పార్టీ ప‌నుల‌ను ప‌వ‌న్ మొద‌లు పెట్టేశార‌ట‌

Update: 2017-02-27 04:37 GMT
ఇటీవ‌ల‌ మంగళగిరిలో చేనేత సత్యాగ్రహంలో పాల్గొన్న  జ‌న‌సేన అధినేత‌ పవన్‌ కల్యాణ్‌ తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడంతో పాటు.. పార్టీ నిర్మాణానికి సంబంధించిన స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. మార్చి14వ తేదీకి జనసేన ఆవిర్భవించి మూడు సంవత్సరాలు పూర్తికానున్న నేపథ్యంలో అదేరోజు వెబ్‌ సైట్‌ ని ప్రారంభించనున్నారు. దీంతోపాటుగా పార్టీ విధివిధానాలను ప్రకటించడానికి పవన్‌ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.  ఈ క్ర‌మంలో స్థానిక సమస్యలపై గళం విప్పుతూ...జనానికి దగ్గరవుతున్న పవన్‌ - పార్టీ నిర్మాణంపై కూడా దృష్టి సారించారు. క్యాడర్‌ తో పాటు పార్టీ కార్యకలాపాలనూ పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం పనిచేసే సమర్థమైన కార్యకర్తల కోసం చూస్తున్నారు. అలాగే 2019 ఎన్నికల నాటికి మ్యానిఫెస్టో ఎలా ఉండాలో ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు చ‌ర్చోప‌చ‌ర్చ‌లు కూడా చేస్తున్నారు.

జనసేనను స్థాపించాక ఇప్పటివరకూ దాదాపుగా పార్టీ నిర్మాణంపై పవన్‌ కల్యాణ్‌ దృష్టి సారించలేదు. 2019 ఎన్నికల బరిలో పార్టీ నిలుస్తుందని ఇటీవల మంగళగిరిలో ప్రకటించిన అనంత‌రం పార్టీ నిర్మాణం ఆవశ్యకతను ఆయన గుర్తించారు. అందుకే..,ఇకపై పార్టీ పటిష్ఠతకు ఎక్కువ సమయం కేటాయించాలని పవన్‌ భావిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే జిల్లాల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు పార్టీలో యువతకు పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై అవగాహన, పోరాట పటిమ ఉన్న యువ నాయకత్వం వైపే ఆయన ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పవన్‌ రాజకీయ భవిష్యత్తు ఏమిటో తెలియక ఆందోళనలో ఉన్న అభిమానులకు.. పార్టీ కార్యకర్తలకు మంగళగిరిలో పవన్‌ ప్రసంగం నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది. పార్టీ నిర్మాణంపై పవన్‌ ఇచ్చిన క్లారిటీతో ఫుల్‌ జోష్‌ లోకి వచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వార్షికోత్స‌వ‌మే స‌రైన స‌మ‌య‌మ‌ని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News