పవన్ వారాహి యాత్ర : పవర్ చూపించేది ఎవరికి...?

Update: 2023-06-14 19:00 GMT
పవన్ అంటే పవర్ స్టార్ అన్నది సినీ రంగం లో పేరు. రాజకీయాల్లో చూస్తే ఆయన ఒక చిన్న పార్టీకి అధ్యక్షుడు మాత్రమే. పైగా పోటీ చేసిన రెండు సీట్లలో పవన్ ఓడిపోయారు. దాంతో రాజకీయంగా పవన్ ఎదిగేందుకు సినీ అభిమానాన్నే పెట్టుబడిగా చేసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల లో వారాహి రధమెక్కి యాత్ర చేస్తున్నారు. దీని లక్ష్యం ఏమిటి, దీని వెనక వ్యూహాలేంటి అంటే పవన్ చాలానే లెక్కలతో బరిలోకి దిగారు అని అంటున్నారు.

ఏపీ లో చూస్తే రెండు బలమైన పార్టీలు ఉన్నాయి. అధికార వైసీపీ విపక్ష టీడీపీ ఉన్నాయి. ఈ రెండూ గ్రాస్ రూట్ లెవెల్ వరకూ పాతుకుపోయి ఉన్నాయి. మూడవ ఫోర్స్ గా జనసేన రావాలనుకుంటోంది. అయితే ఓట్ల చీలిక వచ్చి మరోసారి వైసీపీ అధికారం లోకి వస్తుందన్న బెంగ పవన్ లో ఉంది. నిజానికి పవన్ కి ఎవరు అధికారం లోకి వస్తున్నారు అన్నది అప్రస్తుత ఆలోచన.

తానుగా అధికారం లోకి రావాలని ఆయన ఎత్తులు వేసుకుని రాజకీయ రణ క్షేతంలోకి దిగితే ఆ కధ వేరుగా ఉంటుంది. సీట్లు ఎన్ని వచ్చాయన్న దాని మీద పోస్ట్ పోల్ అలియెన్స్ ఉండవచ్చు. అంటే కర్నాటక లో జేడీఎస్ చేస్తున్నట్లుగా అన్న మాట. కానీ పవన్ అయితే ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందలేను అని ముందే చెప్పేశారు. మరి ఇపుడు ఈ యాత్ర ఎందుకు అంటే జనసేన బలం చూపించడానికి అని అంటున్నారు.

ఎవరికి చూపించడానికి అంటే జగన్ కి కాదు చంద్రబాబుకే అన్న జవాబు వస్తుంది సాధారణంగా అధికారం లో ఉన్న పార్టీకి విపక్ష పార్టీ తన సత్తా చూపి భయపెడుతుంది. కానీ ఇపుడు పవన్ జనసేన విషయం చూస్తే ఆయన నేరుగా ఒంటరిగా బరి లోకి రావడంలేదు కాబట్టి ముందు పొత్తుల పంచాయతీని తేల్చుకోవాల్సి ఉంది. తనను మరీ జూనియర్ పార్టనర్ కింద జమ కట్టకుండా సీట్లు పెద్ద ఎత్తున ఇవ్వాలన్న డిమాండ్ కోసమే ఆయన వారాహి రధయాత్రను చేస్తున్నారు అన్న ప్రచారం ఉంది.

ఇక గోదావరి జిల్లాల లో జనసేన కు బలం పెరిగింది, గ్రాఫ్ బాగా ఉంది అన్నది సర్వేలు కొన్ని బయటపెట్టాయి. పవన్ కి జనసేన కు హార్డ్ కోర్ రీజియన్ గా దీనిని చూడాలి. అదే టైం లో ఇక్కడ టీడీపీ కూడ గట్టిగానే ఉంది. ఆ పార్టీకి గోదావరి లో పటిష్టమైన క్యాడర్ లీడర్స్ ఉన్నారు.

ఇక పొత్తు లలో భాగంగా జనసేన టీడీపీ కి ఇర వై నుంచి పాతిక లోపు సీట్లు ఇవ్వవచ్చు అన్నది ఒక ప్రచారంలో ఉన్న మాట. అయితే ఏపీ లో థర్డ్ ఫోర్స్ గా ఎదగాలనుకుంటున్న పవన్ కి ఇంత తక్కువ నంబర్ సీట్లు ఆఫర్ చేయడం అంటే ఓకే చెప్పకపోవచ్చు అని అంటున్నారు. కనీసంగా యాభై నుంచి అర వై సీట్లు జనసేన కోరుతోందని టాక్ నడుస్తోంది.

అన్ని సీట్లు తమకు దక్కితేనే రేపటి రోజున ఏపీ రాజకీయాన్ని శాసించగలమని, అదే విధంగా ఎన్నికల అనంతరరం అధికారం లో వాటా ను కూడా కోరగలమని లెక్కలేసుకుంటోంది. కానీ అన్ని సీట్లు ఇచ్చేందుకు టీడీపీ ఈ రోజున అంగీకరించకపోవచ్చు. అయితే వారాహి రధయాత్రతో వేలాది జనాల మధ్య పవన్ కళ్యాణ్  సభలు పెట్టి సత్తా చాటితే అపుడు టీడీపీ ఆలోచనలు మారుతాయని తమ బలం చూపించి మరీ అర్ధ సెంచరీకి తక్కువ లేకుండా సీట్లు పొత్తులో తీసుకోవచ్చు అన్నదే జనసేన ఎత్తుగడగా చెబుతున్నారు.

ప్రస్తుతానికి ఇదే అజెండా తో జనసేన ముందుకు సాగుతోందని అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒకసారి బరి లోకి దిగాక వారాహి రధం కదిలాక జనం నుంచి విపరీతమైన స్పందన లభించాక పవన్ ఆలోచనలు కూడా మారవచ్చు. సోలో ఫైట్ కి రెడీ అన్న ధీమా పెరిగినా పెరగవచ్చు అంటున్నారు.

అయితే దశల వారీగా వారాహి రధయాత్ర చేపట్టనున్నారు. అందువల్ల తొలి దశలో జనసేన కు వచ్చిన స్పందన చూశాక టీడీపీ ఆలోచనలు మారి జనసేన కు బిగ్ నంబర్ తో ఆఫర్ ఇస్తే ఆ పార్టీ టార్గెట్ రీచ్ అయినట్లే.  ఏది ఏమైనా ఒక్క మాట అయితే ఉంది. పవన్ వారాహి రధయాత్ర లో సీఎం అన్న నినాదాలు అయితే మిన్నంటుతాయి. దానికి పవని ఇచ్చే సమాధానం, రియాక్షన్ బట్టే ఏపీ పాలిటిక్స్ ఏ మలుపు తిరగనుందో తేలనుంది అంటున్నారు.

Similar News