బాబు సినిమా ఫ్లాప్ : పవన్

Update: 2018-11-02 20:50 GMT
కాంగ్రెస్ పార్టీతో కలిసి మహాకూటమి దిశగా అడుగులు వేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడ్ని ప్రతిపక్షాలు విమర్శల పేరుతో ఆడుకుంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని - తెలంగాణలో గద్దెమీదున్న తెలంగాణ రాష్ట్ర సమితిని అధికారం నుంచి తప్పించేందుకు కాంగ్రెస్ తో జత కట్టామని చంద్రబాబు నాయుడు చెబుతున్నా ఆ మాటలకు మాత్రం ప్రతిపక్షాలు విలువ ఇవ్వడం లేదు. దేశంలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని - ప్రధానిగా నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా దేశ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీలు నెరవేర్చడంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా విఫలమైందని, రాష్ట్ర ప్రజల కోసమే తాను కాంగ్రెస్ తో చేతులు కలుపుతున్నానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ఆయన మాటలపై ప్రతిపక్షాలు విమర్శల దాడులు చేస్తున్నాయి. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ - తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు జనసేన కూడా చంద్రబాబు నాయుడిపై విమర్శల వాన కురిపిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలుగుదేశం - కాంగ్రెస్ పార్టీల కొత్త స్నేహంపై తన సినీ భాషలో విరుచుకుపడ్డారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి ఫ్లాప్ అయ్యిందంటూ వ్యాఖ్యానించారు. " నేను ఎప్పుడో చెప్పింది ఇప్పడు జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సినిమా ఫ్లాప్ అయ్యింది" అని పవన్ కల్యాణ్ తన విమర్శలను సంధించారు.  గురువారం నాడు ఢిల్లీలో ఏం జరిగిందో దేశ ప్రజలందరూ చూశారని - ఈ కలయికపై అందరూ విస్తుపోతున్నారని అన్నారు. " తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయాణాన్ని ఎక్కడ ప్రారంభించారో మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అక్కడికే తిరిగి వచ్చారు" అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం అధినేత తన రాజకీయ ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభించి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ముఖ్యమంత్రి వరకూ ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ అంశాన్నే ప్రస్తావించిన పవన్ కల్యాణ్...  "స్మాల్ వరల్డ్" ఎక్కడ ప్రారంభించారో అక్కడికే వచ్చారు అనే అర్ధంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రజలు సైతం తమ సమ్మతిని తెలియజేస్తారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.


Tags:    

Similar News