జగన్ మీదకు పవన్ : తమాషా చూస్తున్న చంద్రబాబు...!

Update: 2023-07-11 09:01 GMT
కాగల కార్యం గంధర్వులు నెరవేరుస్తారు అని ఒక ముతక సామెత ఉంది. అది అక్షరాలా చంద్రబాబుకు పవన్ కి సరిపోతుంది అనుకోవాలేమో. చంద్రబాబుది అర్ధ దశాబ్దపు కాలం పండిన రాజకీయం. ఆయన ఎర్ల్సీ సెవెంటీస్ నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు. అప్పటి ట్రెండ్ నుంచి ఈ రోజు వరకూ చూస్తున్నారు. వయసు ఏడున్నర పదులు.

బాబు ఎంతలా దూకుడు చేసినా ఈ తరం పొలిటికల్ లాంగ్వేజ్ మాట్లాడలేరు. బాబుకంటూ ఒక ఇమేజ్ ఉంది. అయినా సరే బాబు కూడా దూకుడు పెంచారు. పీకుడూ లాగుడూ భాషను కొంత వాడుతున్నారు. కానీ ఆయన ఇంకా తగ్గలేరు. ఆయనకు ఇపుడు  కాగల కార్యం  నెరవేర్చే నేతగా  పవన్ కళ్యాణ్ తోడుగా నిలబడినట్లుగా ఉంది ఏపీ రాజకీయం చూస్తే.

పవన్ వర్సెస్ జగన్ అన్న ఎపిసోడ్ ని చంద్రబాబు కంటే బాగా ఎంజాయ్ చేసే వారు ఎవరూ ఉండరేమో అంటారు. ఎందుకంటే ఆయనకు జగన్ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి. ఫ్యూచర్ లో ఎపుడైనా పవన్ అవుతారో అవరో ఎవరికీ తెలియదు. ప్రస్తుతానికి బాబుని ఒక్క మాట కూడా అనకుండా జగన్ మీదనే తన బాణాలు అన్నీ ఎక్కుపెట్టి అభినవ అర్జునుడిగా పవన్ పోరాడుతున్నారు.

స్వతహాగా పవన్ ఆవేశపరుడు అంటారు. ఆయనకు సినీ గ్లామర్ అధికం. కులం కూడా కలసివస్తోంది. దాంతో ఆయన జనాదరణకు లోటు ఉండదు. నిజానికి 2019లో పవన్ సినిమాలు ఆపేసి ఉంటే ఏమయ్యేదో కానీ ఇంకా ఆయన నటిస్తున్నారు. ఆ క్రేజ్ మోజూ ఆయనకు ఫుల్ గా రాజకీయాల్లో ఉపయోగపడుతోంది. పవన్ ఒక విధంగా జగన్ అండ్ కో కి కొరకరాని కొయ్యగా మారిపోయారు.

ఆయన దూకుడు చేస్తూ ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడే మాటలకు కౌంటర్ వైసీపీ నుంచి ఎంత వస్తే అంతగా రెచ్చిపోతారు. ఎక్కడా తగ్గరు. అలాగని పవన్ వెనకాల ఏమీ చూసుకోరని కాదు, ఆయనకు తెలుసు ఒకేసారి తెలుగుదేశం వైసీపీలతో పోరు చేస్తే ఎలా ఉంటుందో. అందుకే ఆయన టీడీపీని ఏమీ అనకుండా వైసీపీనే గురి పెడుతున్నారు.

ఆ విధంగా టీడీపీ అనుకూల మీడియా నుంచి ఆయనకు కావాల్సినంత సపోర్టు వస్తోంది. దాంతో పాటు ఒక పెద్ద పార్టీ దన్ను కూడా ఇండైరెక్ట్ గా ఉండనే ఉందన్న ధైర్యం జనసేనది. అలా ఇపుడు వైసీపీ మీదకు పవన్ దూసుకుని వెళ్తుంటే ఏమి చేయాలో అర్ధం కాని స్థితిలో ఆ పార్టీ ఉంది. మామూలుగా చూస్తే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. వాటికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ ఉంటుంది. కానీ పవన్ పొలిటిషియనా అంటే ఆయన పూర్తి స్థాయిలో కాదు అనే అంటారు. అలాగని కాదా అంటే అవును అని చెప్పాలి, ఎందుకంటే పార్టీ ఉంది. అధినాయకుడు అతనే.

ఆయన వైసీపీ మీద మాటలతో దాడి చేస్తూంటే తన వారాహి వాహనం ఎక్కి జగన్ నీ సన్నిహితుడిని పంపు చెవుల్లో రక్తాలు కార్చేలా నీ సీక్రెట్స్ చెబుతాను అని గర్జించి పది రోజులు గడిచాయి. ఇపుడు మళ్ళీ అంతకంటే ఎక్కువ ఆవేశంతో ముందుకు వచ్చి జగన్ నిన్ను ఏకవచనంతో సంబోధిస్తాను, నీవు క్రిమినల్ వి నీవు సీఎం ఏంటి ఖర్మ అంటూ బహిరంగంగా వేలాది మంది ముందు మాట్లాడుతున్నా వైసీపీ డిఫెన్స్ లో పడుతోంది తప్ప పూర్తి స్థాయిలో అఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళలేకపోతోంది.

ఒక విధంగా పవన్ రాజకీయం ఏంటో ఎవరికీ ఎంత విశ్లేషించినా అర్ధం కాదు. ఆయన విడిగా పోటీ చేస్తారా కలివిడిగా చేస్తారా అనంది పక్కన పెడితే వైసీపీని తన బాణాలతో తుత్తునియలు చేసే ప్రొగ్రాం మాత్రం సక్సెస్ ఫుల్ గా చేస్తున్నారు. ఇందుకోసం ఆయన పొలిటికల్ కెరీర్ ని కూడా ఫణంగా పెడుతున్నారా అని ఒక దశలో డౌట్లు వచ్చినా రావచ్చు. పవనే అంటూంటారు. నేను విజయం సాధిస్తారో లేదో కానీ పోరాటం ఆపను అని.

అంటే ఆయనకు వైసీపీని టార్గెట్ చేయడం కంటే వేరే పెద్ద ఆశలు ఉన్నాయా అన్న చర్చ కూడా వస్తోంది. సాధారణంగా రాజకీయాలలో మన గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఎదుటి వారిని తక్కువగా చూపిస్తారు. కానీ పవన్ పూర్తి భిన్నం. ఆయన వైసీపీనే నిందిస్తూ సభలు పెడుతున్నారు. జగన్ని పట్టుకుని నీవు సీఎం పదవిని అనర్హుడివి అంటున్నారు. అయినా వైసీపీ నుంచి గట్టి కౌంటర్లు రాలేని పరిస్థితి ఉంది.

చిత్రంగా పవన్ సభలు పెట్టినపుడు కానీ ఆయనతో వైసీపీ నేతలు మీడియా ముఖంగా డైలాగ్ వార్ మొదలెట్టినపుడు కానీ టీడీపీ ఎక్కడా సీన్ లో కనిపించడంలేదు. చంద్రబాబు అయితే ఇంత పెద్ద రచ్చ ఏపీలో జరుగుతున్నా ఏపీకి చెందిన సీనియర్ పొలిటిషియన్ గా పెదవి విప్పడంలేదు. వాలంటీర్ల వ్యవస్థ మీద తన అభిప్రాయం కూడా చెప్పడంలేదు. అంతా తమాషాగా చూస్తున్నారు. ఇది ఎక్కడికైనా వెళ్ళనీ తమకే లాభమన్న తీరులో టీడీపీ ఉంది.

మొత్తానికి చోద్యం టీడీపీ చిత్తగిస్తూంటే వైసీపీ కకావికలం అయిపోతోంది. పవన్ అనే ఒక వ్యక్తిని, శక్తిని ఎదుర్కోవడం ఎలా అన్నది వైసీపీకి అర్ధం కావడంలేదు. ఇదే డైలామా కంటిన్యూ అయితే మాత్రం అది చివరికి టీడీపీక లాభించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే పవన్ ఏమి మాట్లాడారని కాదు, ఆయన వైసీపీ యాంటీ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ దారిలో సైకిల్ పరుగులు తీసేందుకు బాబు తెర వెనక బ్రహ్మాండంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదీ ప్రస్తుతం విశ్లేషిస్తే అర్ధమవుతున్న విషయం. ఇంతకు మించి ఉందేమో కాస్తా రోజులు  గడిస్తే కానీ తెలియదు అంటున్నారు.

Similar News