జగన్‍‌ తో కలిస్తే నేను ఉండను: బీజేపీతో పొత్తు పై పవన్ కళ్యాణ్

Update: 2020-02-15 17:27 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం కీలకవ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ-ఎన్డీయేతో వైసీపీ కలిస్తే తాను కమలం పార్టీకి దూరమవుతానని తేల్చి చెప్పారు. మూడు రాజధానులను నిరసిస్తూ మందడంలో రైతులు, మహిళలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీరికి జనసేనాని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

అవసరమైతే, అన్నీ పరిశీలించి ఎన్డీయేలో చేరుతామని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించినట్లుగా జరిగిన ప్రచారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో జనసేనాని కూడా మందడంలో ఈ అంశంపై స్పందించారు. వైసీపీకి, బీజేపీకి ఎలాంటి పొత్తు లేదన్నారు. పొత్తుపై వైసీపీ నేతలు అబద్దాలు చెబుతున్నారని, ఒకవేళ అదే నిజమైతే తాను బీజేపీ-వైసీపీ కూటమిలో ఉండనని చెప్పారు. బీజేపీ అలా చేస్తుందని తాను భావించడం లేదన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను తప్పుగా అనుకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.

అలాగే, మూడు రాజధానులకు మోడీ, అమిత్ షా అనుమతిచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారని, అది వాస్తవం కాదన్నారు. కేంద్రం పెద్దలను ఈ వివాదంలోకి లాగవద్దన్నారు. వైసీపీ ప్రచారంపై వారు కూడా హెచ్చరిస్తున్నారన్నారు. కేంద్రం అన్నివిషయాల్లో జోక్యం చేసుకోలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటలు ఉండవని, ఏం చేసినా లిఖితపూర్వకంగా ఉంటాయని గుర్తు చేశారు.

బీజేపీ - జనసేనకు మధ్య షరతులతో కూడిన పొత్తు ఉందని, బీజేపీ కూడా ఈ గందర గోళానికి తెరదించేలా ఓ ప్రకటన చేయాలని సూచించారు. తాను బీజేపీతో కలవడానికి ముందు అమరావతి గురించే మాట్లాడానని చెప్పారు. జగన్ చేసే తప్పుల్ని వారికి రుద్దుతున్నారని, రాజధాని ఇక్కడే ఉంటుందని, అప్పటి వరకు పోరాటం సాగుతుందన్నారు.

జై అమరావతి అని తాను ప్రత్యేకంగా అనాల్సిన అవసరం లేదని, నా మనసులో ఉంది కాబట్టే మీ ముందుకు వచ్చానని చెప్పారు. జై అమరావతి అని నేను అంటే జై కర్నూలు, జై విశాఖ అని వివాదం చేస్తారని, అందరం ఏపీ ప్రజలమని, అందుకే జై ఆంధ్రా అనాలని సూచించారు. వైసీపీ వాళ్లు ఒక్కటే కులం, ఒక్కటే ప్రాంతం అని దుష్ప్రచారం చేస్తున్నారని, జై ఆంధ్రా అంటూ అమరావతి కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు.

అధికార వికేంద్రీకరణపై జగన్ ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదని, పదవిలో ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా ప్రవర్తిస్తారా అని ధ్వజమెత్తారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అమరావతి రైతుల కన్నీళ్లపై రాజధాని వస్తే మాకు ఆనందం ఏమి ఉంటుందని చెబుతున్నారని వెల్లడించారు. తాను ఓట్ల కోసం రాలేదని, రోజూ వార్తల్లో కనిపించే వ్యక్తిని కాదన్నారు. పత్రికల్లో కనిపించడం కోసం వార్తలు సృష్టించలేనన్నారు.

కేంద్ర పెద్దలను కలిసిన జగన్ రాజధాని కోసం నిధులు అడిగారని, ఏ రాజధాని కోసం అడిగారో చెప్పాలని ప్రశ్నించారు. ఇంత పెట్టుబడి పెట్టాక రాజధాని మార్పు సరికాదన్నారు.
Tags:    

Similar News