పవన్‌ - చంద్రబాబు భేటీ: వైసీపీ నేతల స్పందన ఇదే!

Update: 2023-01-08 10:31 GMT
జనసేనాని పవన్‌ కల్యాణ్‌.. హైదరాబాద్‌ లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇటీవల తాజా రాజకీయ పరిణామాలు, కందుకూరు, గుంటూరు తొక్కిసలాటల్లో 11 మంది మృతి, దీన్ని సాకుగా తీసుకుని రోడ్‌ షోలు, బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ జగన్‌ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్‌ 1, కుప్పంలో తాజాగా చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడం, లోకేష్‌ పాదయాత్ర, పవన్‌ బస్సు యాత్రలను అడ్డుకుంటామని వైసీపీ నేతలు ప్రకటించడం వంటివాటిపై ఇద్దరు నేతలు చర్చించారని టాక్‌ నడుస్తోంది.

మరోవైపు సహజంగానే చంద్రబాబు–పవన్‌ భేటీ వైసీపీని బెంబేలెత్తిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ, జనసేన పార్టీల శ్రేణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. టీడీపీ–జనసేన కలిస్తే 2014 ఫలితాలు పునరావృతమవుతాయని వైసీపీ బలంగా నమ్ముతోందని చెబుతున్నారు. అందుకే దమ్ముంటే పవన్‌ కల్యాణ్‌ 175 సీట్లలో పోటీ చేయాలని సవాల్‌ విసురుతున్నారని గుర్తు చేస్తున్నారు. 175 సీట్లలో పోటీ చేయకపోతే ప్యాకేజీ స్టార్‌ అంటామని అంటున్నారని వివరిస్తున్నారు.

పవన్, చంద్రబాబులను విడదీసి పొత్తు కలవకుండా చేస్తే ఓట్లు చీలిపోయి మళ్లీ వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. అలాకాకుండా జనసేన–టీడీపీ కలిసి పోటీ చేస్తే వైసీపీ ఓటమి పక్కా అని సామాన్య ప్రజలు సైతం చెబుతున్నారని గుర్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌ తాజా భేటీపై వైసీపీ నేతలు తమ కడుపు మంటను ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ భేటీని తట్టుకోలేకపోతున్నారని, తట్టుకోలేక ఉడుక్కుంటున్నారని అంటున్నారు.

చంద్రబాబు, పవన్‌ భేటీ అవుతున్నారని తెలిసింది ఆలస్యం వైసీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టేశారని గుర్తు చేస్తున్నారు.

'సంక్రాంతి పండుగ మామూళ్ళ కోసం దత్త తండ్రి వద్దకు దత్త పుత్రుడు' అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు.

ఇక పవన్‌ పై విమర్శలు చేయడంలో ముందుండే అంబటి రాంబాబు.. 'సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయి చంద్రబాబు ఇంటికి పవన్‌ కల్యాణ్‌ వెళ్ళాడు డుడు బసవన్నలా తల ఊపడానికి' అంటూ ట్వీట్‌ లో నిప్పులు చెరిగారు.

ఇక మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సైతం.. 'సంక్రాంతికి గంగిరెద్దులా చంద్రబాబు ఇంటికి పవన్‌ కళ్యాణ్‌ వెళ్లాడు, పవన్‌ కళ్యాణ్‌ కి నీతి, జాతి లేదు పవన్‌ కళ్యాణ్‌ వి డ్రామాలు, మా అమ్మని చంద్రబాబు తిట్టాడు అన్న పవన్‌ కళ్యాణ్‌ కి చంద్రబాబు ఇంటికి వెళ్ళడానికి సిగ్గు శరం ఉందా? పవన్‌ కల్యాణ్‌ ఇంటి పేరు కొణిదెల కాదు.. నారా' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. 'సంక్రాంతి ప్యాకేజీ కోసమే చంద్రబాబు ఇంటికి పవన్‌ కల్యాణ్‌ వెళ్లాడు. దత్త తండ్రి ఇంటికి దత్తపుత్రుడు వెళ్లాడు. కందుకూరు, గుంటూరుతో అమాయకులు చనిపోతే పరామర్శించలేదు. పవన్‌ కల్యాణ్‌కు సిగ్గులేదు. చంద్రబాబు ఇంటికి వెళ్లడం పవన్‌కు సిగ్గుగా అనిపించడం లేదా? చంద్రబాబు, పవన్‌ కలిసినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని అంగుళం కూడా కదపలేరు' అని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశాయని మండిపడ్డారు. బాబు చెప్పినట్టు ఆడతాడు కాబట్టే పవన్‌ దత్తపుత్రుడు అయ్యాడని ధ్వజమెత్తారు. ఇప్పుడు చెప్పు తీసుకుని ఎవరిని కొట్టాలో పవన్‌ చెప్పాలని ప్రశ్నించారు. ఈ భేటీతో వీరిద్దరి మధ్య ముసుగు తొలిగిపోయిందన్నారు. ఏపీని వదిలేసి పక్క రాష్ట్రంలో కూర్చుని జీవో నెంబర్‌–1పై చర్చించడమేంటి? అని నిలదీశారు. ప్యాకేజీకి లొంగిపోయాడు కాబట్టే చంద్రబాబు ఇంటికి పవన్‌ వెళ్లాడని మండిపడ్డారు. వీళ్ల కలయిక వల్ల ఏపీకి ఒరిగేదేమీ లేదు అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. 
Tags:    

Similar News