`హెప‌టైటిస్` పై చ‌ర్య‌ల‌కు ప‌వ‌న్ డిమాండ్!

Update: 2018-03-29 17:02 GMT
కొద్ది రోజులుగా గుంటూరు న‌గ‌రంలో డ‌యేరియా కేసులు న‌మోద‌వ‌డం, ఆ కార‌ణంగా కొంద‌రు మృత్యువాత ప‌డ‌డం తెలిసిందే. 2 వారాల క్రితం డ‌యేరియా బారిన ప‌డి 23 మంది మ‌ర‌ణించ‌డం రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. న‌వ్యాంధ్ర రాజ‌ధానికి ఆనుకొని ఉన్న గుంటూరు న‌డిబొడ్డులో డ‌యేరియా వ్యాపించ‌డం - చాలామంది ప్ర‌జ‌లు అనారోగ్యం పాలై ఆసుప‌త్రుల్లో చేర‌డం ప‌లువురిని క‌ల‌చి వేసింది. క్ర‌మేపీ డ‌యేరియా కేసులు పెరిగినా ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా - గుంటూరు న‌గ‌రంలో వైర‌ల్ హెపటైటిస్ కార‌ణంగా ముగ్గురు మ‌ర‌ణించారు. దీంతో, వైర‌ల్ హెప‌టైటిస్ విస్త‌రించ‌కుండా చర్యలు చేపట్టాలని ఏపీ సర్కారుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం నాడు లేఖ రాశారు. ఈ నెల మార్చి 15న గుంటూరు జ‌న‌రల్ హాస్ప‌ట‌ల్ కు వెళ్లిన ప‌వ‌న్...అక్క‌డ చికిత్స పొందుతున్న డ‌యేరియా బాధితులను ప‌రామ‌ర్శించిన విష‌యం విదిత‌మే.

2 వారాల క్రితం గుంటూరులో డయేరియా బారిన ప‌డి 23 మంది మ‌ర‌ణించార‌ని - ఇప్పుడు వైరల్ హెపటైటిస్ ముగ్గుర్ని బలితీసుకుంద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. మ‌ర‌ణించిన బాలింత సాధులక్ష్మీ - లావణ్య (22) కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాన‌ని ప‌వ‌న్ అన్నారు. వారిలో ఒక బాలింత - రోజుల శిశువు - మరో మహిళ ఉన్నార‌ని - ఈ మరణాలకు కూడా కలుషిత నీరే కారణమని డాక్టర్లు చెబుతున్నారని ప‌వ‌న్ లేఖ‌లో రాశారు. రామిరెడ్డి తోటతోపాటు ప్రకాష్ నగర్ - గుంటూరువారి తోట ప్రాంతాలలో మరో 180 మంది ఈ వ్యాధి బారిన ప‌డ్డార‌ని - ఆ ప్రాంతాలలో మానిటరింగ్ చేసేందుకు జనసేన బృందం పర్యటించి వివరాలు, వీడియో సేకరించింద‌ని ప‌వ‌న్ తెలిపారు. నెల రోజులుగా ఆ ప్రాంతాలలో తాగునీరు - డ్రెయినేజీలో కలవడం వల్ల కామెర్ల వ్యాధి వ్యాప్తి చెందిందని త‌మ శ్రేణుల‌కు ప్ర‌జ‌లు తెలిపార‌ని ప‌వ‌న్ అన్నారు. ఆ వివరాలను అధికారులకు అందిస్తామ‌ని - పరిస్థితి అదుపుతప్పకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా - కలుషిత నీరు సరఫరా కాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప‌వ‌న్ కోరారు.

మార్చి 15న గుంటూరు జీజీహెచ్ ను సంద‌ర్శించిన ప‌వ‌న్....టీడీపీ స‌ర్కార్ కు 48 గంట‌ల డెడ్ లైన్ ఇచ్చారు. త‌క్ష‌ణ‌మే డ‌యేరియాను అరిక‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలని కోరారు. తాజాగా, హెప‌టైటిస్ మ‌ర‌ణాల‌పై స్పందించారు. ప‌వ‌న్ రాసిన లేఖ ....టీడీపీ స‌ర్కార్ క‌ళ్లు తెరిపించేలా ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అక్క‌డ ప‌రిస్థితి దారుణంగా ఉన్నప్ప‌టికీ కూడా టీడీపీ స‌ర్కార్ నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డంపై ప‌లువురు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. ప్ర‌జ‌లకు సుర‌క్షిత‌మైన తాగునీరు కూడా అందించ‌లేని ప్ర‌భుత్వంపై మండిప‌డుతున్నారు. వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టి సుర‌క్షిత నీరు స‌ర‌ఫ‌రా చేయ‌లాని - డ్రైనేజీ పైపు లీకేజీని అరికట్టాల‌ని - బాధితుల‌కు ప్ర‌భుత్వం మెరుగైన  చికిత్స్ అందించాల‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు. ప‌రిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంద‌న్న విష‌యాన్ని ఇక‌నైనా ప్ర‌భుత్వం గుర్తించి క‌ళ్లు తెరవాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.  


Tags:    

Similar News