బాబుకే గ‌గ‌న‌మైతే!..ప‌వ‌న్‌ కు దొరుకుతుందా?

Update: 2018-01-28 06:45 GMT
ప్ర‌దానమంత్రి న‌రేంద్ర మోదీ అపాయింట్ మెంట్ దొర‌కాలంటే... గ‌తంలో అయితే చాలా ఈజీగానే దొరికేది గానీ... ఇటీవ‌లి కాలంలో చాలా క‌ష్టంగానే మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇత‌ర పార్టీ నేత‌ల విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే... తాను మెచ్చి దేశంలోనే కీల‌క రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ కు సీఎంగా పంపిన క‌ర‌డుగ‌ట్టిన హిందూత్వ వాది యోగీ ఆదిత్య‌నాథ్ కూడా ఒకానొక విష‌యంలో మోదీని క‌లిసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. డీజీపీ నియామ‌కం విష‌యంలో కేంద్రంతో ప‌నిలేకుండా త‌న‌కు తానుగా నిర్ణ‌యం తీసుకున్న యోగీ వ్య‌వ‌హారం మోదీకి న‌చ్చ‌లేద‌ట‌. ఈ నేప‌థ్యంలో ఆ నియామ‌కానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేందుకు మోదీ ఏకంగా మూడు నెల‌ల‌కు పైగా స‌మ‌యం తీసుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలో ఓ వైపు అప్ప‌టిదాకా ఉన్న డీజీపీ ప‌ద‌వీ కాలం ముగుస్తుండ‌టం, కొత్త డీజీపీ నియామ‌కానికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాక‌పోయిన నేప‌థ్యంలో మోదీని క‌లిసేందుకు యోగీ చాలా సార్లే య‌త్నించార‌ట‌. అయితే త‌న‌ను కాద‌ని నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత త‌న‌తో ఇంకేం ప‌ని అన్న రీతిలో వ్య‌వ‌హ‌రించిన మోదీ... యోగీకి అపాయింట్ మెంట్ ఇవ్వ‌కుండా నానా ఇబ్బందులు పెట్టార‌ట‌. స‌రే సొంత పార్టీ నేత కాబ‌ట్టి... ఎలాగోలా డీజీపీ నియామ‌కం ర‌స‌కందాయంలో ప‌డ‌క‌ముందే చివ‌రి నిమిషంలో అపాయింట్ మెంట్ ఇవ్వ‌కుండానే కొత్త డీజీపీ నియామ‌కానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మోదీ.. త‌న‌ను కాద‌ని ముందుకెళితే ప‌రిస్థితి ఎలా ఉంటుందో యోగీకి అర్థ‌మ‌య్యేలా చేశార‌ని ప్ర‌చారం సాగిన సంగ‌తి తెలిసిందే.

అంతెందుకూ... ఎన్డీఏలో కీల‌క భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఏడాదిన్న‌ర‌గా కాలుగాలిన పిల్లిలా ఢిల్లీ చుట్టూ చ‌క్క‌ర్లు కొట్టినా.. మోదీ క‌నిక‌రించిన పాపాన పోలేదు. కీల‌క భాగ‌స్వామి అయిన టీడీపీ అధినేత‌, అది కూడా రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి సీఎంగా ఉన్న చంద్ర‌బాబునే మోదీ అల్లంత దూరాన పెట్టేసిన వైనానికి గ‌ల కార‌ణాలు చాలానే ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎంత మిత్ర‌ప‌క్ష పార్టీ అయితే మాత్రం అవినీతిని ప్రోత్స‌హించేలా వ్య‌వ‌హ‌రిస్తే... తానెందుకు ద‌గ్గ‌ర‌కు రానిస్తాన‌న్న కోణంలో చంద్ర‌బాబును మోదీ దూరం పెట్టేశార‌న్న వాద‌న వినిపించింది. ఒకానొక ద‌శ‌లో మోదీ అపాయింట్ మెంట్ సాధించ‌డం చంద్ర‌బాబు త‌రం కాద‌న్న వాద‌న కూడా వినిపించింది. ఓ వైపు ఏపీలో మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న టీడీపీ - బీజేపీ మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతుండ‌టం, చివ‌ర‌కు స‌హ‌నం కోల్పోయిన చంద్ర‌బాబు కూడా కేంద్రం నుంచి ఏఏ అంశాల‌కు సంబంధించి ఎంత‌మేర స‌హాయం అందిందో లెక్క‌లు తీయండ‌ని, పోల‌వ‌రం ప్రాజెక్టుకు ఎప్పుడెప్పుడు ఎంతెంత నిధులు ఇచ్చారో అణా పైస‌ల‌తో స‌హా లెక్క‌లు తీయాల‌ని త‌న యంత్రాంగాన్ని ఆదేశించి... ఆ విష‌యాన్ని త‌న అనుకూల మీడియాలో తాటికాయలంత అక్ష‌రాల‌తో రాయించుకున్నా కూడా చంద్ర‌బాబు వైపు మోదీ చూడ‌నే లేద‌నే చెప్పాలి. ఇలా అయితే కుద‌ర‌ద‌ని, పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా త‌న పార్టీ ఎంపీల‌ను చంద్ర‌బాబు.. మోదీ వ‌ద్ద‌కు రాయ‌బారానికి పంపారు. ఆ రాయ‌బారంలో కేంద్ర మంత్రిగా ఉన్న సుజ‌నా చౌద‌రి... మోదీ వ‌ద్ద ఎలా సాగిల‌ప‌డ్డారో తెలియ‌దు గానీ... మొత్తానికి చంద్ర‌బాబును క‌లిసేందుకు మోదీ ఒప్పుకున్నారు.

మొత్తంగా సామ‌దాన‌బేధ దండోపాయాల‌న్నీ ఉప‌యోగించినా క‌ర‌గ‌ని  మోదీ... ఏడాదిన్న‌ర‌గా ఎదురు చూస్తున్న చంద్ర‌బాబుకు త‌న‌ను క‌లిసే భాగ్యం క‌ల్పించారు. ఇలాంటి నేప‌థ్యంలో తాను మోదీని క‌లుస్తాన‌ని, రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లి త‌క్ష‌ణం ప‌రిష్క‌రించే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డ‌తాన‌ని టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెబుతుండ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తుగా నిలిచి ప్ర‌చారం కూడా చేసిన ప‌వ‌న్‌... మోదీ ప్ర‌ధాని కాగానే ఆయ‌న‌ను ఢిల్లీ వెళ్లి క‌లిశారు. నాడు త‌న‌కు స‌హ‌క‌రించిన వారితో పాటు తెలుగు సినీ హీరో అక్కినేని నాగార్జున లాంటి వాళ్ల‌కు కూడా మోదీ వెంట‌వెంట‌నే అపాయింట్ మెంట్ ఇచ్చేశారు. అయితే నాటి ప‌రిస్థితి వేరు. నేటి ప‌రిస్థితి అందుకు పూర్తిగా విరుద్ధ‌మ‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో హేమాహేమీల‌కు దొర‌క‌ని మోదీ అపాయింట్ మెంట్‌ను ప‌వన్ ఎలా సంపాదిస్తారోన‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంతేకాకుండా గతంలో బీజేపీకి అనుకూలంగానే ఉన్న ప‌వ‌న్‌... ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం వైఖ‌రిని నిర‌సిస్తూ బీజేపీ ఎంపీలు, ఎన్డీఏ స‌ర్కారుపై తీవ్ర స్థాయిలోనే మండిప‌డ్డారు. పాచిపోయిన ల‌డ్డూలు మాకెందుకంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఎక్క‌డ కూడా మోదీ పేరు ఎత్తిన దాఖ‌లా లేద‌నే చెప్పాలి. అయినా ఇప్ప‌టికిప్పుడు తాను మోదీని క‌లుస్తాన‌ని ప‌వ‌న్ చెప్ప‌డం చూస్తుంటే.. ఇటీవ‌లి కాలంలో జ‌రిగిన ప‌రిణామాలు బ‌ట్టి చూస్తుంటే... అది సాధ్యం కాదేమోన‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చంద్ర‌బాబుకే అంత ఈజీగా దొర‌క‌ని మోదీ... ప‌వ‌న్‌కు ఎలా దొరుకుతారో చూడాలి. మోదీ అపాయింట్ మెంట్ కోసం చంద్ర‌బాబే ప‌ల్టీల మీద ప‌ల్టీలు కొడితే... ప‌వ‌న్ ఇంకెన్ని కుప్పిగంతులు వేయాలోన‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

Tags:    

Similar News