పవన్ కళ్యాణ్ మాటలకు అర్ధాలు వేరయా...!

Update: 2023-06-19 21:00 GMT
జనసేనాని పవన్ కళ్యాణ్ మాటలకు అర్ధాలు వెతుక్కోవాల్సిందేనా. ఆయన మాటల వెనక వ్యూహం ఏదైనా ఉందా అన్నది కూడా అంతు పట్టడంలేదు. సాధారణంగా చూస్తే రాజకీయ నాయకుల మాటలకు అర్ధాలు వంద ఉంటాయి. వాటిని విశ్లేషించుకోవడం బహు కష్టం. అయితే పవన్ కళ్యాణ్ మాటలు మాత్రం ఎప్పటికపుడు మారుతున్నాయి. అవి వ్యూహాలే అనుకుంటే కనుక వాటి వల్ల ఇప్పటిదాకా రాజకీయ లాభం అయితే జనసేనకు కలుగలేదు.

అందువల్ల పవన్ వ్యూహాత్మకంగా మాటలు మాట్లాడుతున్నారా లేక ఆయన రాజకీయ అపరిపక్వతతో పూటకో మాట మాట్లాడుతున్నారా అన్నది తెలియకుండా ఉంది అంటున్నారు. ఇక గతంలో పవన్ కళ్యాణ్ అనేక సందర్భాలలో అనేక కామెంట్స్ చేశారు. వాటిలో ఎన్నో వైరుద్యాలు ఉన్నాయి. వాటి సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా చేసిన కొన్ని కామెంట్స్ అది కూడా రోజుల తేడాలో తన మాటలకు తానే అర్ధాలు మార్చుకుంటూ చేసిన ప్రకటనలు చూసిన వారు అసలు జనసేనాని ఏమి కోరుకుంటున్నారు అన్నది మాత్రం తెలియడంలేదు అనే అంటున్నారు.

కత్తిపూడి సభలో పవన్ మాట్లాడుతూ ఈసారి అసెంబ్లీకి వెళ్లకుండా తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తాను అని అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఈసారి అసెంబ్లీకి వెళ్లాలని బలంగా ఉందని, అదే ఆయన అక్కడ చెప్పారని అంతా అనుకున్నారు. ఆ మరుసటి రోజున పిఠాపురంలో జరిగిన సభలో చూస్తే పవన్ కళ్యాణ్ తనను సీఎం చేయండి అని జనాల్కు డైరెక్ట్ గా అప్పీలు చేశారు.

తనను ఒకసారి కాదు రెండు సార్లు సీఎం చేయమని ఆయన అంటున్నారు. 2024, 2029 ఎన్నికల్లో తనకే చాన్స్ ఇవ్వాలని, తన పనితీరు కనుక నచ్చకపోతే రీకాల్ చేసుకోవచ్చునని కూడా సూచించారు. లేదా తానే రెండేళ్ల తరువాత రాజీనామా చేస్తాను అని చెప్పారు. అది కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే పవన్ 2024లో అధికారంలోకి వచ్చి ఆయన పాలన జనాలకు నచ్చలేదు అనుకుంటే రెండేళ్ళకే రాజీనామా చేస్తే మళ్ళీ 2029లో చాన్స్ ఎక్కడ నుంచి వస్తుంది అన్నది మరో ప్రశ్న.

ఇలా ఎన్నో వైరుధ్యాలతో పవన్ పిఠాపురం ప్రసంగం సాగింది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే కాకినాడ జనవాణీలో పవన్ బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ తన సీఎం పదవి తరువాత విషయం ముందు పేదలకు, బాధితులకు సేవ చేయడమే ముఖ్యం అని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అంటే పవన్ సీఎం అని ఒకసారి అంటున్నారు. మరో చోట తనకు పదవులు ముఖ్యం కాదు ప్రజల కోసమే తన పార్టీ పెట్టాను అని చెబుతున్నారు.

మరీ ఇంత గందరగోళంగా జనసేన పార్టీ ని లీడ్ చేసే అధినాయకుడి స్పీచులు ఉంటే ఎలా అన్నదే చర్చగా ఉంది. అసలు పవన్ క్లారిటీగా ఏదైనా చెబుతున్నారా. ఆయన చెప్పిన దాంట్లో స్పష్టత కనీసం ఆ పార్టీ నేతలకు అయినా వస్తోందా అన్నది కూడా పెద్ద డౌట్ గా ఉంది. ఈ సందర్భంగా కాకినాడ ఎమ్మెల్యే  ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చేసిన కామెంట్స్ ని ఒక్కసారి చూస్తే పవన్ మాటలకు అర్ధాలు ఇవేనా అని అనిపిస్తుంది.

ద్వారంపూడి ఏమంటున్నారు అంటే తన సభలకు జనాలను పోగు చేసి మీటింగ్స్ సక్సెస్ చేయడం కోసమే సోలో ఫైట్ అని పవన్ కలర్ ఇస్తున్నారని, ఒంటరిగా పోరు సీఎం సీటు అంటూ ఊరిస్తున్నారని పేర్కొన్నారు. అలా కనుక చెప్పకపోతే నేతలు వారాహీ యాత్రకు ఏర్పాట్లు చేయకుండా తప్పుకునే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఇక్కడే ఆయన మరో సవాల్ చేశారు. కత్తిపూడి నుంచి కాకినాడ వరకూ జనసేన తరఫున నిలబెట్టే క్యాండిడేట్స్ ఎవరో పవన్ చెప్పాలని. అంటే పవన్ కళ్యాణ్ తన రాజకీయం కోసమే సీఎం సీటు ఒంటరి పోటీ అని మాట్లాడుతూ క్యాడర్ ని కూడా మభ్యపెడుతున్నారని ఆయన అంటున్నారు. అలా కనుక అనుకుంటే పవన్ కళ్యాణ్ మాటల వెనక బోలెడు అర్ధాలు ఉన్నాయనే భావించాలి.

అదే టైం లో సీఎం సీటు అంటూ మాట్లాడితే టీడీపీ నుంచి సీట్లు కూడా ఎక్కువ సాధించవచ్చు అన్న వ్యూహం కూడా ఉందనుకోవాలి. ఏది ఏమైనా రాజకీయాలో ఎవరికైనా వ్యూహాలు ఉంటాయి. కానీ మరీ ఇంత షార్ట్ కట్ లో పూటకో మాట మాట్లాడితే అవి వ్యూహాలుగా మారితే అంతకంటే గందరగోళ రాజకీయం మాత్రం ఉండదనే అంటున్నారు. ఇంతకీ పవన్ మాటలకు అర్ధాలు ఎవరైనా చెప్పగలరా...

Similar News