ఆ రెండు సీట్లూ : ఊరించేస్తున్న పవన్... ?

Update: 2022-05-09 16:30 GMT
జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలకు బాగా ప్రిపేర్ అయిపోయారు. ఆయన ఈ విషయంలో తెరచాటుగా చేయాల్సిన కసరత్తు అయితే ఇప్పటికే  పూర్తి చేశారు. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయడానికి సేఫ్ గా ఉండే రెండు సీట్లను ఆయన ఎంపిక చేసి పెట్టుకున్నారు.  సామాజిక తూకాలు, సమీకరణలతో పాటు రాజకీయాలూ, ప్రాంతాలు కూడా కలసివచ్చేలా చూసుకుంటున్నారు.

అందులో మొదటి సీటు గోదావరి జిల్లాలలోని తాడేపల్లిగూడెం. ఈ సీటు ప్రాధాన్యత ఏంటి అంటే ఎపుడూ ఇక్కడ కాపులే ఎక్కువగా గెలుస్తూంటారు. ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈ సీటు నుంచి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు ముందు 2014లో ఈ సీటు నుంచి బీజేపీ అభ్యర్ధిగా పైడికొండల మాణిక్యాల రావు గెలిచారు, మంత్రి కూడా అయ్యారు.

ఇక 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి జనసేన తరఫున బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తే 36,197 ఓట్లు వచ్చాయి. అంటే బాగా ఇక్కడ జనసేన పెర్ఫార్మ్ చేసింది అనే అంటున్నారు. అందుకే ఈ సీటు మీద పవన్ మోజు పడుతున్నారు అని చెబుతున్నారు. ఇక్కడ 2019 ఎన్నికల్లో కొట్టు సత్యనారాయణకు 16,466 మెజారిటీ వచ్చింది. టీడీపీ అభ్యర్ధి ఈలి నానికి 54,275 ఓట్లు వచ్చాయి. మరి టీడీపీ జనసేన విడిగా పోటీ చేస్తేనే లక్ష ఓట్లు దాకా తెచ్చుకున్నారు.

రేపటి ఎన్నికల్లో జగన్ వేవ్ ఉండదు, యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. అలాగే పవన్ ఇక్కడ పోటీకి నిలబడితే మెజారిటీ అదిరిపోయే రేంజిలో వస్తుంది అని అంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ 2004 తరువాత మళ్ళీ 2019లోనె గెలిచారు. అంటే ఆయన ఎంత సొంత పలుకుబడి ఉన్నా పవన్ని ఓడించే సీన్ అయితే లేదని లెక్కలు వేస్తున్నారు.

ఇక దీనితో పాటు మరో సీటుగా రాయలసీమ నుంచి తిరుపతికి పవన్ రిజర్వ్ చేసుకుని ఉంచారు అంటున్నారు. ఈ సీటు కి ఒక ప్రత్యేకత ఉంది. మెగాస్టార్ 2009 ఎన్నికల్లో 15 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో  ఇక్కడ నుంచి గెలిచారు. అందువల్ల అన్న సీట్లో తమ్ముడు పోటీ చేస్తే అదొక మజాకాగా ఉంటుంది. దాంతో పాటు ఈ సీటు కూడా జనసేనకు సేఫెస్ట్ అని లెక్కలేస్తున్నారు.

ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో జనసేన తరఫున చదలవాడ క్రిష్ణమూర్తి పోటీ చేస్తే ఆయనకు 12, 315 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీ చాలా బలంగా ఉంది. ఆ పార్టీ తరఫున సుగుణమ్మ పోటీ చేస్తే 79836 ఓట్లు దక్కాయి. కేవలం 708 ఓట్ల తేడాతోనే భూమన కరుణాకరరెడ్డి ఇక్కడ నుంచి వైసీపీ తరఫున గెలిచారు. అంటే ఇక్కడ నుంచి జనసేన అభ్యర్ధిగా పవన్ పోటీ చేస్తే కచ్చితంగా లక్ష ఓట్లు కైవశం చేసుకోవడం ఖాయం.

అదే టైమ్ లో భూమన పోటీ చేసినా మరొకరు బరిలో దిగినా టీడీపీ జనసేన కాంబోలో స్ట్రాంగ్ సీటు ఇది కాబట్టి కచ్చితంగా పాతిక నుంచి ముప్పయి వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం తధ్యమని చెప్పేస్తున్నారు. దాంతో ఈ రెండు సీట్ల విషయంలో పవన్ ఆలోచిస్తున్నారు. పవన్ కి అయితే తిరుపతి లోనే పోటీ చేయాల‌ని ఉందని చెబుతున్నారు. రాయలసీమ లో పార్టీకి హుషార్ తేవడంతో పాటు టెంపుల్ సిటీ నుంచి ఎమ్మెల్యేగా ఉండాలని, తన అన్న సీటులో తాను కూడా ఎమ్మెల్యే అయ్యాను అనిపించుకోవాలని ఉందిట. సో ఇక్కడ నుంచి పవన్ బరిలోకి దిగితే ఆ కధే వేరుగా ఉంటుంది అన్నది వాస్తవం.
Tags:    

Similar News