ప‌వ‌న్ ఉత్త‌రాది మాట వెనుక వ్యూహం ఏమిటి?

Update: 2017-05-09 05:44 GMT
ఒక రాజ‌కీయ నాయ‌కుడి నోట్లో నుంచి ఒక మాట ఉత్త‌నే రాదు. ఒక‌వేళ వ‌చ్చినా అప్ర‌య‌త్నంగా ఒక‌ట్రెండు సార్లు రావొచ్చేమో కానీ.. త‌ర‌చూ అదే ప‌నిగా.. ప్ర‌తి విష‌యంలోనూ క‌నిపించ‌దు. ఇటీవ‌ల కాలంలో ఏ పాపుల‌ర్ పొలిటీషియ‌న్ ఎత్తుకొని స‌రికొత్త నినాదాన్ని తెర మీద‌కు వెచ్చారు ప‌వ‌ర్ స్టార్.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఉత్త‌రాది.. ద‌క్షిణాది అన్న మాట త‌ర‌చూ విన్నా.. ఎవ‌రూ దాన్ని క్వ‌శ్చ‌న్ చేసింది? అదో పెద్ద ఇష్యూగా మార్చిన పొలిటీషియ‌న్ తెలుగు రాజ‌కీయాల్లో పెద్ద‌గా క‌నిపించ‌దు. తెలుగోడి ఆత్మాభిమానం అంటూ ఎన్టీవోడు అప్పట్లో ఎలుగెత్తినా.. అది తెలుగు వ‌ర‌కూ మాత్ర‌మే ప‌రిమిత‌మైందే త‌ప్పించి.. యావ‌త్ ద‌క్షిణాదిని రిలేట్ చేయ‌లేదు.

కానీ.. ప‌వ‌న్ తీరు మాత్రం అందుకు భిన్నంగా. ఉత్త‌రాది.. ద‌క్షిణాది అంటూ ఆయ‌న నోట త‌ర‌చూ వ‌స్తున్న మాటలు చూస్తుంటే.. ఏదో దీర్ఘ‌కాలిక ల‌క్ష్యంతోనే అన్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు. ఒక రాజ‌కీయ నేత నోట వెంట‌.. ప‌దే ప‌దే ఒకే త‌ర‌హా మాట రావ‌టం.. ప్ర‌తి విష‌యంలోనూ తాను చెప్పే ప్రాద‌మిక అంశాన్ని ప్ర‌స్తావించ‌టం చూస్తుంటే.. ప‌వ‌న్ మాట‌ల్ని తేలిగ్గా కొట్టి పారేస్తే.. తిప్ప‌లు త‌ప్ప‌వ‌న్న వాద‌న‌ను ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు వినిపిస్తున్నారు.
ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా ఉత్త‌రాది.. ద‌క్షిణాది మ‌ధ్య‌న వ్య‌త్యాసం.. వివ‌క్ష ఉంద‌న్న‌ది నిజం. ఎక్క‌డిదాకానో ఎందుకు బాలీవుడ్‌.. టాలీవుడ్ లు కూడా ఇందుకు సాక్ష్యాలుగా చెప్పొచ్చు. ఈ రెండు ఇండ‌స్ట్రీల‌తో ప‌రిచ‌యం ఉన్న ఏ ఒక్క‌రిని అడిగినా.. సౌత్.. నార్త్ మ‌ధ్య‌నున్న తేడా గురించి చాలానే చెప్పేస్తుంటారు. అయితే..దీన్ని మాట‌ల మ‌ధ్య‌నే ఇంత‌కాలం న‌డిచింది త‌ప్పించి.. రాజ‌కీయ వాద‌న‌గా మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. ఏపీకి ఇవ్వాల్సిన ప్ర‌త్యేక హోదాకు హ్యాండ్ ఇచ్చి.. మాట వ‌ర‌స‌కు కూడా తాము చేయ‌లేని విష‌యాన్ని ప్ర‌స్తావించ‌ని మోడీ తీరుపై జ‌న‌సేన అధినేత తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లుగా చెబుతారు. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మోడీని క్వ‌శ్చ‌న్ చేయ‌లేని ప‌రిస్థితుల్లో.. చాలా మ‌దించిన త‌ర్వాతే ప‌వ‌న్ త‌న నార్త్‌.. సౌత్ వాద‌న‌ను తెర మీద తెచ్చార‌ని చెబుతారు.

ప్ర‌స్తుతానికి ప‌వ‌న్ వాద‌న‌ను చాలామంది ప‌ట్టించుకోన‌ప్ప‌టికీ.. రానున్న రోజుల్లో ఇదో పెద్ద ఇష్యూగా మార‌టం ఖాయ‌మ‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇలాంటి భావోద్వేగ అంశాల్ని పాల‌కులు ఎంతగా నిర్ల‌క్ష్యం చేస్తే.. అంత‌గా బ‌లోపేతం అవుతాయ‌ని చెప్పొచ్చు. సౌత్ వాళ్ల‌ను నార్త్ వాళ్లు చుల‌క‌న‌గా చూస్తున్నార‌న్న త‌న వాద‌న‌కు త‌గ్గ‌ట్లే.. ప‌లు అంశాల్ని ముడి పెట్టి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌వ‌న్ ప‌లు ఉదాహ‌ర‌ణ‌లు చూపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో త‌న‌కున్న సందేహాల్ని విత్త‌నాల రూపంలో నాటుతున్న ప‌వ‌న్‌.. ఏదో ఒక రోజు ఈ విత్త‌నాలు మొలిచి.. మొక్క‌లుగా మారి.. ఆపై చెట్లు అయ్యాక పెద్ద తిప్ప‌ల్ని తెచ్చి పెడ‌తాయ‌ని చెబుతున్నారు.

తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీసుకున్న ఒక నిర్ణ‌యాన్ని నార్త్‌.. సౌత్ అన్న కోణంలో చూశారు ప‌వ‌న్‌.  తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కార్య‌నిర్వాహ‌ణ అధికారింగా సింఘాల్‌ను నియ‌మించ‌టంపై ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేవారు. టీటీడీ బాధ్య‌త‌ల్ని ఉత్త‌రాదికి చెందిన ఐఏఎస్ అధికారిని నియ‌మించ‌టాన్ని తాను వ్య‌తిరేకించ‌ను కానీ.. అమ‌ర్ నాథ్‌.. వార‌ణాసి.. మ‌ధుర లాంటి దేవాల‌యాల‌కు ద‌క్షిణాది అధికారుల్ని ఉత్త‌రాది వాళ్లు అంగీక‌రిస్తారా? అంటూ సూటి ప్ర‌శ్న‌ను సంధించారు. విన్నంత‌నే మంట పుట్టే ఈ వాద‌న ఇప్ప‌టికి చూపించే ప్ర‌భావం త‌క్కువే అయినా.. రానున్న రోజుల్లో ఇవ‌న్నీ క‌లిసి పెద్ద ఉద్య‌మానికే దారి తీసే ప్ర‌మాదం ఉంద‌న్న వాద‌న వినిపిస్తున్నారు. అందుకే.. ఇక‌పై నియామ‌కాల విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి ఏ మాత్రం జాగ్ర‌త్త తీసుకోకున్నా మ‌రో పెద్ద ఇష్యూకు తానో కార‌ణం అవుతార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.
Tags:    

Similar News