కేంద్రమంత్రి వర్గంలోకి పవన్, టీడీపీ మాజీ నేతలు?

Update: 2021-06-12 11:30 GMT
ప్రధాని నరేంద్రమోడీ కేంద్ర కేబినెట్ ను ప్రక్షాళన చేయాలని రెడీ అయిపోతున్నారు. పనిచేయని మంత్రులకు స్వస్తి పలికి పనిచేసే మంత్రులకు చోటు ఇవ్వాలని డిసైడ్ అవుతున్నారు. ప్రధానిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న మోడీకి ఈ రెండేళ్లు కరోనా చుక్కలు చూపించింది. ఇప్పుడు సెకండ్ వేవ్ తగ్గడంతో ఇప్పుడు పాలనపై దృష్టిసారించారు.

మరో ఆరు నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో ప్రధాని మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్ని రాష్ట్రాలకు కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం ఉండేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రధాని మోడీ కేబినెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేదు. ఏపీలో ఒక్క బీజేపీ ఎంపీ గెలవకపోవడంతో ఎవరికి కేంద్రమంత్రి పదవి ఇవ్వలేదు. ఏపీ బీజేపీ నేతలు రాజ్యసభలో ఉన్న కూడా చోటివ్వలేదు.ఈ క్రమంలోనే ఈసారి తెలంగాణకు మరో మంత్రిపదవి ఇవ్వడంతోపాటు ఏపీ నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలని కమలనాథులు యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఏపీ తరుఫున ప్రస్తుతం ఒక్క లోక్ సభ ఎంపీ లేరు. రాజ్యసభ నుంచి మాత్రం జీవీఎల్ నరసింహరావు ఒక్కరే ఉన్నారు. కానీ ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీనుంచి బీజేపీ రాజ్యసభ ఎంపీగా సురేష్ ప్రభు ఉన్నారు. అయితే జీవీఎల్ పార్టీకి విధేయుడిగా పేరుంది. దీంతో ఆయనకు ఈసారి అవకాశం ఇస్తారనే చర్చ సాగుతోంది. పురందేశ్వరి పేరు కూడా తాజాగా వినిపిస్తోంది.

ఇక టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ ఎంపీలు ఆశలు పెంచుకున్నారు. సుజనా చౌదరి ఇప్పటికే మోడీ కేబినెట్ లో పనిచేశారు. సీఎం రమేశ్ కీలకంగా ఉన్నారు.

ఇక ఏపీలో జనసేనతో పొత్తులో వెళ్తున్న బీజేపీకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు కేంద్ర మంత్రివర్గంలో చోటిస్తుందనే ప్రచారం మొదలైంది. పవన్ కు కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణలోనూ బీజేపీకి ప్రయోజనం కలుగుతుందని లెక్కలు వేస్తున్నారట.. సీఎం జగన్ ను ఎదుర్కోవాలంటే పవన్ ను బలంగా నిలబెట్టడం అవసరమని కమలనాథులు భావిస్తున్నారట.. ఈ మేరకు పవన్ కు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ నేతలు కోరుతున్నట్టు తెలిసింది. బీజేపీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News