`జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంక్రాంతి తరువాత నేరుగా ప్రజల్లోకి రావాలనే ఆలోచన చేస్తున్నారు. పవన్ కూడా పాదయాత్ర చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.`` ఇది తాజాగా మీడియాలో జరుగుతున్న ప్రచారం. జనసేన వర్గాలను ఉటంకిస్తూ తెరమీదకు వచ్చిన వార్త! ఈ వార్త సహజంగానే పవన్ ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తింది. రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపింది. అయితే అదే సమయంలో కొత్త చర్చకు తెరతీసింది ఇంతకీ ఇప్పుడు పవన్ ఎందుకు పాదయాత్ర చేయనున్నారు? ఇన్నాళ్లు ఎందుకు దాన్ని పక్కన పెట్టారు అనేది ఈ చర్చోపచర్చల తాలూకు సారాంశం.
పవన్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌లోనే పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉండాల్సిందనే సంగతి తెలిసిందే. ఏపీ ప్రత్యేక హోదా అజెండాగా ఈ యాత్ర ఉంటుందని అంచనా వేశారు. అయితే ఆ తదుపరి ఇందుకు తగిన ఏర్పాట్లేవి తెరమీదకు రాలేదు. ఒక సందర్భంలో పాదయాత్ర చేయడం గురించి ప్రస్తావించగా పవన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. పాదయాత్ర ఇష్టమేనని, కాని పాదయాత్ర చేస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు. మరే రూపంలో అయినా అంటే బస్సుయాత్రలు, ర్యాలీలు వంటి వాటి రూపంలో ప్రజలకు చేరువ అవుతానని పవన్ వెల్లడించారు.
మరోవైపు జనసేన అధిపతి పవన్ పాదయాత్ర ప్రకటన కంటే కాస్త అటూ ఇటుగా పాదయాత్ర ఉంటుందని ప్రకటించిన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన యాత్రను ప్రారంభించేశారు. రెండు జిల్లాలు చుట్టేసి దాదాపుగా 250 కిలోమీటర్లు యాత్ర చేసేశారు. ఒకవైపు కోర్టు కేసుల తలనొప్పి ఉన్నప్పటికీ..జగన్ తన యాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ పవన్ వైపు నుంచి పాదయాత్ర విషయంలో స్పందన రావడం లేదు. దీని వెనుక అసలు కారణం ఏమై ఉంటుందని పలువురిలో చర్చ మొదలైంది. కొద్దికాలం క్రితం తన పాదయాత్రతో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ప్రకటించిన పవన్ ...తాజాగా పాదయాత్రకు సిద్ధమవుతున్నారని ఆ పార్టీ నేతలు ఇష్టాగోష్టిగా వెల్లడించడం గమనార్హం.
అయితే తాజాగా జనసేన వర్గాలను ఉటంకిస్తూ పాదయాత్ర వార్త తెరమీదకు రావడం వెనుక మర్మం ఏంటని చర్చ మొదలైంది. వైఎస్ జగన్ చేస్తున్న యాత్రకు స్పందన రావడమే కారణమా? లేక తన పార్టీ బలోపేతంలో భాగంగా పాదయాత్రకు పవన్ సిద్ధమయ్యారా అనే చర్చ మొదలయింది. పవన్ పాదయాత్రకు సంబంధించి తాజాగా తెరమీదకు వచ్చిన వార్త కూడా లీకుల్లో భాగమా? లేదా.. మీడియాలో వార్తలు వస్తున్నట్లు త్వరలో పవన్ పాదయాత్ర ఉంటుందా? పాదయాత్ర పేరుతో లీకులు సరే..ఇంతకీ ఇన్నాళ్ల పాటు ఈ యాత్రకు బ్రేకులు వేసింది ఎవరు అనే సందేహాలు..జోరుగా వినిపిస్తున్నాయి.