గ్రేట‌ర్ ప్ర‌చారంపై ప‌వ‌న్ అంత‌ర్మ‌థ‌నం.. రీజ‌నేంటి?

Update: 2020-11-23 10:30 GMT
గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి.. కార్పొరేష‌న్ పీఠాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని క‌ల‌లుకంటున్న బీజేపీ.. అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలోనే త‌మ మిత్రుడు..  జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డంలో ఇప్ప‌టి వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల్లో తాను కూడా బ‌రిలోకి దిగుతాన‌ని.. 50 వార్డుల్లో జ‌న‌సేన నేత‌లు రంగంలోకి దిగుతార‌ని కూడా ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నారు. అంతేకాదు.. బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తాన‌ని కూడా హామీ ఇచ్చారు.

కానీ, ఎన్నిక‌ల ప్ర‌చారానికి మ‌రో ఐదు రోజులు మాత్రమే గ‌డువు ఉండ‌డం, ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీ అయిన టీఆర్ ఎస్ దూకుడుగా ముందుకు సాగుతుండ‌డం వంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. బీజేపీ త‌ర‌ఫున కీల‌క ప్ర‌చార‌క‌ర్త‌గా భావిస్తున్న ప‌వ‌న్ మాత్రం మౌనం వీడ‌డం లేదు. గ్రేట‌ర్‌లో ఎన్నిక‌లు పెట్టుకుని ఆయ‌న ఇప్పుడు ఏపీలో జ‌న‌సేన‌ను బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి పెట్టారు. నాలుగు రోజుల టూర్ పెట్టుకుని విజ‌య‌వాడ‌లోనే మ‌కాం వేశారు. దీంతో గ్రేట‌ర్ బీజేపీ నేత‌లు త‌ల ప‌ట్టుకుంటున్నారు.అస‌లు ప‌వ‌న్ త‌మ‌కు ప్ర‌చారం చేస్తారా?  లేదా? అని వారు చ‌ర్చించుకుంటున్నారు.

మ‌రోప‌క్క‌, తెలంగాణ‌లో రాజ‌కీయాలు వ‌డివ‌డిగా మారిపోతున్నాయి. తాజాగా సినీ వ‌ర్గాలు సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యాయి. లాక్‌డౌన్ స‌మ‌యంలో సినిమా హాళ్లు మూత‌బ‌డ్డాయ‌ని, ఈ క్ర‌మంలో వాటికి వ‌చ్చిన క‌రెంటు బిల్లును మాఫీ చేయాల‌న్నది వారి ప్ర‌ధాన డిమాండ్‌, దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. దీంతో ఇప్పుడు ప‌నిగ‌ట్టుకుని తాను ప్ర‌చారంలోకి దిగి.. కేసీఆర్‌ను ఆయ‌న పార్టీని విమ‌ర్శిస్తే.. సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌పై వ్య‌తిరేక‌త వ‌స్తుందేమోన‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

దీంతో ప‌వ‌న్ అంత‌ర్మ‌థ‌నంలో ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇదిలావుంటే.. మ‌రోప క్క‌, బీజేపీ... మాత్రం ప‌వ‌న్ వ‌స్తాడు.. ప్ర‌చారం చేస్తాడు.. అంటూ.. అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్ప‌టికే త‌మ జెండాల‌తో పాటు జ‌న‌సేన ప‌త‌కాల‌ను కూడా క‌ట్టుకుని ప్ర‌చారం చేస్తున్నారు నేత‌లు. మ‌రి ఇప్ప‌టికైనా.. ప‌వ‌న్ నోరు విప్పుతారా?  అటు ప్ర‌చారం అయినా చేస్తారా?  లేక ఇటు చేయ‌లేన‌నైనా చెబుతారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News