జాతీయ పార్టీల మ‌ద్ద‌తు కోసం ప‌వ‌న్ వెంప‌ర్లాట‌...!

Update: 2019-10-28 14:30 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కు తన పొలిటికల్ సత్తా ఏంటన్న విషయంపై క్లారిటీ వచ్చేసినట్టు కనపడుతోంది. 2014 ఎన్నికల్లో పవన్ పోటీ చేయకుండా టిడిపి - బిజెపి కూట‌మి గెలుపుకి సపోర్ట్ చేయగా ఏపీలో ఆ కూటమి విజయం సాధించింది. గత ఎన్నికల్లో జనసేన - కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఏపీలో పోటీ చేయగా ఘోరమైన ఫలితాలు వచ్చాయి. జనసేన ఒక్క రాజోలులో మాత్రమే విజయం సాధించగా పార్టీ అధ్యక్షుడి హోదాలో పోటీ చేసిన పవన్ సైతం రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో ఇప్పుడు పవన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోయింది.. ఇప్పటికే తాను  పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తానని చెబుతూ వచ్చారు.

ఈ టైంలో పవన్ ఎవరి మద్దతు లేకుండా రాజకీయం చేయలేం అన్న క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో బలంగా ఉన్న వైసీపీని ఢీకొట్టడం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపికే సాధ్యం కావడం లేదు. ఇక జనసేన పని అయిపోతుంది అని భావిస్తోన్న  ఆ పార్టీ నాయకులకే పవన్ పై నమ్మకం లేకపోవడంతో ఎవరి దారి వారు చూసుకున్నారు. ఎన్నికలకు ముందు పవన్ పై ఎంతో నమ్మకంతో పనిచేసిన నేతలు సైతం ఇప్పుడు వైసీపీ లేదా బీజేపీలోకి వెళ్లిపోతున్నారు.

ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో పవన్ పార్టీని బతికించుకునే ఎందుకు ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతు అవసరమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో టీడీపీకే గతిలేదు. అలాంటి పార్టీతో తను  కలిసిన చేసేదేం లేదు అన్న విషయం పవన్ గ్రహించినట్లు ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ ఇప్పుడు జాతీయ పార్టీల మద్దతుతో ఏపీలో తన రాజకీయ పోరాటాన్ని తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టైంలో కాంగ్రెస్ తో కలిసినా పవన్ కు ఒరిగేది ఉండదని అర్థం అవుతోంది.

ఇక మిగిలిన ఆప్షన్ బీజేపీ మాత్రమే. బిజెపి జాతీయ నాయకత్వం సైతం పవన్ కలుపుకునేందుకు గత ఎన్నికలకు ముందే ప్రయత్నాలు చేసింది. జనసేనను తమ పార్టీలో విలీనం చేయమని ఆఫర్లు సైతం పవన్ ముందు ఉంచింది. పవన్ మాత్రం ఎన్నికల్లో ఒంటరి గా పోటీ చేసి  పరువు  పోగొట్టుకున్నారు. ఇక ఇప్పుడు చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా బీజేపీతో కలిసి అడుగులు వేసేందుకు తహతహలాడుతున్నట్లు  తెలుస్తోంది. అయితే బిజెపి మాత్రం పవన్ పార్టీతో కలిసి ఏపీలో వైసీపీ పై ఫైట్ చేస్తుందా లేదా పవన్ పార్టీని విలీనం చేయాలన్న కండిషన్ పెడుతుందా ? అన్నది చూడాలి.

బిజెపి ముందు నుంచి జనసేన విషయంలో జనసేనతో కలిసి ముందుకు వెళ్లడం కంటే... ఆ పార్టీని విలీనం చేసుకునేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది.  అయితే గతంలో పవన్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో  విలీనం చేయడంతో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జ‌న‌సేన విష‌యంలోనూ అలాంటి  వార్తలు వచ్చినా పవన్ మాత్రం అలా చేయన‌ని చెప్పారు.. అయితే ఇప్పుడు పవన్ కు బిజెపి పెద్దదిగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప‌వ‌న్‌తో క‌లిసి ప‌నిచేసేందుకు పార్టీ కండీషన్స్  ఎలా ఉంటాయో చూడాలి.


Tags:    

Similar News