ఒక్క ప్ర‌క‌ట‌న‌తో చంద్రుళ్ల బీపీ పెంచిన ప‌వ‌న్‌

Update: 2017-12-05 17:03 GMT
జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విడుద‌ల చేసిన ఒక్క ప్ర‌క‌ట‌న తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రుల‌కు బీపీ పెంచేదిగా ఉంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ప‌వ‌న్ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న స‌మ‌స్య‌ల‌పై సూటిగా స్పందించేలా ఉండ‌టంతో పాటుగా ఇద్ద‌రు సీఎంల ప‌నితీరుపై ప‌లు అంశాల్లో సూటిగా ప్ర‌శ్నించింద‌ని విశ్లేషిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు, యువ‌త ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నా ప్ర‌భుత్వాల‌కు చీమ కుట్టిన‌ట్టు కూడా లేక‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలను తూచా త‌ప్ప‌క అమ‌లు చేయాల్సిన బాధ్య‌త ముఖ్య‌మంత్రుల‌పై ఉంద‌న్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటనలో భాగంగా రేపటి నుంచి మీ ముందుకు వస్తున్నాన‌ని జ‌న‌సేన పార్టీ అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు విడతలుగా పర్యటించాలని నిర్ణయించుకున్న‌ట్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెల్ల‌డించ‌డం రెండుచోట్లా రాజ‌కీయ వేడిని ర‌గిలించింద‌ని అంటున్నారు. తొలి విడత పర్యటన సమస్యలపై పరిశీలన, అధ్యయనం, అవగాహన కోసం కాగా రెండో విడత పర్యటనలో ఆయా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే సరే, లేని పక్షంలో ప్రభుత్వ భాద్యతను గుర్తు చేస్తామని...అప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాకుంటే మూడో విడత పర్యటనను పోరాట వేదికగా మారుస్తామ‌ని తేల్చిచెప్ప‌డం చూస్తుంటే...ప‌వ‌న్ ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే ముందుకు సాగుతున్నార‌ని అర్థ‌మ‌వుతుంద‌ని అంటున్నారు.

రెండు రాష్ర్టాల‌లోనూ ఆయ‌న కీల‌క కేంద్రాల‌ను ఎన్నుకున్నార‌ని చెప్తున్నారు. ముందుగా విజయనగరం, ఉస్మానియా యూనివర్సిటీలలో ఆత్మార్పణం చేసుకున్న యువకులు వెంకటేష్, మురళి, కృష్ణ నదిలో జరిగిన పడవ ప్రమాదంలో అశువులు బాసిన వారి కుటుంబాల వారిని పరామర్పించడం త‌న‌ విధిగా భావిస్తున్నానని ప‌వ‌న్ ప్ర‌క‌టించ‌డం చూస్తుంటే...ఇటు యువ‌త‌లో అటు సామాన్యుల‌కు తానున్నాన‌నే భ‌రోసా ఇవ్వ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని చెప్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోని యువత నిరాశ నిస్పృహలతో ఉన్నారని ప‌వ‌న్ త‌న ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.  `యువత నిరాశ నిస్పృహలు దేశానికి క్షేమకరం కాదు. ఇటు బాసర ఐఐటీ, ఉస్మానియా విద్యార్థులు,అటు కడపలోని ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు తీవ్ర ఆవేదనతో ఉన్నారని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సమస్యను పరిష్కరించడానికి జనసేన తనవంతు ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నానని ప‌వ‌న్ వెల్ల‌డించడం ఆయ‌న ఎజెండాను చాటిచెప్పింద‌ని విశ్లేషిస్తున్నారు.

యువతలో రాజకీయపక్షాలు, ప్రభుత్వాలు ఆశలు రేకిత్తించి వాటిని అమలుచేయకపోతే వచ్చే దుష్పరిమాణాలకు వెంకటేష్, మురళీల ఆత్మహత్యలే నిదర్శనమని ప‌వ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. యువతలో నిర్వేదం, నిరాశ చోటు చేసుకోకుండా చూడవలసిన బాధ్య‌త ప్రభుత్వాలపై ఉంద‌ని ప‌వ‌న్ తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం ప్రభుత్వాల విధి అని తేల్చిచెపుతూ...ప్రభుత్వాలు తమ బాధ్య‌త‌ నుంచి తప్పించుకోకూడదన్నారు. `యువత నిరాశ నిస్పృహలకు లోను కావద్దని ఈ సందర్భంగా మనవి చేస్తున్నానని తెలిపారు. విలువైన మీ ప్రాణాలను తీసుకొని తల్లిదండ్రులకు శోకం మిగల్చకండి. పోరాడండి.సాధించండి.నేను, నాతో పాటు జనసేన సైతం మీకు అండగా ఉంటాయి` అని తెలపడం ప‌వ‌న్ స్ప‌ష్ట‌మైన కార్యాచ‌ర‌ణ‌ను చాటుతుంద‌ని అంటున్నారు. రెండు రాష్ర్టాల‌పై ప‌వ‌న్ పెట్టిన ఫోక‌స్ ఇద్ద‌రు చంద్రుల‌కు బీపీ పెంచ‌నుంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News