జగన్ బీజేపీ బంధం మీద పవన్ సంచలన కామెంట్స్

Update: 2023-03-15 07:48 GMT
ఏపీ సీఎం జగన్ మీద పవన్ మార్క్ పంచులు కొన్ని జనసేన పదవ ఆవిర్భావ సభలో పేలాయి. తాను బీజేపీతో పొత్తులో ఉన్నాను అని తనకు మైనారిటీలు దూరంగా ఉంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి బీజేపీతో పొత్తు ఉన్నా కూడా మైనారిటీల మీద ఏ రకమైన దాడి జరిగినా తాను సహించేది లేదని, వారి మీద దాడులే జరిగితే మరుక్షణం పొత్తు బంధాన్ని సైతం తెంచుకుని బయటకు వస్తాను అని పవన్ గట్టిగానే హెచ్చరించారు, అదే తన విధానమని స్పష్టం చేశారు.

తాను బీజేపీతో పొత్తులో ఉంటేనే మైనారిటీలు దూరం అంటున్నారే, జగన్ వైపు  మైనారిటీలు ఉంటున్నారే, అదే జగన్ ఢిల్లీ వెళ్ళి బీజేపీ వారితో బంధం గట్తిగా పెట్టుకుంటే మైనారిటీలకు కనబడడం లేదా అని పవన్ నిలదీశారు. జగన్ బీజేపీ వారితోనే కాదు, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా పొత్తులు పెట్టుకుంటారు అని పవన్ సెటైర్లు వేశారు.

తాను నిజాయతీగా పద్ధతిగా ఉంటాను కాబట్టి అధికారికంగా బీజేపీతో పొత్తులు పెట్టుకున్నానని, అదే జగన్ ఢిల్లీ వెళ్ళి రహస్యంగా బీజేపీతో స్నేహం చేస్తున్నారు అని పవన్ చెప్పడం ద్వారా వైసీపీ ఢిల్లీ తెర చాటు రాజకీయ దోస్తీని మచిలీపట్నం సభ ద్వారా పూర్తిగా ఎండగట్టేశారు. అదే సమయంలో తాను ముస్లిం మైనారిటీలకు ఎంతో విలువ గౌరవం ఇస్తానని, తన సభలు జరుగుతున్నపుడు నమాజ్ చేస్తూ మసీదుల నుంచి శబ్దం వస్తే తాను ప్రసంగం ఆపేసిన సందర్భాలు ఉన్నాయని ఆయన అన్నారు.

కావాలంటే యూ ట్యూబ్ లోకి వెళ్ళి పాత వీడియోలను చూసుకోవచ్చు అని పవన్ చెప్పడం విశేషం. ఇక కాపులు కమ్మలు దోస్తీగా ఉండాలని, వారే కాదు, అన్ని కులాలు కలసికట్టుగా ఉండాలని యువతకు పవన్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పవన్ ఒక విషయం చెప్పారు. వంగవీటి మోహన రంగా కాపులకు ఆరాధ్యం దైవం అని, ఆయన చేసుకున్నది కమ్మ వారి ఆడపడుచుకుని కాదా అని ప్రశ్నించారు. వంగవీటి రాధా కమ్మ, కాపులకు పుట్టిన బిడ్డ కాదా అని పవన్ అన్నారు.

వాళ్ళకు లేని కుల భావన మిగిలిన వారికి ఎందుకు అని ఆయన నిలదీశారు. తన చుట్టూ చాలా మంది కాపులు ఉన్నారని, వారు కమ్మలతో వివాహ సంబంధాలు నెరిపారని పవన్ గుర్తు చేశారు. కులం అన్నది ఇంకా అలాగే జాడ్యంగా పెంచుకుంటూ పోతే 2050 నాటికి కూడా ఈ దేశం అభివృద్ధి చెందదని పవన్ అన్నారు. అందరూ సమానమే అన్న భావన యువతలో రావాలని సమాజంలో ఒకరికి ఒకరు తోడుగా నీడగా నిలవాలని అలాంటి సమాజం కోసమే జనసేన చూస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

మరి కమ్మ కాపుల మధ్య సయోధ్య అంటూ పవన్ ఈ విషయాలను ఎందుకు చెప్పుకొచ్చారో తలియదు కానీ ఆయన మాటల ఆంతర్యం చూస్తూంటే బలమైన బీసీలతో పాటు కాపులు కమ్మలు అందరూ కూడా ఏకం కావాలన్న భావన అయితే కనిపించింది.

Similar News