వంగ‌వీటి-వ‌ల్ల‌భ‌నేని!..ఈ కెలుకుడేందిరా సామీ?

Update: 2018-01-18 10:49 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ పొలిటిక‌ల్ కేపిట‌ల్ గా ఉన్న విజ‌య‌వాడ‌లో ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఒక‌టే చ‌ర్చ‌. దివంగ‌త కాపు నేత వంగ‌వీటి మోహ‌న రంగా కుమారుడు - వైసీపీ నేత‌ - మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాకృష్ణ‌... వైసీపీకి హ్యాండిచ్చేసి టీడీపీలోకి చేరిపోతార‌ట‌. అదే స‌మ‌యంలో టీడీపీలో యువ‌నేత‌గా ఉన్న గ‌న్న‌వ‌రం శాస‌న‌స‌భ్యుడు వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్... సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పేసి... వైసీపీలో చేరిపోతార‌ట‌. ఈ రెండు అంశాల‌పైనే విజ‌య‌వాడ ప్ర‌జ‌లు... మొత్తంగా ఏపీ ప్ర‌జ‌లు చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అయినా ఇది ఊహ‌కు అంద‌ని విష‌మ‌యే అయినా... ఈ త‌ర‌హా మార్పులు గ‌నుక జ‌రిగితే... ఎవ‌రికి లాభం? ఎవ‌రికి న‌ష్టం? ఎవ‌రెవ‌రికి ఎంత‌మేర లాభం? ఈ రెండు మార్పుల‌తో టీడీపీకి ప్ల‌స్సా?  లేదంటే వైసీపీకి ప్లస్సా? అనే కోణంలోనే ఈ చ‌ర్చ‌ల‌న్నీ జ‌రిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు ఈ వార్త‌ల్లో నిజ‌మెంత? అన్న విష‌యంపైనా పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయినా ఈ త‌ర‌హా పుకార్ల‌పై అటు వంగ‌వీటి రాధా గానీ - ఇటు వ‌ల్ల‌భ‌నేని వంశీ గానీ మాట మాత్రంగా కూడా ప‌లికిన సంద‌ర్భం లేదు. మ‌రి ఈ వార్త‌ల‌ను ఎవ‌రు పుట్టించారు? ఎవ‌రు వండి వార్చారు? అంటే... ఇంకెవ‌రు? ఎప్పుడు ఏదో ఒక సంచ‌ల‌నాన్ని తాను ముందుగానే ప‌సిగట్టాన‌ని జ‌బ్బ‌లు చ‌రుచుకునే మీడియానేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

నిజ‌మే మ‌రి... వంట‌వీటి రాధా - వ‌ల్ల‌భ‌వ‌నేని వంశీలు త‌మ‌కు తాముగా చెప్ప‌కుండానే వారు పార్టీ మారుతున్నార‌ని చెప్ప‌డానికి అత్యుత్సాహంతో ప‌రుగులు పెడుతున్న మీడియా కాకుండా ఎంకెవ‌రు ఈ విష‌యాల‌ను బ‌య‌ట‌కు తీస్తారు చెప్పండి. వంగ‌వీటి రాధా ఎపిసోడ్ నే తీసుకుంటే... వైసీపీ అధిష్ఠానం వ్య‌వహారంపై వంగ‌వీటి రాధా తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని - ఆయ‌న నేడో - రేపో వైసీపీకి వీడ్కోలు ప‌లికేసి టీడీపీలో చేరిపోతార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారాన్ని వంగ‌వీటి ఖండించాల‌ని ఏమీ లేదు. ఎందుకంటే... ఆ దిశ‌గా ఒక్కటంటే ఒక్క మాట కూడా రాధా నోట నుంచి రాలేదు. దీంతోనే ఆయ‌న ఈ త‌ర‌హా ప్ర‌చారంపై కిమ్మ‌న‌కుండా త‌న ప‌నేదో తాను చూసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలో ఈ వార్త‌ల‌ను వండి వార్చేసిన ఓ మీడియా సంస్థ‌... నిన్న పెన్నూ పేప‌రు. మైకూ కెమెరా ప‌ట్టుకుని వంగ‌వీటి ముంద‌ట వాలిపోయింది. పార్టీ మారుతున్నార‌ట క‌దా? అని వంగ‌వీటిని అడిగి... తాను రాసిన వార్త‌ల‌ను గుర్తు చేసింది. దీంతో స‌ద‌రు ఛానెల్‌ - ప‌త్రికా ప్ర‌తినిధుల వ్య‌వ‌హారంపై కాస్తంత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన రాధా... మీరు వార్త‌లు రాసేసి - న‌న్ను స్పందించ‌మ‌ని కోరితే ఎలాగంటూ క‌డిగి పారేశారు. అప్ప‌టికీ ఆ మీడియా ప్ర‌తినిధులు శాంతించ‌క‌... వంగ‌వీటి నోటి నుంచి పార్టీ మార్పున‌కు సంబంధించి చిన్న మాట అయినా రాబ‌ట్టేందుకు శ‌త‌విధాలా య‌త్నించి చివ‌ర‌కు స‌ఫ‌లం కాలేక నిరుత్సాహంగా వెనుదిరిగారు.

రాధా ఎపిసోడ్ ముగిసిందో - లేదో... ఇప్పుడు వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ విష‌యాన్ని మీడియా మ‌ళ్లీ భుజానికెత్తుకుంది. గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యేగా - ఆ ప్రాంత ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం అహ‌ర‌హం శ్ర‌మిస్తున్న నేత‌గా వంశీకి మంచి పేరే ఉంది. అప్పుడెప్పుడో విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. న‌డిరోడ్డుపై వంశీని ఆలింగ‌నం చేసుకున్న విష‌యాన్ని మ‌ళ్లీ ఇప్పుడు గుర్తు చేస్తూ ఓ మీడియా సంస్థ వంశీ టీడీపీని వీడుతున్నార‌ని - వైసీపీలో చేరిపోతున్నార‌ని త‌న‌కు తానే ఓ అంచనాకు వ‌చ్చేసి వార్త‌ను వండి వార్చేసింది. దీనిపై ఓ టీవీ ఛానెల్ ప్ర‌తినిధులు వంశీని... రాధాను ముప్పు తిప్ప‌లు పెట్టేందుకు ఓ మీడియా ప్ర‌తినిధులు య‌త్నించిన మాదిరిగానే వంశీకి కూడా య‌క్ష ప్ర‌శ్న‌లు వేశారు. అయితే వంశీ కూడా రాధా మాదిరే ఈ త‌ర‌హా అనుమానాలు - వార్త‌లు మీకు ఎలా అందుతున్నాయో నాకే తెలియ‌దంటూ స‌ద‌రు ఛానెల్‌ పై చిర్రుబుర్రులాడార‌ట‌. దీంతో చేసేదేమీ లేక ఈ ఛానెల్ ప్ర‌తినిధులు కూడా తొలి ఛానెల్ ప్ర‌తినిధుల మాదిరే త‌మ ప్లాన్ స‌క్సెస్ కాక‌పోవ‌డంతో నిరాశ‌గానే వెనుదిరిగిపోయార‌ట‌. అయినా లేనిపోని అంశాల‌ను క‌ట్టు క‌థ‌లుగా అల్లేసి... అవే నిజ‌మైనవంటూ జ‌నం మీద ప‌డితే ఇలాగే ఉంటుంది మ‌రి.
Tags:    

Similar News