జగన్ ఇంటర్వ్యూ ఎఫెక్ట్... కేసీఆర్‌ పై పవన్ సెటైర్లు

Update: 2019-01-14 06:41 GMT
తెలంగాణ ఎన్నికలు ఏపీలో రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తున్నాయి. ఆ ఎన్నికల తరువాత కేసీఆర్... తాను ఏపీ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటానని, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. కేసీఆర్, ఆయన పార్టీ మద్దతు ఏపీలో జగన్‌కేనన్నది అందరి మాట. మరోవైపు మొన్న పాదయాత్ర ముగించిన ఏపీ విపక్ష నేత జగన్మోహనరెడ్డి ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేసీఆర్ తనకు మద్దతిస్తే తప్పేంటి అన్నారు. తన పనితీరు నచ్చి ఆయన మద్దతిస్తున్నారని చెప్పారు. మొత్తానికి... వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కోసం టీఆరెస్ ప్రచారం చేస్తుందో చేయదో తెలియదు కానీ మాట సాయం మాత్రం చేస్తుందని స్పష్టమైపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగొలుపుతున్నాయి. టీఆర్ఎస్‌ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు.
    
‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిని అడ్డుకున్న వారే ఇప్పుడు ఏపీకి వచ్చి ఆయనకు మద్దతు ఇస్తామని అంటున్నారంటే రాజకీయాలు ఎంతెలా దిగజారాయో అర్థం చేసుకోవచ్చ’’ని పవన్ అన్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రం తెనాలిలోని పెదరావూరు వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన పవన్ అక్కడి బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కులమతాలకు అతీతంగా రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే జనసేన అధికారంలోకి రావాల్సిందేనన్నారు.
    
టీడీపీ వెన్నుపోటు, వైసీపీ అవినీతి పునాదులపైనా ఏర్పడ్డాయని పవన్ ఆరోపించారు. అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని అడిగితే వైసీపీ వాళ్లు, ఇసుక మాఫియా గురించి మాట్లాడితే టీడీపీ వాళ్లు తనను తిడుతున్నారని పవన్ అన్నారు. రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని, తెలంగాణ ఉద్యమ సమయంలో జగన్‌ను అడ్డుకున్న వారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మరీ ఆయనకు మద్దతు ఇస్తామని అంటున్నారని పరోక్షంగా టీఆర్ఎస్‌ను ఉద్దేశించి విమర్శించారు.
    
పవన్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆయన చపలత్వం గురించి మరసారి చర్చ జరుగుతోంది. ఒక దశలో ఉప్పు, నిప్పులా వ్యవహరించిన కేసీఆర్ - పవన్‌ లు ఆ తరువాత ఒకరినొకరు పొగుడుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. గత ఏడాది జనవరిలోనే పవన్ వెళ్లి కేసీఆర్‌ని కలిసి 24 గంటల కరెంటు విషయంలో అభినందనలు తెలిపారు. అప్పటికే రాజకీయంగా యాక్టివ్ అయిన పవన్‌కు అది కేవలం మిష మాత్రమేనన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతెందుకు.. మొన్న కేసీఆర్ విజయం తరువాత కూడా పవన్ అభినందన సందేశాన్ని పంపించారు. కానీ, ఇంతలో ఏమైందో కానీ ఇప్పుడు టీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నారు.
    
ఇటీవల మళ్లీ చంద్రబాబుతో కలిసే దిశగా సంకేతాలు కనిపిస్తున్నతరుణంలో పవన్ టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడంపై అనుమానాలు బలపడుతున్నాయి. అదేసమయంలో... తనకు మద్దతివ్వాలని పవన్ గతంలోనే కొరినా కేసీఆర్ తిరస్కరించాని.. ఇప్పుడాయన జగన్‌కు మద్దతుగా మాట్లాడుతుండడంతో సహించలేక పవన్ ఆయనపై విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. కారణమేదైనా... పవన్ విమర్శల నేపథ్యంలో కేసీఆర్ సమయం వచ్చినప్పుడు ఆయన్ను పొట్టుపొట్టు తిట్టడం గ్యారంటీ అంటున్నాయి టీఆరెస్ వర్గాలు.
Tags:    

Similar News