ప‌వ‌న్ ప్ర‌క‌ట‌నఃవైసీపీతో క‌లిసి పోరాటం చేస్తా

Update: 2017-01-31 14:25 GMT
జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేసే విష‌యంలో ఐక్యంగా ఉద్య‌మించ‌డానికి తాను సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో వైసీపీతో క‌లిసి ముందుకు సాగుతాన‌ని వివ‌రించారు. పవన్‌ కల్యాణ్‌ను జ‌న‌సేన కార్యాల‌యంలో  కలిసిన పలువురు చేనేత కార్మిక సంఘాల నేతలు ఆయనకు చేనేత వస్త్రాలు బహూకరించారు.  చేనేత సంఘాల నాయకులు పవన్‌ కలిసిన అనంతరం మీడియాతో పవన్‌ మాట్లాడారు. నేతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. వచ్చేనెలలో మంగళగిరిలో చేపట్టనున్న చేనేత సత్యాగ్రహానికి ఆహ్వానించారని.. వెళ్తున్నానని తెలిపారు. చేనేత మన జాతికి సందప అని, అరుదైన కళ అని కొనియాడారు. చేనేత కళాకారులను గుర్తించి అండగా ఉండాలని తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. వారానికోసారి చేనేత వస్త్రాలు ధరిస్తానని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

ప్రత్యేకహోదా తదితర అంశాలపై చిత్తశుద్ధితో పోరాటం చేయాలని,  ఈ విషయంలో ఇప్పటికే పోరాడుతున్న వైఎస్ఆర్‌సీపీతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమని ప‌వ‌న్‌ చెప్పారు. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లడానికి తనకు అనుభవం సరిపోనందువ‌ల్ల‌ ఇతర పార్టీలు ముందుకొస్తే, తాను కూడా వారితో కలిసి పోరాడతానని, ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే  ప‌య‌నిస్తున్న వైసీపీతో క‌లిసి ముందుకు సాగుతాన‌ని ప‌వ‌న్‌ చెప్పారు.ఏ రాజకీయ పార్టీ విధి విధానాలు ఎలా ఉన్నా, ప్రజా సమస్యల మీద కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని, తనది ప్రజల పక్షం తప్ప మరే పార్టీ పక్షం కాదని పవన్ అన్నారు. కాగా...తాను కనీసం ట్విట్టర్‌లో అయినా మాట్లాడుతున్నానని, మన ఎంపీలు పార్లమెంటులో ఉన్నా ప్రత్యేక హోదా మీద ఏమీ మాట్లాడటం లేదని ప‌రోక్షంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును ఎద్దేవా చేశారు. నేతలు హామీలు నెరవేర్చకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని, మతాల మధ్య చిచ్చుపెట్టడం మీకే తెలుసు అంటూ వెంకయ్యనాయుడును ఉద్దేశించి అన్నారు. కాగా ఇంతకుముందు ఉత్తరాది, దక్షిణాది అంటూ పవన్‌ కల్యాణ్‌ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టొచ్చా అంటూ వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు చేయ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గతంలో దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద స్థాయిలో హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చినప్పుడు, నాటి సమాచార శాఖ మంత్రి ఇందిరాగాంధీ బయటకు వచ్చి, మీకు ఇష్టం లేని హిందీని మీ మీద రుద్దం అని ప్రకటించి వెళ్లిపోయారని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గుర్తుచేశారు. అలాంటిది పార్లమెంటులో ప్ర‌త్యేక హోదా మాటిచ్చి.. ఇప్పుడు మాత్రం ఇవ్వం, అనుకున్నాం, కుదరదు అని మొండిగా మాట్లాడితే కుదరదని హెచ్చ‌రించారు.
Full View



Tags:    

Similar News