టీడీపీ సైలెంట్... పవన్ స్పీడ్... అంతా స్ట్రాటజీయేనా...?

Update: 2023-06-17 18:00 GMT
ఏపీలో పొత్తులు అయితే ఈ రోజు దాకా ఏ రెండు పార్టీల మధ్యన లేవు. బీజేపీ జనసేనల మధ్య మిత్ర బంధం ఉన్నా అది ఏ రోజూ రాజకీయ చర్చకు రాలేదు. పెద్దగా వర్కౌట్ అయినదీ లేదు. ఈ నేపధ్యం నుంచి చూసుకున్నపుడు ఏపీలో జనసేన ఇపుడు బిగ్ సౌండ్ చేస్తోంది. ఈ టైం లో టీడీపీ సైలెంట్ అవడమూ గమనించాలి. ఈ రెండు పార్టీల వ్యూహం ఏదైనా ఇందులో ఉందా అన్నదే ఒక డౌట్ గా ఉంది.

ఏపీలో టీడీపీ వేవ్ ఈ ఏడాది మొదట్లో బాగా కనిపించింది. మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏకంగా మూడంటే మూడు సీట్లూ గెలుచుకోవడం ద్వారా టీడీపీ జోరు చేసింది. ఆ జోరు హోరు కాస్తా రాజమండ్రీలో గత నెల చివరిలో జరిగిన మహానాడు దాకా కంటిన్యూ అయింది. ఆ టైం అంతా మీడియా ఫోకస్ పూర్తిగా టీడీపీ మీదనే. టీడీపీయే ఏపీలో ఆల్టర్నేషన్ అన్నట్లుగా ఆ హడావుడి సాగింది.

అయితే మహానాడు ముగియడంతోనే టీడీపీ సందడి చప్పున చల్లారింది. నిజానికి టీడీపీ హడావుడి చేస్తున్నపుడు జనసేన అధినేత ఎక్కడా బయటకు రాలేదు. ఆయన తన సినిమాలు తాను చేసుకుంటూ కూల్ గా ఉన్నారు. ఎపుడైతే జనసేన వారాహి బయటకు వచ్చిందో అప్పటి నుంచి మీడియా ఫుల్ ఫోకస్ ఆయన వైపు మళ్ళింది. ఈ టైం లో టీడీపీ సైలెంట్ గా ఉండడం విశేషం.

ఏపీలో పాలిటిక్స్ అంతా ఇపుడు చూస్తే వైసీపీ వర్సెస్ జనసేనగానే సాగుతోంది. వైసీపీ నేతలను, మంత్రులను పట్టుకుని పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం, దానికి ప్రతిగా అటు వైపు నుంచి గట్టిగా జవాబులు రావడంతో ఆ రెండు పార్టీల మధ్యనే పొలిటికల్ వార్ ఇపుడు సాగుతోంది. ఇవన్నీ కూడా టీడీపీ సైలెంట్ గానే గమనిస్తోంది.

నిజానికి టీడీపీ సైలెంట్ గా ఏమీ లేదు. లోకేష్ ఒక వైపు పాదయాత్ర చేస్తున్నరు,మరో వైపు చంద్రబాబు జిల్లాల టూర్లు కూడా పెట్టుకున్నారు. అయినా సరే ఈ రెండు పార్టీలూ ఏదో కూడబలుక్కునట్లుగా ఒకరు సీన్ లో ఉంటే మరొకరు సైలెంట్ అవడాన్ని గమనించవచ్చు.

దీన్ని చూసిన వారు దీని వెనక ఒక స్ట్రాటజీ ఉందేమో అని డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి టీడీపీ జనసేనల మధ్యన తెర వెనక అవగాహన బాగానే ఉంది అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే బయటకు మాత్రం ఎవరి మటుకు వారు అన్నట్లుగానే రాజకీయాన్ని నడిపిస్తున్నారు. రక్తి కట్టిస్తున్నారు అని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ తనను ఏపీకి సీఎం ని చేయమని అంటున్నారు. అదే టైం లో జగన్ పాలనను ఆయన దారుణంగా విమర్శిస్తున్నారు. అందుకు ప్రతిగా వైసీపీ వైపు నుంచి కూడా పవన్ మీద ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఏపీలో విపక్షం అంటే పవనే అన్నట్లుగా వారి మాటలు ఉంటున్నాయి.

ఇక చూస్తే మరో రకమైన రాజకీయం కూడా ఏపీలో కనిపిస్తోంది. టీడీపీ జోరు కొంత తగ్గినపుడు ఆ గ్యాప్ లో వైసీపీ కూడా స్పీడ్ పెంచింది. జగన్ సైతం అగ్రెస్సివ్ మోడ్ లో చంద్రబాబు మీద హాట్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. వైసీపీని పరుగులు పెట్టించారు. ఇపుడు చూస్తే వారాహి యాత్రనే హైలెట్ అవుతోంది. మీడియాలో పవన్ స్పీచులే ఫుల్ గా ఫోకస్ అవుతున్నాయి.

దీన్ని చూసిన వారు అంతా ఏపీలో వైసీపీ వ్యతిరేక వాతావరణం క్రియేట్ చేసేందుకు పవన్ వారాహి యాత్ర బాగా ఉపయోగపడుతోందని అంటున్నారు. వైసీపీ మీద వ్యతిరేకతను పవన్ పెంచుతున్న క్రమంలో టీడీపీ కూడా ఇది తమకు అనుకూలమే అవుతుంది కాబట్టి సైలెంట్ గా ఉందని అంటున్నారు. ఇది ఒక ఎత్తుగడలో భాగమే అని అంటున్నారు.

ఏపీలో ఈ రోజుకీ విపక్షంలో పెద్ద పార్టీగా టీడీపీ ఉంది. పవన్ జగన్ని విమర్శించి పెద్ద ఎత్తున వ్యతిరేకతను అధికార పార్టీ మీద పెంచితే అది నేరుగా షిఫ్ట్ అయ్యేది టీడీపీకే అన్న లెక్కలతోనే పసుపు పార్టీ ఈ కీలకమైన టైం లో మౌనం వహిస్తోంది అని అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఏపీ రాజకీయ తెర మీద పవనే కనిపిస్తున్నారు. ఆయన పాలిటిక్స్ తో వారాహి యాత్రతో వేడి పుట్టిస్తున్నారు.

Similar News