పీకే వారి తాజా సూక్తిముక్తావళి విన్నారా?

Update: 2019-08-01 08:19 GMT
కొన్ని సినిమాలు అప్పుడప్పడు వస్తాయి. రోటీన్ కు భిన్నంగా ఉంటాయి. సినిమాను ముక్కలు ముక్కలుగా చేసి చూస్తే.. ఎక్కడా ఏ లోపం కనిపించదు. కొన్ని సీన్లు అద్భుతంగా ఉంటాయి కూడా. కానీ.. అట్టర్ ఫ్లాప్ అవుతుంటాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు కూడా అలానే ఉంటుంది. ఆయన మాట్లాడే మాటలు కొన్ని భలేగా ఉంటాయి. కాకుంటే.. లాజిక్ వెతక్కూడదు. బుర్ర ఉపయోగించకూడదు. అలా వింటుంటే.. పీకే.. ఏం చెప్పిండు భయ్ అనుకోవాల్సిందే.

పవన్ సారు చెప్పిన దానికి ప్రాక్టికల్ గా అన్న లోతుల్లోకి వెళితే మాత్రం చిక్కులే. ఇంతకీ ఎందుకీ మాటలన్ని అంటారా?  తాజాగా ఆయన రాజమండ్రికి చెందిన పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ లాంటోడ్ని కలవటం.. ఆయనతో గడపటం లాంటి లక్కీ ఛాన్స్ తో మురిసిపోతూ.. ఆయన చెప్పే మాటల్ని వింటే.. తన మాటల్ని అంత శ్రద్ధగా వినే వారిని చూసి ముచ్చటేసి మరింతగా చెలరేగిపోయారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి ఆయన మాటల్లో చదివితే ఆ మాజానే వేరుంటుంది. అందుకే.. ఆయన మాటల్లోనే చదివేద్దాం.

%  క్యాన్సర్ వచ్చి చనిపోతూ కూడా పార్టీ విజయం కోసం పనిచేసే నిస్వార్ధ కార్యకర్తలు ఉన్నారు కానీ, వారిని సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్లే నాయకులు లేరు. ఇవన్ని అర్ధం చేసుకున్నాను కాబట్టే కొత్తతరం నాయకత్వాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నాను.

%  నేను నిస్వార్థ పరుడిని. నాకే స్వార్థం ఉంటే పది మందితో వెళ్లి ఏదైనా పార్టీలో కలిసేవాడ్ని.  ఏపీ అసెంబ్లీ సమావేశాల్ని చూస్తున్నారా? సభలో కొట్టుకోవటం ఒక్కటే తక్కువ.

%  మాయ మాటలు - మోసపూరిత వాగ్ధానాలతో అందలం ఎక్కాలని కలలో కూడా అనుకోలేదు.. మంచో - చెడో ప్రజలకు నిజం చెప్పి వాళ్ల నమ్మకం గెలుచుకుంటాం.  బాధ్యతతో కూడిన రాజకీయాలు చేయడానికి వచ్చాను తప్ప అబద్ధాలతో అందలం ఎక్కడానికి కాదు.

%  తెలుగుదేశం - వైఎస్ ఆర్ కాంగ్రెస్ - భారతీయ జనతా పార్టీలా పార్టీ నిర్మాణం జరగాలంటే కొంత సమయం పడుతుంది. ఆ పార్టీలా నిర్మాణం వెనుక దశాబ్ధాల కృషి ఉంది. ఖద్దర్ చొక్కా.. చేతిలో చిన్న సంచితో మూడు తరాలు పనిచేస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.

%  తెలుగుదేశం పార్టీని ప్రజాదరణ  ఉన్న నేత స్థాపించిన పార్టీ. చంద్రబాబు.. లోకేశ్ పెట్టిన పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ గారు స్థాపించినప్పుడు చాలామంది అనుభవజ్ఞులు ఆయన పక్కన నిలబడ్డారు.

%  జనసేన పార్టీ పెట్టినప్పుడు పట్టుమని 150 మంది కూడా లేరు. ఇవాళ ఆశయ బలంతో అంచెలంచెలుగా ఎదిగి పార్టీ ఈ స్థాయికి చేరింది.   జనసేన పార్టీకి ప్రభుత్వాన్ని స్థాపించే శక్తి ఉందో లేదో తెలియదు గానీ, మనతో గొడవ పెట్టుకున్నవారిని ప్రభుత్వంలోనికి రాకుండా చేయగలిగే శక్తి అయితే ఉంది.

%  జనసేన పార్టీని విలీనం చేయమని చాలా ఒత్తిళ్లు వచ్చాయి. విలీనం చేసే ఆలోచనే ఉంటే పార్టీయే పెట్టను. మా ఆత్మగౌరవం, ఉనికి కోల్పోం.  ఒక్క ఓటు వచ్చినా సరే అది మా ఉనికి. అలాంటి ఉనికిని వేరే పార్టీలో విలీనం చేసి చంపుకోం.

%  రాజమండ్రి కవాతుకు ఉప్పెన, ప్రభంజనంలా 10 లక్షలు మంది యువత కదిలివస్తే మీడియాలో కనీస ప్రచారం కల్పించలేదు. దిల్లీ స్థాయిలో కాదు కదా మన గల్లీల్లో కూడా చూపించలేదు. అదే విదేశాల్లో 10 లక్షలు మంది రోడెక్కితే ప్రపంచ వ్యాప్తంగా న్యూస్ అయ్యేది.

%  డబ్బు - మద్యం పంచకుండా అంతమంది యువత కదిలివచ్చారంటే నాలో ఉన్న భావనే వారిలో కూడా ఉంది. అయితే దానిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం. దానికి కారణం కార్యకర్తలను అనుసంధానం చేయగలిగే పటిష్టమైన నాయకత్వం పార్టీలో లేకపోవడం.

సమర్థత గురించి పవన్ మాట్లాడటమా?

పిరికోడు ధైర్యం గురించి మాట్లాడితే?  అవినీతిపరుడు నీతులు చెబితే?  పాపాత్ముడు ధర్మం గురించి సూక్తులు చెబితే?  వెలుగు చీకటి గురించి చెబితే ఎంత ఛండాలంగా ఉంటుందో.. కొందరు కొన్ని మాటల గురించి అస్సలు మాట్లాడకూడదు. అలా మాట్లాడాలన్న ఆలోచన కూడా రాకూడదు. కానీ.. ఆ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పార్టీని పెట్టటం పెద్ద విషయం కాదు.కానీ.. దాన్ని నడిపించటం.. ముందుకు తీసుకెళ్లటంతోనే అసలు సమస్య అంతా.

జనసేన పెట్టిన ఐదేళ్ల తర్వాత ఎన్నికల బరిలో నిలిచిన నాయకుడికి పార్టీని ఎలా బిల్డ్ చేయాలన్న ఆలోచన లేకపోవటాన్ని ఏమనాలి?  పార్టీ నిర్మాణానికి అనుసరించే వ్యూహం గురించి ఉంటే.. ఎన్నికల వేళకు హడావుడిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా?  ఎక్కడి దాకానో ఎందుకు తనకు తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్న క్లారిటీతోనే లేని పవన్ కల్యాణ్.. పార్టీలో సమర్థత గురించి మాట్లాడటానికి మించిన కామెడీ ఏమైనా ఉంటుందా?

సరే.. పవన్ మాటలే నిజమనుకుందాం. పార్టీలో సమర్థులైన నేతలు లేకపోవటం వల్లే పార్టీ దారుణమైన ఓటమికి గురైందని నమ్ముదాం. అవే మాటలు నిజమైతే.. పవన్ కల్యాణ్ తాను స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఎందుకు ఓడినట్లు?  తన ఓటమికి పార్టీ నేతల అసమర్థత కారణమే అయితే.. పార్టీ ఓటమికి అధినేతగా పవన్ అసమర్థతే కారణం కావాలి కదా? తనలోని అసమర్థతను సరిచేసుకునే పని చేయకపోగా.. ఎదుటోళ్ల సమర్థత మీద సందేహాలు వ్యక్తం చేయటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న.

కామెడీ కాకపోతే.. సమర్థత గురించి పవన్ లాంటోళ్లు మాట్లాడటం ఏమైనా అర్థం ఉందా? అన్న మాట ఇప్పుడు పలువురి నోట వినిపిస్తోంది. పార్టీకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ గా ముందుండి నిలబడి.. గెలుపు అందరికి పంచుతూ.. ఓటమి మొత్తాన్ని తనకు తానుగా స్వీకరించేవాడు అసలుసిసలు నాయకుడు. అందుకు భిన్నంగా సమర్థత లోపంతో పార్టీ ఓటమి పాలైందన్న మాట పవన్ లాంటి వారి నోటి నుంచి రావటం దేనికి సంకేతం?
Tags:    

Similar News