బాల‌కృష్ణ‌కో న్యాయం...నాకో న్యాయ‌మా?:ప‌వ‌న్

Update: 2018-11-06 08:04 GMT
త‌న త‌ల్లిని అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించడంపై కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేసిన కొంత‌మంది మీడియా అధినేత‌ల‌పై - కొన్ని మీడియా చానెళ్ల‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌న‌సేన అధ్య‌క్షుడు - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కొద్ది రోజుల క్రితం విరుచుకుపడిన సంగ‌తి తెలిసిందే. త‌న‌ను ప్ర‌త్యేకించి టార్గెట్ చేసి వార్త‌లు ప్ర‌సారం చేస్తున్నార‌ని ప‌వ‌న్ అప్ప‌ట్లో ఆరోపించారు. దాదాపుగా ట్విట్ట‌ర్ నే త‌న అన‌ధికారిక మీడియా చానెల్ గా మార్చుకున్న ప‌వ‌న్....త‌న‌పై దుష్ప్ర‌చారం చేసిన చానెళ్ల‌పై సంచ‌ల‌న ట్వీట్లు చేశారు. కొన్ని మీడియా చానెళ్ల‌పై సుదీర్ఘ‌మైన న్యాయ‌పోరాటం చేయ‌బోతున్నాన‌ని ప‌వ‌న్ అన్నారు. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ కు కొన్ని మీడియా చానెళ్ల‌కు మ‌ధ్య మినీ వార్ జ‌రిగింది. కొంద‌రు చానెళ్ల అధిప‌తులు ప‌వ‌న్ పై కేసుల వ‌ర‌కూ వెళ్లారు. తాజాగా, మ‌రోసారి ప‌వ‌న్...మీడియా చానెళ్ల‌పై మండిప‌డ్డారు. ‘వేల కోట్లు దోచుకుంటున్న మైనింగ్‌ కంపెనీ ‘ఆండ్రూ’ యజమానిని తాను లఫూట్‌ అని తిడితే వ‌రుస‌గా డిబేట్లు పెట్టార‌ని - ప్ర‌ధాని మోదీ తల్లిని బాల‌కృష్ణ తూలనాడితే డిబేట్లు పెట్ట‌ర‌ని మండిప‌డ్డారు. త‌న‌కు వేల కోట్ల డ‌బ్బులేద‌ని - చానెళ్లు లేవ‌ని....జ‌న‌సైనికులే త‌న చాన‌ళ్లు - ప‌త్రిక‌లు - ఫేస్ బుక్ లు అని ప‌వ‌న్ ఉద్వేగ‌పూరితంగా ప్ర‌సంగించారు.

మైనింగ్‌ కంపెనీ ‘ఆండ్రూ’ అక్రమాలపై మండిప‌డ్డ ప‌వ‌న్...ఆ కంపెనీ య‌జ‌మానిని లఫూట్ అని తిట్టిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ అలా తిట్ట‌డంపై కొన్ని తెలుగు చానళ్ల‌లో డిబేట్ పెట్టారు. ఈ నేప‌థ్యంలో ప్రజాపోరాటయాత్రలో భాగంగా సోమవారం రాత్రి పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో ప‌వ‌న్...మీడియా పై ప‌వ‌న్ ధ్వజమెత్తారు. ‘ఆండ్రూ’ యజమానిని తాను లఫూట్‌ అని నేను తిడితే డిబేట్లు పెట్టార‌ని - కానీ - మోదీ తల్లిని బాలకృష్ణ తూలనాడితే డిబేట్లు పెట్టర‌ని ప‌వ‌న్ మండిప‌డ్డారు. మాదిగలను కులం పేరుతో దూషించి - ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసిన  దెందులూరు ఎమ్మెల్యేపై డిబేట్ లు పెట్ట‌ర‌ని అన్నారు. రిజర్వ్ ఫారెస్టులో అడ్డగోలుగా బాక్సైట్ దోచేవాడిని తాను లఫూట్ అని తిడితే డిబేట్లు పెడతారా? అని ప్ర‌శ్నించారు. త‌న ద‌గ్గ‌ర వేల కోట్ల డ‌బ్బులేద‌ని - చానళ్లు లేవ‌ని... త‌న చానళ్లు - పత్రికలు - ఫేస్‌ బుక్ లు - రేడియోలు.. జ‌నసైనికులేన‌ని ప‌వ‌న్ అన్నారు.

ఈ సంద‌ర్భంగా జల్సా సినిమాలో త్రివిక్ర‌మ్ రాసిన డైలాగ్ ను ప‌వ‌న్ గుర్తుచేశారు. ” చెప్పిన దాంట్లో అవసరమైన దాన్ని వదిలేసి అనవసరమైన దాన్ని పట్టుకొని వేలాడే వాణ్ణే గూట్లే అంటారురా గూట్లే” అన్న డైలాగ్ ను ప‌వ‌న్ చెప్పారు. ప్రస్తుతం తెలుగు మీడియా పరిస్థితి కూడా ఇలాగే ఉంద‌న్నారు. తెలుగు మీడియాకు నిజంగా బాధ్యత ఉంటే `ఆండ్రూ` మైనింగ్ అక్రమాల‌పై వ‌చ్చిన ఆరోపణపై డిబేట్ పెట్టి ఉండేదన్నారు. ఆ ఆరోపణలో వాస్త‌వ అవాస్త‌వాలు త‌ర్వాత తేలుతాయ‌ని - ఆ సమస్యపై మీడియా డిబేట్ ఎందుకు పెట్ట‌ద‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. అది వ‌దిలేసి - పవన్ కళ్యాణ్ మాట్లాడిన మొత్తం విష‌యంలో ఒక పదంపై ఆ చానెల్స్ డిబేట్ లు పెట్టాయ‌ని - సోషల్ మీడియాలో కూడా ఈ చానళ్ల‌ తీరు పై తీవ్ర విమర్శలు వస్తున్నాయని ప‌వ‌న్ అన్నారు.
Tags:    

Similar News