పవన్.. ఆయనతో జాగ్రత్త!

Update: 2017-03-15 07:55 GMT
ప్రశాంత్ కిషోర్ అనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తూ ఇంతకుముందు అద్భుతమైన ఫలితాలు సాధించాడు. దీంతో అందరూ ఆయన్ని ఆకాశానికెత్తేశారు. ఆయన స్ట్రాటజీలు అద్భుతం అని పొగిడేశారు. కానీ మూడేళ్లుగా ఆయన స్ట్రాటజీలేమీ పని చేయట్లేదు. ఈ మూడేళ్లలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి వ్యూహకర్తల ప్రణాళికలు.. కలిసొచ్చిన కాలంలో బాగానే ఉంటాయి. కానీ పరిస్థితులు ఎదురు తిరిగినపుడు ఇలాంటి స్ట్రాటజీలేవీ కూడా పని చేయవు. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కూడా ఈ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిదంటున్నారు ఆయన శ్రేయోభిలాషులు.

పవన్ ఇటీవలే అమెరికాలో పర్యటించిన సందర్భంగా స్టీవెన్ జార్డింగ్ అనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఆయనతో జనసేన పార్టీ గురించి.. తన రాజకీయ ప్రణాళికల గురించి చర్చించి.. సలహాలు తీసుకున్నారు పవన్. ఐతే ఇదేదో వన్ టైం మీటింగేలే అనుకుంటే.. అలా కాదని.. 2019 ఎన్నికల సందర్భంగానూ ఆయనతో కలిసి పని చేయాలని పవన్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయనతో తరచుగా మాట్లాడుతూ సలహాలు తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐతే ఈ విషయంలో పవన్ ను హెచ్చరిస్తున్నారు. జార్డింగ్ ప్రణాళికలు ఒకప్పుడు బాగానే సక్సెస్ అయ్యాయి కానీ.. ఇప్పుడు అవేవీ పని చేయట్లేదు. అమెరికా ఎన్నికల్లో ఓటమి పాలైన హిల్లరీ క్లింటన్ కు సలహాలిచ్చింది ఆయనే. అలాగే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో చిత్తయిన అఖిలేష్ కూడా ఆయన సలహాలు తీసుకున్నారట. ఇలాంటి స్ట్రాటజిస్టుల సలహాలు కొంత మేరకే ఉపయోగపడతాయి. అనుకూల వాతావరణం ఉన్నపుడు కొంత వరకు సాయపడతాయి. పైగా మన రాజకీయాలకు అలాంటి స్ట్రాటజీలు అస్సలు సరిపోవన్నది విశ్లేషకుల మాట. మన దగ్గర కులాలు.. ప్రాంతాలు.. మతాలు.. ఇలా రాజకీయాల్ని ప్రభావితం చేసే అనేక అంశాలుంటాయి. ఇలాంటి చోట్ల అలాంటి స్ట్రాటజీలు పని చేయవు. కాబట్టి పవన్ అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించడం మాని స్థానిక విశ్లేషకులతో కలిసి ప్రణాళికలు రచిస్తే బెటరేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News