ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతులెత్తేశాడా... విలీనంపై హింట్ వ‌చ్చిందా ?

Update: 2021-07-09 00:30 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం అన్న చిరంజీవి బాట‌లోనే ప్ర‌యాణిస్తున్నాడా ?  అంటే తాజాగా ప‌వ‌న్ నోటి వెంట వ‌చ్చిన మాట‌లు చూస్తే అవున‌న్న సందేహాలు వ‌స్తున్నాయి. ప‌వ‌న్ అన్న చిరంజీవి త‌న ప్రజారాజ్యం పార్టీతో కుళ్లుపోయిన ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను కూక‌టివేళ్ల‌తో పెక‌లించి స‌రికొత్త ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తాన‌ని చెప్పారు. నాటి స‌మైక్య రాష్ట్రంలో ప్ర‌జారాజ్యం 18 సీట్ల‌తో స‌రిపెట్టుకోగా.. తాను పోటీ చేసిన రెండు చోట్లా ఒక్క చోట మాత్ర‌మే విజ‌యం సాధించారు. ఇక త‌ర్వాత త‌న ప్ర‌జారాజ్యంను కాంగ్రెస్‌లో విలీనం చేసి తాను రాజ్య‌స‌భ‌కు ఎంపిక కావ‌డంతో పాటు తాను కేంద్ర మంత్రి అయ్యారు. చిరును న‌మ్ముకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఎంతో మంది కోట్లు పోగొట్టుకుని బికారులు అయ్యారు.

అదంతా గ‌తం.. ఇక రెండేళ్ల క్రితం చిరు త‌మ్ముడు ప‌వ‌న్ సైతం జ‌న‌సేన పార్టీతో ఏపీలో పోటీ చేశారు. తాను పార్టీ అధ్య‌క్షుడి హోదాలో గాజువాక‌, భీమ‌వ‌రంలో పోటీ చేశారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ పార్టీని గాలికి వ‌దిలేశారు. ప్ర‌స్తుతం పార్టీ విష‌యాలు నాదెండ్ల మ‌నోహ‌ర్ మాత్ర‌మే చూసుకుంటున్నారు. ప‌వ‌న్ మ‌ళ్లీ వ‌రుస సినిమాల్లో బిజీఅయిపోయారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే మ‌రో రెండేళ్ల పాటు ప‌వ‌న్‌కు తీరిక లేని షెడ్యూల్ ఉంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఎన్నిక‌లు... అప్ప‌టిక‌ప్పుడు జ‌నాల్లోకి వెళ్లి వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనే ప‌రిస్థితి ఉంటుందా ? అన్న‌ది డౌటే ?

ఇదిలా ఉంటే ప‌వ‌న్‌కు పార్టీ న‌డిపే ఉద్దేశం ఉందా ?  లేదా ? అన్న చిరు బాట‌లోనే విలీనం దిశ‌గా ఆలోచ‌న చేస్తున్నాడా ? అంటే ఇప్పుడు అవే సందేహాలు వ‌స్తున్నాయి. రెండు రోజుల క్రితం ప‌వ‌న్ పార్టీ కేడ‌ర్‌తో జ‌రిగిన స‌మావేశంలో పార్టీని ప‌టిష్టం చేద్దామ‌న్న‌ట్టుగా కాకుండా.. పార్టీని న‌డ‌ప‌డం చాలా క‌ష్ట‌మ‌న్న‌ట్టుగా మాట్లాడారు. అప్పుడు చిరంజీవి సైతం పార్టీ ఓట‌మి త‌ర్వాత పార్టీ కేడ‌ర్‌తో జ‌రిగిన స‌మావేశంలో పార్టీని విలీనం చేస్తార‌న్న వార్త‌లు వ‌చ్చిన‌ప్పుడు అదేం లేదంటూ కొంత హ‌డావిడి చేశారు. త‌ర్వాత పార్టీని న‌డ‌ప‌డం క‌ష్ట‌మ‌ని చెప్పారు.

చివ‌ర‌కు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. చిరు రాజకీయంగా ఆయ‌న వ‌ర‌కు సేఫ్‌గా కేంద్ర మంత్రి అయ్యారు. సేమ్ ఇప్పుడు ప‌వ‌న్ నోటి నుంచి కూడా అవే మాట‌లు రిపీట్ అయ్యాయి. దీంతో జ‌న‌సేన అభిమానుల‌కే కాకుండా... రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ జ‌న‌సేన బీజేపీలో విలీనం చేస్తున్నారా ? అన్న సందేహాలు మొద‌ల‌య్యాయి. ప‌వ‌న్ ఎన్నిక‌ల్లో ఓడిపోయాక గాజువాక‌, భీమ‌వ‌రం వైపే చూడ‌లేదు. ఒక‌వేళ ప‌వ‌న్ పార్టీని బీజేపీలో విలీనం చేయ‌డం అంటూ జ‌రిగితే రాజ్య‌స‌భ‌తో పాటు కేంద్ర సహాయ మంత్రి ప‌ద‌వి కూడా ఖాయ‌మే అంటున్నారు. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తాడో ?  చూడాలి.
Tags:    

Similar News