'ఆళ్ల' ఫ్యామిలీలో టికెట్ ర‌గ‌డ‌.. సింప‌తీ డామినేట్ చేస్తోందా..?

Update: 2023-07-10 12:00 GMT
ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీలో టికెట్ ర‌గ‌డ అంత‌ర్గ‌త కుమ్ములాటల కు దారితీస్తోందనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌ప్పుడు ఆళ్ల రామ‌కృష్నా రెడ్డి పేరు మార్మోగేది. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఎక్క‌డ చూసినా.. ఆయ‌న అన్న‌య్య‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆళ్ల అయోధ్య‌రామిరెడ్డి ఫెక్సీలు క‌నిపిస్తున్నాయి. ఎవ‌రి నోట విన్నా.. ఆయ‌న మాటే వినిపిస్తోంది.

ముఖ్యంగా ప‌లు మండ‌లాల్లో అయితే.. భారీ ఫ్లెక్సీలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అక్క‌డ రోడ్లు, ఇంటింటికీ తాగునీరు(జ‌ల‌జీవ‌న్ మిష‌న్ ద్వారా) వంటి ప‌నులు జోరుగా సాగుతున్నాయి. దీంతో అంతా ఎంపీ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంద‌నే ప్ర‌చారం జోరుగా ఉంది. ఇక‌, మ‌రోవైపు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రామ‌కృష్ణారెడ్డికి టికెట్ క‌ష్ట‌మేన‌ని.. ఆయ‌న‌ను వేరే స్థానానికి పంపించే అవ‌కాశం ఉంద‌ని కూడా కొంద‌రు చెబుతున్నారు.

మంగ‌ళ‌గిరి నుంచి అయోధ్య‌రామిరెడ్డి పోటీకి సై అంటున్నార‌ని.. ఆళ్ల వ‌ర్గానికే చెందిన కొంద‌రు లీకులు ఇస్తున్నారు. మ‌రి ఇదే విష‌యంలో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య కూడా.. వివాదం నెల‌కొంద‌ని, అందుకే దాదాపు రెండు నెల‌లుగా ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి బ‌య‌ట‌కు కూడా రావ‌డం లేద‌ని.. పార్టీ అధిష్టానం కూడా ఆయ‌న‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం మానేసింద‌ని ఒక వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. ప్ర‌స్తుతం పార్టీకి కావాల్సింది.. గెలుపు ఒక్క‌టేన‌ని చెబుతున్నారు.

ఎవ‌రు పోటీ చేసినా మంగ‌ళ‌గిరిని గెలిస్తే.. చాల‌న్న‌ట్టుగా పార్టీ అధిష్టానం ఉన్న‌ట్టు మెజారిటీ నాయ‌కులు చెబుతున్నారు. ఇది వాస్త‌వ‌మేన‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న లెక్క‌ల ప్ర‌కారం మంగ‌ళగిరిలో ఆళ్ల అయోధ్య‌రామిరెడ్డి ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని.. ఆయ‌నైతే.. గెలుపు గుర్రం సునాయాసంగా ఎక్కుతార‌ని, మంచి పేరు కూడా ఉంద‌ని పార్టీ కూడా లెక్కులు వేస్తున్న‌ట్టు చెబుతున్నా రు. మొత్తానికి ఎమ్మెల్యే టికెట్ వ్య‌వ‌హారం ఆళ్ల ఫ్యామిలీలో ర‌గ‌డ పెడుతోంద‌ని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు కూడా చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

Similar News