హ్యాండ్ టు హ్యాండ్ తేల్చుకుందామని పవన్ కళ్యాన్ రంగంలోకి దిగారు.. టీడీపీ, చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో యాత్రను నేటితో ముగించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తాజా ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన యాత్ర జగరకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని... ఆధారాలతో సహా ఈరోజు బయటపెట్టడం ఏపీలో సంచలనమైంది.
జనసేనాని పవన్ కళ్యాన్ ప్రస్తుతం శ్రీకాకుళం యాత్రలో ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్రలో వలసలు ఎక్కువైపోయాయి. ఇక ఎంతో మంది చదువుకున్న వారు.. చదువుకోని వారు అభివృద్ధి ఉపాధి లేక వలసలు పోతున్నారు. ఇన్నేళ్లు అధికారంలో ఉన్నా స్థానికుడైన మంత్రిగా చేసిన అశోక్ గజపతి రాజు ఏం చేసినట్టు’ అని విమర్శలు గుప్పించారు.
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు - పవన్ మధ్య వివాదాలు ఇప్పటివి కావు.. కేంద్రమంత్రిగా అశోక్ గజపతిరాజు ఉన్నప్పుడు ‘పవన్ కళ్యాన్ అంటే ఎవరో తనకు తెలియదు అని’ ఆయన అనడం వివాదాస్పదమైంది. దీనికి కౌంటర్ గా ‘మీ పార్టీ కోసం ప్రచారం చేసి గెలిపించిన వ్యక్తి మీకు తెలియకపోవడం సిగ్గుచేటు’ అంటూ పవన్ స్పందించిన విషయం తెలిసిందే. ఈ వాదప్రతివాదనల నడుమ ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తాజా గా చంద్రబాబు చేస్తున్న కుట్రకోణాన్ని బయటపెట్టి సంచలనం రేపాడు.
పవన్ కళ్యాన్ మాట్లాడుతూ.. తన యాత్రను కొనసాగినవ్వకుండా చంద్రబాబు కుట్ర పన్నుతున్నాడంటూ బాంబు పేల్చారు.. ‘తెలుగుదేశం ప్రభుత్వం జనసేన యాత్రను జరగకుండా వ్యక్తిగత కక్షలు పెంచుకొని తనపైన , జనసేన కార్యకర్తలపై దాడులకు దిగుతోందని’ పవన్ మండిపడ్డాడు. అంతేకాదు.. తాను పర్యటించే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కట్ చేస్తూ తన ప్రచారాన్ని జనం టీవీల్లో చూడకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని.. ఇప్పటికే 15మంది జనసేన నాయకులను పొగిరి ప్రాంతంలో అరెస్ట్ చేశారని ప్రభుత్వాన్ని ఎండగట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో పవన్ యాత్ర ముగిసిపోవడంతో రేపటి నుంచి విజయనగరం జిల్లాలో పవన్ యాత్ర మొదలు కాబోతోంది. యాత్రకు ఆటంకం కలిగిస్తున్న ప్రభుత్వ తీరును పవన్ ప్రముఖంగా ప్రస్తావించడంతో టీడీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి.