పుకోవాలి.

అప్పటికి తొంబై ఏళ్ళుగా బ్రిటిష్ వారి మీద పోరాడుతున్న భారతీయ నాయకులు చివరిలో తొందర పడ్డారా లేక ఒత్తిళ్లకు గురి అయ్యారా. లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తెలియదు కానీ మత ప్రాతిపదికన పాకిస్థాన్ ఏర్పాటు కావడానికి జిన్నాతో పాటు నాడు చాలా మంది ఇతర ముస్లిమేతర నాయకులు కూడా కారణం అని చరిత్ర చెబుతోంది. మతం మత్తు మందు అంటారు, అది కూడు పెట్టదు,  అలాగే మతం పేరుతో రాజ్యం స్థాపించినా కూడా అది సంపూర్ణత్వాన్ని సాధించలేదు అన్నదే పాక్ విషయంలో ఏడున్నర దశాబ్దాలుగా ప్రపంచం చూస్తున్న సత్యం.

మరో వైపు చూసుకుంటే పాకిస్థాను విడిపోయాక భారత్ బావుకున్నది లేదు, రక్షణ వ్యయం కోసం  ఖజానా నుంచి వేల లక్షల కోట్ల రూపాయలు ఈ ఏడున్నర పదుల కాలంలో వెచ్చించడం జరిగింద్. మూడు యుద్ధాలు అకారణంగా జరిగాయి. అయినప్పటికీ శాంతి అన్నది లేదు, ఉగ్రవాదం పెరిగిపోయింది. భారత్ రెండుగా చీలిపోవడం చైనా వంటి వాటికి కలసి వచ్చిందనే చెప్పాలి. ఈ రోజు దాయాది పాక్ ని అడ్డం పెట్టుకుని చైనా భారత్ మీద కత్తులు నూరుతోంది. అలాగే తాలిబన్లకు ఊతమిస్తూ తనతో పాటు ఉపఖండంలో కూడా అశాంతికి పాక్ కారణం అవుతోంది అన్న విమర్శ ఉంది.

ఒకవేళ పాకిస్థాన్ విడిపోకపోయి ఉంటే ఏం జరిగేది అంటే ఫరూఖ్ అబ్దుల్లా వంటి వారు చెబుతున్నట్లుగా అంతా ఒక్కటిగా ఉండేవారు. ముస్లిం లు హిందువుల మధ్య సామరస్యం పూర్తిగా ఉండేది. అది దేశానికి ఎంతో బలమయ్యేది. తరువాత రోజుల్లో పుట్టిన బంగ్లాదేశ్ కూడా భారత్ లో అంతర్భాగంగా ఉండేది. ఇక బ్రిటిష్ వారు విడదీసిన ఆఫ్ఘన్ కూడా భారత్ లో ఏదో రోజు కలసిపోయి ఉండేది. ఇక్కడ మరో మాట కూడా ఉంది.

దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత నేపాల్ భారత్ తో విలీనం అవుతామని ప్రతిపాదన పెట్టిందని, దాన్ని అప్పటి పాలకులు పట్టించుకోలేదని అంటారు. అదే జరిగితే ఆసియా ఖండంలో భారత్ అతి పెద్ద దేశంగా అజేయంగా వెలిగేది. కానీ దేశ విభజన అన్న ఒక్క అనాలోచిత చర్య ఈ రోజు అనేక అగచాట్లకు కారణం అవుతోంది. ఇది చారిత్రాత్మక తప్పిదం. మరి దిద్దుబాటు ఉంటుందా. అఖండ భారత్ కోసం దేశంలోని ప్రేమికులు కనే కలలు సాకారం అవుతాయా. ఏదీ అసాధ్యం అయితే కాదు, వేచి చూడడమే అంతవరకు.
Tags:    

Similar News