తెలంగాణ‌లో ప‌వ‌న్ స్పీడ్ మామూలుగా లేదుగా

Update: 2020-01-19 16:30 GMT
ఓ వైపు త్వ‌ర‌లో తెరంగేట్రం చేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుండ‌టం మ‌రోవైపు...బీజేపీతో పొత్తు, దాని గురించి పార్టీ శ్రేణుల‌కు వివ‌రించడంలో బిజీ బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ స‌మ‌యంలో స‌మ‌యం కేటాయించుకొని తెలంగాణ‌పై కూడా ఫోక‌స్ పెట్టేశారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోని ముఖ్య నాయకుల సమావేశం శ‌నివారం నిర్వ‌హించిన ప‌వ‌న్ ఈ మేర‌కు ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి సమయం తీసుకున్నట్లు చెప్పిన జ‌న‌సేనాని - ఇప్పుడు పార్టీని తెలంగాణాలో బలోపేతం చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వెల్లడించారు. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీని నియమించుకుందామని అన్నారు. అయితే, ప‌వ‌న్ ప్ర‌క‌టించిన మ‌రుస‌టి రోజే..క‌మిటీ ఏర్పాటైపోయింది! ప్ర‌మాణ స్వీకారం కూడా చేసేసింది.
 
హైదరాబాద్ గ్రేటర్ కమిటీని కార్యకర్తల నుంచి పేర్లు అందిన వెంటనే ప్రకటించనున్నట్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ శ‌నివారం ప్ర‌క‌టించ‌గా...ఆదివారం ఆయ‌న స‌మ‌క్షంలోనే నూత‌న క‌మిటీని ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా...ప్ర‌మాణ స్వీకారం కూడా చేయించేశారు తెలంగాణ బాధ్యులు. గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షునిగా రాధారం రాజలింగం - ఉపాధ్యక్షులుగా దామరోజు వెంకటాచారి, అచ్చుకట్ల భాను ప్రసాద్ - ప్రధాన కార్యదర్శిగా చిన్నమదిరెడ్డి దామోదర రెడ్డి - కార్యనిర్వాహక కార్యదర్శులుగా మీర్జా అబిద్ - బిట్ల రమేష్ - వాకా వెంకటేష్ - సిటీ కమిటీ కార్యదర్శులుగా నందగిరి సతీష్ కుమార్ - మండలి దయాకర్ - కార్యనిర్వాహక సభ్యులుగా యడమ రాజేష్, గనప సైమన్ ప్రభాకర్ (కిరణ్) - షేక్ రియాజ్ వలిని నియమించారు.

కాగా, నూత‌నంగా ఎంపికైన కమిటీ సభ్యులను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభినందిస్తూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని ఉద్బోధించారు. గ్రేటర్ హైదరాబాద్ కమిటీ నియామకంతో తెలంగాణాలో పార్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఇదే విధంగా గ్రామ కమిటీల వరకు అంచెలంచెలుగా పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. తొలుత ఉమ్మడి జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు త్వరలోనే పూర్తి చేయాలని స్ప‌ష్టం చేశారు.



Tags:    

Similar News