జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలన ప్రకటన చేశారు. జనసేన పార్టీపై, తమ పార్టీ కార్యక్రమాలపై దుష్టశక్తుల దృష్టి పడిందని పవన్ ఆరోపించారు. అంతేకాకుండా ఈ కారణం చూపుతూ కీలక పర్యటనను వాయిదా వేసేశారు. అయితే త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తానని టీడీపీ ఎండగడతానని ప్రకటించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. జనసేన పార్టీపై ప్రజలు చూపిస్తున్న ఆదరణను చూసి భయపడిన కొన్ని స్వార్ధపూరిత శక్తుల దుష్ట పన్నాగాలను పోలీస్ నిఘా వర్గాలు పసిగట్టాయని పేర్కొంది. ఈ నెలలో చిత్తూరు,గుంటూరు జిల్లా బాపట్లలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తలపెట్టిన కార్యక్రమంలో తునిలో జరిగిన రైలు విధ్వసం వంటి చర్యలకు పాల్పడి జనసేనకు అపకీర్తి వచ్చేలా కుట్ర జరిగినట్లు నిఘా వర్గాలు గుర్తించాయని పేర్కొంది. ఇందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన కిరాయి మూకలను స్వార్థశక్తులు సంప్రదిస్తున్నట్లు నిఘా వర్గాలు పార్టీ నేతలను అప్రమత్తం చేయడంతో ఈ రెండు జిల్లాల్లో తలపెట్టిన కార్యక్రమాలను వాయిదా వేశారని వెల్లడించింది.
ఈ నెల 21 - 22 -, 23 తేదీలలో పవన్ కళ్యాణ్ పాల్గొనే కార్యక్రమాలను పార్టీ సిద్ధం చేసింది. శెట్టిపల్లెలో భూ సేకరణ సమస్య, చిత్తూరు పట్టణంలో రోడ్డు నిర్మాణంలో బాధితులకు జరుగుతున్న అన్యాయం వంటి ప్రజా సమస్యలపై ఆయన పర్యటనను పార్టీ సిద్ధం చేసింది. అదేవిధంగా గుంటూరు జిల్లా స్టూవర్టుపురం నివాసి అయిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు వెంకట్ రాహుల్ కామన్వెల్త్ పోటీలలో బంగారు పతకం సాధించిన సందర్భంగా ఈ నెల 30 న స్టూవర్టుపురం నుంచి ఊరేగింపు, తదనంతరం బాపట్లలో పౌరసన్మానాన్ని చేయాలని పవన్ కళ్యాణ్ తలపెట్టారు. ఈ రెండు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ కార్యక్రమాల కోసం పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో పార్టీ పవన్ టూర్‌ను వాయిదా వేసుకుంది. దీనికి జనసేన వివరణ ఇస్తూ...నిఘా వర్గాల హెచ్చరికలతో ప్రజలు, ప్రజా ఆస్తులకు నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను పార్టీ వాయిదా వేసిందని వెల్లడిందింది.
ఇదిలాఉండగా...పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో గురువారం సమావేశమయ్యారు. జిల్లాలలో సుదీర్ఘమైన పర్యటనలు జరపడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ప్రజల వద్దకు వెళ్లాలన్న తన సంకల్పాన్ని ఎవరు వమ్ము చేయలేరని పవన్ వెల్లడించారు. జిల్లాలలో ప్రధాన సమస్యలు,రాష్ట్ర అభివృద్ధిలో తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాలు, ప్రత్యేక హోదా సాధన ధ్యేయంగా జిల్లాలలో పర్యటిస్తానని ఆయన స్పష్టం చేశారు. కాగా, పవన్ సుదీర్ఘ పర్యటనల కోసం వివిధ కమిటీలను పార్టీ ముఖ్యులు ఏర్పాటు చేస్తున్నాయి. జిల్లాల పర్యటన రెండు మూడు వారాలలో ప్రారంభం అయ్యే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయి.