జనవరి 18 నుండి హార్దిక్ పటేల్ కనిపించడం లేదు: భార్య ఆందోళన

Update: 2020-02-10 17:26 GMT
గుజరాత్ కాంగ్రెస్ లీడర్ - పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ జనవరి 18వ తేదీ నుండి కనిపించడం లేదని ఆయన భార్య కింజల్ ఆరోపించారు. 2015 దేశద్రోహం కేసులో ఇరవై రెండో రోజుల క్రితం ఆయనను అరెస్ట్ చేసారని - అప్పటి నుండి ఆచూకీ లేదని సోమవారం అన్నారు.

ఐదేళ్ల క్రితం పటీదార్ కోటా ఉద్యమం సమయంలో ఆయనపై ఈ కేసు నమోదయింది. విచారణకు హాజరు కానందుకుగాను ఆయనకు న్యాయస్థానం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో జనవరి 18న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత నాలుగు రోజులకు ఆయనకు బెయిల్ వచ్చింది. ఆ తర్వాత మరో రెండు కేసుల్లో ఆయనను వెంటనే అరెస్ట్ చేశారు. ఈ రెండు కేసులు పఠాన్ - గాంధీ నగర్ జిల్లాల్లో నమోదయ్యాయి.

జనవరి 24వ తేదీన ఈ రెండు కేసుల్లోను అతనికి బెయిల్ వచ్చింది. అయితే విచారణకు హాజరుకాకపోవడంతో ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 7వ తేదీన మరోసారి హార్దిక్‌ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

జనవరి 18వ తేదీన అరెస్ట్ అయిన నాటి నుండి హార్దిక్ పటేల్ జాడలేదని - అతను ఎక్కడున్నాడో తమకు తెలియకపోయినప్పటికీ పోలీసులు తరుచూ తమ ఇంటికి వచ్చి ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పాలని ప్రశ్నిస్తూనే ఉన్నారని కింజల్ అన్నారు. పటీదార్ కోటా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

2015 పటీదార్ ఉద్యమం సందర్భంగా - ఆ తర్వాత 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉద్యమంలో పాల్గొన్న వారిపై 1,500 వరకు కేసులు నమోదయ్యాయని - వాటిని ఉపసంహరించుకోవాలని పటీదార్ కోటా నాయకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. హార్దిక్ పటేల్ పైన గుజరాత్ వ్యాప్తంగా 20కి పైగా కేసులు నమోదయ్యాయి.
Tags:    

Similar News