బాబుకు దిక్కెవ‌రు అంటున్న ప‌వ‌న్‌?

Update: 2018-05-31 17:37 GMT
ఏపీ రాజ‌కీయాలు హాట్ హాట్‌ గా మారుతున్నాయి. ఏపీ ముఖ్య‌మంత్రి - నారా చంద్ర‌బాబు నాయుడు ఇర‌కాటంలో ప‌డేసేలా...ఆయ‌న‌కు రాబోయే ఎన్నిక‌ల్లో చుక్క‌లు చూపించేందుకు ప్ర‌తిప‌క్షాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ చంద్ర‌బాబు స‌ర్కారు త‌ప్పిదాల‌ను ప్ర‌జాక్షేత్రంలో ఎత్తిచూపిస్తూ టార్గెట్ చేస్తుండ‌గా...బీజేపీ సైతం కేంద్రం చేసిన స‌హాయం విష‌యంలో ఎదురుదాడి చేస్తోంది. దీనికి తోడుగా తాజాగా ప‌వ‌న్ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఏకంగా బాబు డిఫెన్స్‌లో ప‌డే వ్యాఖ్య‌లు చేశారు. జనసేన పోరాట యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి నియోజకవర్గ కేంద్రాల్లో కవాతు నిర్వహించారు. ఆయా కేంద్రాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పవన్ కల్యాణ్  మాట్లాడుతూ “చెప్పిన మాట మీద నిలబడకుండా పదేపదే మాటలు మార్చేవాళ్లు వద్దు. ఒకటే మాట ఒకటే బాణం అనే నాయకులు కావాలి.`` అని అన్నారు.

నవ నిర్మాణ దీక్షల కోసం వేసే పందిళ్ళకి రూ.13 కోట్లు నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి గిరిజన ప్రాంతాల్లో వంతెనలకి డబ్బులు ఇవ్వపోవడాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తప్పుప‌ట్టారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో మాట మారుస్తూ ప్రజల్ని పదేపదే మోసం చేస్తున్నారని స్పష్టం చేశారు. ``అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్ళేందుకు మరో అవకాశం కావాలని ముఖ్యమంత్రి అడుగుతున్నారు. 2014లో మీకు పవన్ కల్యాణ్, జన సైనికులు అండగా ఉన్నారు. 2019లో మీకు ఎవరు ఉంటారు?`` అంటూ బాబు టీం అవాక్క‌య్యే ప్ర‌శ్న‌లు ప‌వ‌న్ సంధించారు. గిరిజనుల్ని ఓట్లుగా చూస్తూ వారి అభివృద్ధిని పాలకులు విస్మరిస్తున్నారని చెప్పారు. ``ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ లో 50 శాతం ఒకే కంపెనీకి ఇచ్చారు. శిలాఫలకం తప్ప ఇండస్ట్రి రాలేదు. ఉద్యోగాలు మాత్రం రాలేదు. ఉత్తరాంధ్ర యువత ఉపాధి కోసం వలసలు పోతున్నారు. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు గారు ఎందుకు మీకు ఓట్లు వేయాలి. బొబ్బిలిలో జూట్ మిల్లులు మూసేశారు. జనసేన వారికోసం గళం విప్పుతుంది`` అని ప‌వ‌న్ తెలిపారు.

టీడీపీ ప్రభుత్వానికి గిరిజన ప్రాంతాలు అన్నా, ఉత్తరాంధ్ర అన్నా చిన్న చూపు అని ప‌వ‌న్ ఆరోపించారు. ``కనీస అవసరాలు కూడా తీర్చారు. విద్య, వైద్యం అడుగుతున్నా వాటిని కూడా తీర్చరు.  ఇప్పటికీ కనీస రోడ్డు వసతి లేదు. కురుపాం దగ్గర పూర్ణపాడు వంతెన కట్టేందుకు రూ.10 కోట్లు నిధులు లేవు. ముఖ్యమంత్రి కుటుంబం హైదరాబాద్ లో ఫైవ్ స్టార్ హోటల్లో నివాసం ఉంటే రూ.150 కోట్లు ప్రభుత్వం బిల్లు కట్టిందట. అంగన్వాడీ టీచర్లకి జీతాలు ఇచ్చేందుకు మాత్రం డబ్బులు ఉండవు. బొబ్బిలిలో జూట్ మిల్ కార్మికుల పెన్షన్ ఇప్పించలేకపోతున్నారు... మిల్ యజమాన్యంతో మాట్లాడి. వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నారో మరి. పార్వతీపురం మునిసిపాలిటీలో రోడ్లు సరిగా లేవు. రంగు మారిన నీళ్ళు తాగేందుకు సరఫరా చేస్తున్నారు. కనీస బాధ్యత లేదా? పెదపెంకి గ్రామంలో బోదకాలు వ్యాధితో జనం బాధలుపడుతున్నా ఇక్కడి ప్రజా ప్రతినిధులకి పట్టడం లేదు. కురుపాం ప్రాంతంలో ఇప్పటికీ గిరిజనులు వైద్యం కోసం కిలో మీటర్ల కొద్దీ నడచి రావాల్సి వస్తోంది. ఆసుపత్రుల్లో వైద్య, పారా మెడికల్ సిబ్బంది ఉండటం లేదు. ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీని నిర్వీర్యం చేసేశారు. సింగపూర్ తరహా కట్టడాలు, అభివృద్ధి అనే ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రలో గిరిజన గ్రామాలకు కనీస సౌకర్యాల గురించి ముందు ఆలోచించాలి. కౌమార దశకి వచ్చిన ఆడపిల్ల ఆరోగ్య సంరక్షణ, నెలసరి అవసరాలకి నేస్తం పేరుతో ఇచ్చే కిట్ విషయంలోనూ పాలకులు కక్కుర్తి పడుతున్నారు. కాంట్రాక్టర్ ని ఫైనలైజ్ చేయకుండా డబ్బుల కోసం చూస్తున్నారు. ఇలాగేనా ఆడబిడ్డల రక్షణ చూసేది?`` అని ప‌వ‌న్ నిల‌దీశారు.

జనసేన ఎవరు అన్యాయం చేసినా నిలదీసి ప్రశ్నిస్తుందని, మూడో ప్రత్యామ్నాయంగా ఉంటుందని ప‌వ‌న్ తెలిపారు. ``జంఝావతి, తోటపల్లి ప్రొజెక్ట్స్ పూర్తి చేయరు. ఎందుకంటే కృష్ణా, గుంటూరు వైపు పనులే కావాలి. అభివృద్ధి అంటే అమరావతి మాత్రమేనా?. విజయనగరం జిల్లాలోని రైతులకి అవసరమైన తాగు నీరు ఇచ్చే ప్రొజెక్ట్స్ పూర్తి చేయడం లేదు. ఈ ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర అంటే చిన్న చూపు. ఇలాగే పాలన సాగిస్తే కళింగాంధ్ర ఉద్యమం వచ్చే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్ర మేధావులు అన్నీ లెక్కలూ తీస్తున్నారు. ఇలాంటి ఉద్యమ సూచనలు కనిపిస్తున్నాయి`` అని ప‌వ‌న్ అన్నారు.


Tags:    

Similar News