ఎట్ట‌కేల‌కూ జ‌న‌సేన క‌మిటీలొచ్చాయ్!

Update: 2020-02-25 15:30 GMT
ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌న్ మ్యాన్ ఆర్మీ అన్న‌ట్టుగా న‌డిచిన జ‌న‌సేన ఎట్ట‌కేల‌కూ క‌మిటీల రూపం సంత‌రించుకుంటున్న‌ట్టుగా ఉంది. పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది జ‌న‌సేన పార్టీ. ఇటీవ‌లే బీజేపీతో జ‌న‌సేన పొత్తు కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్పుడు  ఆ పార్టీ క‌మిటీలు వేయ‌డం ఆస‌క్తిదాయ‌కంగా మారింది. ఈ క‌మిటీలోని స‌భ్యులకు ముందస్తు ష‌ర‌తు ఏమిటంటే.. వీళ్లంతా బీజేపీతో స‌మ‌న్వ‌యం చేసుకుని ప‌ని చేయాల‌ట‌.

అయితే జ‌న‌సేన రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తూ ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కొన్ని పార్ల‌మెంట‌రీ సీట్ల ప‌రిధిలో మాత్ర‌మే ఈ క‌మిటీలు ఏర్పాటు అయ్యాయి. ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రి, సెంట్ర‌ల్ క‌మిటీలు మాత్ర‌మే నియ‌మితం అయ్యాయి. ఈ ప్రాంతాల ప‌రిధిలోకి వ‌చ్చే ఎంపీ సీట్ల ప‌రిధిలో క‌మిటీలు వేశారు. వాటిలో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఇన్ చార్జిల‌ను నియ‌మించిన‌ట్టుగా ఉన్నారు.

అలాగ‌ని అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కూ బాధ్యులు లేరు. ఎంపీ సీటుకు అంటూ కూడా ప్ర‌త్యేకంగా ఇన్ చార్జిలు లేరు. సంయుక్త క‌మిటీలు అంటూ.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల వాళ్ల‌ను మాత్ర‌మే ఇన్ చార్జిలుగా ప్ర‌క‌టించారు. మిగ‌తా వాటి ఊసు మాత్రం లేదు.

అవ‌కాశం ఉన్న చోట బాధ్యుల‌ను ప్ర‌క‌టించి.. వాటికి సంయుక్త క‌మిటీలు అని పేరు పెట్టిన‌ట్టుగా ఉన్నారు. అయితే ఈ సంయుక్త క‌మిటీల‌ను రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేయ‌లేని స్థితిలో ఉన్న‌ట్టుగా ఉంది జ‌న‌సేన పార్టీ. ఇన్నాళ్ల‌కు జ‌న‌సేన‌లో క‌నీసం ఈ మాత్రం క‌మిటీలు ఏర్పాటు కావ‌డం విశేష‌మే.


    

Tags:    

Similar News