ప‌వ‌న్ ను న‌డిపిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్‌ లు

Update: 2017-01-28 05:56 GMT
గ‌త ఎన్నిక‌ల్లో చెమ‌టోడ్చి మ‌రీ గెలిపించి ఇప్పటివరకూ మిత్రపక్షంగా ఉన్న అధికార తెలుగుదేశం పార్టీతో జనసేన అధినేత - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్  ఇక తెగతెంపులు చేసుకున్నట్లేనని చెప్తున్నారు. ఇప్పటివరకూ కేవలం ఆ పార్టీ ఎంపీలనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన పవన్.. తాజాగా సీఎం - తెదేపా అధినేత చంద్రబాబునూ లక్ష్యంగా చేసుకుని సంధించిన ఘాటు విమర్శనాస్త్రాలు పరిశీలిస్తే  ఇదే అర్థమ‌వుతోంద‌ని అంటున్నారు. చంద్రబాబు-పవన్ మధ్య ఇప్పటివరకూ కొనసాగుతున్న సుహృద్భావ - అవగాహన రాజకీయాలకు ఇక తెరపడనున్నట్లు పవన్ వైఖరి స్పష్టం చేస్తుందంటున్నారు. పవన్ అప్పుడప్పుడూ తెదేపా ఎంపీలపై విమర్శలు చేసినా ఆ పార్టీ దాన్ని పట్టించుకోకుండా ఆయన మా మిత్రపక్షమేనని తేలిగ్గా కొట్టిపారేస్తున్నా - పవన్ మాత్రం తన పదును అంతకంతకూ పెంచి - చివరగా బాబునే లక్ష్యంగా చేసుకునే స్థాయికి చేరడం ఆసక్తికర పరిణామంగా మారింది. తాజాగా బాబుపైనా విమర్శనాస్త్రాలు సంధించి తాను బాబుకు ఇకపై మిత్రుడిని కాదన్న సంకేతాలు స్పష్టం చేశారని అంటున్నారు.అయితే దీని వెనుక ప‌వ‌న్‌కు స‌ల‌హా ఇచ్చే ఐఏఎస్‌  - ఐపీఎస్‌ లు ఉన్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ఇప్పటివరకూ బాబును తప్ప పార్టీ నేతలను తూర్పారపెట్టిన పవన్.. తాజాగా బాబు తప్పుచేస్తున్నారని రెండున్నరేళ్ల తర్వాత విమర్శించడం - ఆయనకు పాలనానుభవం ఉన్నందుకే ఎన్నికల్లో మద్దతునిచ్చానని చెప్పడం, హోదా పేరు చెప్పి ఓట్లు దండుకున్న బాబు - ఇప్పుడు నాలుక మడత పెట్టారని విమర్శించడం ద్వారా.. ఇక బాబు దారిలో తాను వెళ్లేది లేదని పవన్ స్పష్టం చేసినట్టయింది. గత కొద్దిరోజుల నుంచి టీడీపీ ఎంపీ రాయపాటి సాంబ‌శివ‌రావుపై ప‌వ‌న్ విమర్శలు సంధిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు చుట్టూ చేరిన సుజనాచౌదరి - రాయపాటి వంటి వారిని బాబు ప్రోత్సహిస్తున్న తీరును ఎండగడుతూ, పరోక్షంగా ఆయన ఒక సామాజికవర్గానికి కొమ్ముకాస్తున్నారన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. తాజాగా  ఏపీలో టీడీపీ పాలన లేదని, మినీ బీజేపీలా మారిందన్న విమర్శల వెనుక బాబు వెనుక వెంకయ్యనాయుడు ఉన్నారన్న విషయాన్ని కూడా పవన్ చెప్పకనే చెప్పినట్టయింది. సింగపూర్ ఆదర్శమనే బాబు, అక్కడ అవినీతికి పాల్పడిన తన అనుచరులను సింగపూర్ అధ్యక్షుడు శిక్షించినట్లే తన సహచరుల అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి, బాబును ఇరుకున పెట్టడం చర్చనీయాంశమయింది. తెలుగుదేశం-బీజేపీ ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని, మేం తిరగబడితే తట్టుకోలేరని హెచ్చరించటం ద్వారా ఇకపై రెండు పార్టీలపై యుద్ధం ప్రకటించినట్టేనన్న సంకేతాలు పంపినట్టయింది.

ఇన్నాళ్లు సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించిన ప‌వ‌న్ హఠాత్తుగా రూటు మార్చడానికి కారణాలు అనేకం ఉన్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు జగన్ దూకుడుతో వెళుతుంటే - రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న తాము మాత్రం ఇంకా ప్రభుత్వం పట్ల మెతకగా వ్యవహరిస్తే, వెనుకబడిపోతామని పవన్‌ కు గత కొంతకాలం నుంచీ సలహాలిస్తున్న మాజీ ఐఏఎస్ - ఐపీఎస్ సూచనలతో ఆయన దారి మార్చుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదగాలంటే, తెదేపాతో కలసి ఉన్నామన్న భావనకు తెరదించాల్సిన అవసరం ఉందన్న సలహాదారుల సూచన మేరకే ఆయన వ్యూహం మార్చుకుని, ప్రభుత్వంపై ఎదురుదాడి ప్రారంభించినట్లు చెబుతున్నారు. పవన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు నిశితంగా గమనిస్తున్న తెలుగుదేశం వర్గాలు కూడా ఇక పవన్ సొంత దారి చూసుకుంటున్నారన్న నిర్దారణకు వస్తున్నాయి. ప్రధానంగా గురువారం వివిధ జిల్లాల్లో జరిగిన హోదా నిరసన కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు తొలిసారిగా రోడ్డెక్కిన వైనాన్ని తెదేపా అంచనా వేసి, అందులో పాల్గొన్న వర్గాలపై విశ్లేష‌ణ ప్రారంభించినట్లు సమాచారం. అయితే, అప్పుడే పవన్‌ పై దూకుడు వద్దని, మరికొంత కాలం వేచిచూద్దామన్న నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News