ఢిల్లీలో పవన్‌.. ఏం జరుగుతోంది?

Update: 2023-04-03 14:56 GMT
జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఆకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికి కారణమైంది. రాజస్థాన్‌ లోని ఉదయ్‌ పూర్‌ పర్యటనకు వెళ్లిన పవన్‌ అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తో కలిసి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ టూరుపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.

ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్‌.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులతో సమావేశమవుతారని చెబుతున్నారు. అపాయింటుమెంట్‌ దొరికితే ప్రధాని మోడీని కూడా కలుస్తారని తెలుస్తోంది. తనకు బీజేపీ నేతలు రోడ్‌ మ్యాప్‌ ఇవ్వలేదని.. కేంద్ర పెద్దలు అనుకూలంగానే ఉన్నా రాష్ట్ర నేతలు సహకరించడం లేదని ఇటీవల బందరులో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చిన పవన్‌.. తమ మిత్రపక్షం బీజేపీ అభ్యర్థులకు ఓట్లేయాలని పిలుపు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణ పరాజయం మూటగట్టుకుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్‌ బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ ఘోరంగా ఓటమి పాలయ్యారు.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మాధవ్‌ ఏపీలో బీజేపీ, జనసేన మధ్య సఖ్యత లేదని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన ఓటు బీజేపీకి పడలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టే అంటూ మాధవ్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలమే రేపాయి.

ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీతో కలిసి పోరాటమా లేక విడివిడిగా పోరాటమా అనేది ఈ పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. జనసేన, బీజేపీ కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇరు పార్టీలు కలసి ఏ అంశంలోనూ పోరాటం చేయలేదు. ఈ నేపథ్యంలో జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందా, ఉండదా అనేది తాజా సమావేశంలో తేలిపోతుందని అంటున్నారు.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. ఇందుకు పవన్‌ సిద్ధంగానే ఉన్నారు. అయితే బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేది లేదని చెబుతోంది. ఈ నేపథ్యంలో మూడు పార్టీల పొత్తుకు బీజేపీ పెద్దలను పవన్‌ ఒప్పించవచ్చని ప్రచారం జరుగుతోంది. అలాగే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పెద్దల వద్ద ఈ విషయంపై పవన్‌ స్పష్టత తీసుకోవచ్చని చెబుతున్నారు.

ఏపీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై బీజేపీ పెద్దలతో పవన్‌ చర్చించే అవకాశముందని అంటున్నారు. ముఖ్యంగా ఇటీవల జనసేన, బీజేపీ మధ్య దూరం పెరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో జనసేనాని ఢిల్లీ పర్యటన సర్వత్రా ఆసక్తి రేపుతోంది.        


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News