ప‌వ‌న్ తాజా డైలాగ్ ఏం కామెడీ బాస్‌!

Update: 2019-07-31 16:25 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ? ఆయనకే తెలియదు పవన్ సినిమాలో లాజిక్కులు ఉండవు... ఇక ఆయన మాట్లాడే మాటల్లోనూ అదే కనిపిస్తూ ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చి ఐదేళ్లు అవుతున్న పవన్ ఇప్పటికీ ఏ విషయంలోనూ స్పష్టమైన క్లారిటీ ఇవ్వ‌డ‌న్న అపవాదు ఎదుర్కొంటున్నారు. తాజాగా పవన్ మాట్లాడిన మాటలు చూస్తే కామెడీగా ఉన్నాయ‌ని అనిపించక మానదు. బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో రాజమహేంద్ర‌వ‌రానికి చెందిన పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. జగన్‌ పై పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఈ సమావేశంలో పవన్ మాట్లాడుతూ జగన్‌ పై కేసులు లేకపోతే ఆయన ప్రజల్లో తిరిగే వారు కాదని... కూర్చునే రాజకీయం చేసే వార‌ని ప‌వ‌న్‌ చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి మోదీ సంవత్సరం అంతా తిరుగుతున్నారని చెప్పిన పవన్ చంద్రబాబు - లోకేష్ ఊరూరా తిరుగుతున్నారా ? వీళ్లు ఎవరు తిర‌గ‌రని విమర్శించారు. ప్రజల మధ్య నాయకులు ఉండాలని... ప్రతి రోజు ప్రజలను కలిసేలా నాయ‌కులు ఉండాల‌ని సూచించారు. అక్కడితో ఆగని పవన్ జగన్ ను టార్గెట్‌ గా చేసుకుని మరో సంచ‌ల‌న వ్యాఖ్య‌ కూడా చేశారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయాక ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డిని సీఎంను చేయాలని ఆనాడు ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కోరుకున్నారని... ఆ రోజు అలా జరగ‌లేద‌నే జగన్ రోడ్లపై తిరిగి కష్టపడి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారని చెప్పారు. జగన్ కష్టాన్ని కాదనడం లేదంటూనే... తాను కూడా రోడ్లపై తిరిగేందుకు సిద్ధంగా ఉన్నానని.... అయితే అభిమానులు తాను రోడ్ల మీద తిరిగితే త‌న‌ను ముక్క‌లు ముక్క‌లుగా చేసి శ‌రీరాన్ని పీక్కు పోతార‌ని చెప్ప‌డం విచిత్రాల‌కే విచిత్రం. ఈ వ్యాఖ్య‌లు చాలా కామెడీగా ఉన్నాయ‌న్న సెటైర్లు కూడా ప‌డుతున్నాయి.

త‌న‌ను చూడ‌డానికి వ‌చ్చే ప్ర‌జ‌లను - అభిమానుల‌ను అదుపు చేయ‌లేక సెక్యూరిటీ సిబ్బంది కూడా అలసిపోతార‌ని... ఈ క్ర‌మంలోనే తాను రోడ్ల‌పైకి రావాలంటే ఇన్ని ఆలోచించాలి. అలా అని నేను రాకుండా ఉండన‌ని చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే ప‌వ‌న్ త‌న‌ను తాను ఎంత ఎక్కువ ఊహించుకుంటున్నారో ?  అర్థ‌మ‌వుతోంది. కోట్లాది మంది క్రేజ్ ఉన్న రాజ‌కీయ నాయ‌కులు - సినిమా వాళ్లు ప్ర‌జ‌ల్లోకి వ‌స్తుంటారు. నాడు ఎన్టీఆర్ నుంచి వైఎస్సార్‌ - జ‌గ‌న్ లాంటి వాళ్ల‌కు ఉన్న పొలిటిక‌ల్ అభిమానుల్లో ప‌వ‌న్‌ కు ప‌దో వంతు కూడా ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ ప‌వ‌న్ ఊహ‌లు చూస్తుంటే ఎన్నిక‌ల రిజ‌ల్ట్ త‌ర్వాత కూడా ఆకాశంలోనే విహ‌రిస్తున్న‌ట్టు ఉంది.

   

Tags:    

Similar News