మోదీని కలిసేందుకు పవన్‌ కు ఎందుకంత భయం?

Update: 2018-02-11 16:51 GMT
జనసేన అధినేత సందు చూసి తన వేగం పెంచారు. రాష్ర్టానికి కేంద్రం అన్యాయం చేసిందంటూ టీడీపీ, ఇతర పార్టీలు ఆందోళనలు చేస్తున్న సమయంలో ఆయన నిజనిర్ధారణ సంఘం పేరుతో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే... 2014లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మోదీ బ్యాకప్‌ తో వచ్చిన ఆయన భవిష్యత్తులో ప్రజలకు ఏ సమస్య వచ్చినా మోదీ - చంద్రబాబులను ప్రశ్నిస్తానని చెప్పారు. దీంతో తాజా పరిణామాలపై నేరుగా మోదీని కలిసి రాష్ర్ట సమస్యలను విన్నవించొచ్చు కదా అని విలేకరులు పవన్ ను అడగ్గా ఆయన కాస్త ఇరుకునపడ్డారు. 18 సార్లు ప్రయత్నించినా చంద్రబాబుకే మోదీ అపాయింటుమెంటు దొరకలేదని - ఇంకా తనకేం ఇస్తారని చేతులెత్తేశారు. నిజానికి 2014 తరువాత మోదీ పవన్ ను పట్టించుకోలేదు.. ఈయన కూడా బీజేపీ - కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. గతంలో కూడా పలువురు ఆయన్ను మోదీని కలవాలని సూచించినా ఆయన స్పందించలేదు. దీంతో మోదీని కలిసేందుకు పవన్ ఎందుకో భయపడుతున్నారన్న ప్రచారం ఒకటుంది.
    
మరోవైపు ఆయన టీడీపీ ఎంపీల నిరసనలపైనా ఎటూ తేల్చకుండా మాట్లడారు. ఏపీకి న్యాయం చేయాలంటూపార్లమెంట్ లో ఎంపీలు చేస్తున్న నిరసనలు డ్రామాలో? కాదో? తానెలా చెప్పగలనన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం నాడు ఉద్యమించారు కనుక, ఆ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణకు జరగాల్సిన న్యాయం జరిగిందని చెప్పిన ఆయన ఇప్పుడు కూడా పోరాటం అవసరమన్నట్లుగా మాట్లాడారు.
    
కాగా పవన్ తాను సూచించిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో తాను ఉండటం లేదని చెప్పారు. తాను టీడీపీ, బీజేపీకి మ‌ద్ద‌తు తెలిపాను కాబట్టి ఇందులో ఉండడం కరెక్టు కాదని చెప్పారు. ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, మేధావులతో కలిసి జేఏసీ ఏర్పాటు చేశామ‌ని, క‌మిటీలో ఎవ‌రెవ‌రు ఉంటారో వారి జాబితాను రెండు రోజుల్లో ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు. ఇది రాజ‌కీయ జేఏసీ కాదని వాస్త‌వాలు నిర్ధారించే క‌మిటీ మాత్ర‌మేన‌న్న ప‌వ‌న్ .. కమిటీలో నిపుణులు నివేదిక ఆధారంగా రిపోర్ట్ ఇస్తారని చెప్పారు.
Tags:    

Similar News