"పాపం పసివాడా.. చిన్నాయనను చంపిందెవరో చెప్పు?"

Update: 2023-06-15 09:37 GMT
'వారాహి'తో విజయయాత్రను మొదలు పెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన తొలిసభను కత్తిపూడిలో నిర్వహించటం తెలిసిందే. సుదీర్ఘంగా ప్రసంగించిన ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పలు విమర్శలు చేశారు. జగన్ పాలనలోని లోపాల్ని ఎత్తి చూపేందుకు తెగ ప్రయత్నించిన పవన్.. వ్యక్తిగతంగా విమర్శలు చేసేందుకు వెనుకాడలేదు. గడిచిన కొన్ని నెలలుగా ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించిన పవన్.. తన మాటలతో పంచ్ ల మీద పంచ్ లు వేసే ప్రయత్నం చేశారు.

ఆ మధ్యన తన ట్విటర్ ఖాతాలో పాపం పసివాడు పోస్టర్ తో సీఎం జగన్ మీద పంచ్ లు వేసిన పవన్.. తాజాగా కత్తిపూడిలోనూ పాపం పసివాడు ప్రస్తావనతో పంచ్ లువేసే ప్రయత్నం చేశారు. పాపం పసివాడిలా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడతారన్న ఆయన.. సొంత చిన్నాన్నను చంపిన వారిని శతవిధాలుగా రక్షించేందుకు తాపత్రయపడుతన్నారన్నారు. బాబాయ్ కుమార్తె న్యాయపోరాటం చేస్తుంటే దాన్ని పట్టించుకోని ఆయన.. క్లాస్ వార్ గురించి మాట్లాడం వింతగా ఉందన్నారు.

ఈ సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ బలవంతుడు.. రాజకీయ బలహీనుడు అనే రెండు వర్గాల మధ్యనే పోరు నడుస్తోంది. తన తండ్రిని హత్య చేసిన వారి కోసం న్యాయపోరాటం చేస్తున్న డాక్టర్ సునీతకు కోర్టులో వాదించేందుకు అడ్వకేట్లు దొరకని పక్షంలో సొంతంగా కేసు వాదించుకుంటున్నారు. వ్యవస్థలోని రాజకీయ బలవంతానికి సజీవ సాక్షిగా నిస్సహాయంగా నిలబడిపోయింది'' అని వ్యాఖ్యానించారు.

వివేకా హత్య కేసులో అన్నీ చేతులు సీఎం ఇంటి వైపే చూపిస్తున్నాయని.. అయినప్పటికి న్యాయం అందని పరిస్థితి నెలకొందన్నారు. కోట్లాది మంది అభిమానులు ఉన్న వారిని సైతం ముఖ్యమంత్రిఎదుట చేతులు కట్టుకునేలా చేసిన ముఖ్యమంత్రి క్లాస్ వార్ గురించి మాట్లాడటానికి సరిపోరంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోల మీద పంచ్ గా అభివర్ణిస్తున్నారు.

Similar News