ఆ టైంలోమోడీ ప్లాన్.. బయటకు చెప్పిన శరద్ పవార్

Update: 2021-12-31 09:30 GMT
స్నేహితులు దేవుడి వరంగా కొందరు చెబుతుంటారు. అలాంటిది రాజకీయాల్లో స్నేహ బంధం అంత మామూలు విషయం కాదు. అందులోని రెండు పార్టీల మధ్య సుదీర్ఘ మైత్రి బంధం ఉండటం చాలా అరుదు. అలాంటి స్నేహాన్ని సైతం అధికారం కోసం కాలదన్నుకోవటం మోడీషాలకు మాత్రమే చెల్లుతుందని చెప్పాలి. బీజేపీతో ఏ రాజకీయ పార్టీ కలిసి నడిచేందుకు సిద్ధపడని సమయంలోనూ.. ఆ పార్టీకి దన్నుగా నిలిచిన పార్టీ ఏదైనా ఉందంటే అది శివసేన మాత్రమే. అలాంటి ఆ పార్టీ స్నేహబంధాన్ని సైతం వదులుకోవటం బీజేపీకే చెల్లింది.

మహారాష్ట్రంలో శివసేనతో ఉన్న మైత్రికి చెల్లుచీటి ఇచ్చేసిన మోడీషాల తీరుతో.. మహారాష్ట్ర పీఠం చేజారిన పరిస్థితి. ఈరోజున శివసేన.. ఎన్సీపీ.. కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువు తీరిందంటే అది మోడీ వ్యూహాత్మక తప్పిదం తప్పించి మరొకటి కాదు. బీజేపీ అన్నది పలువురు నేతల నాయకత్వ కూటమి స్థాయి నుంచి.. మోడీ వన్ మ్యాన్ ఆర్మీగా దాన్ని మార్చేసి చాలా కాలమే అయ్యింది. అప్పటి నుంచి పార్టీ కనిపించటం మానేసి.. మోడీ మాత్రమే కనిపిస్తున్న దుస్థితి.

సేనతో విభేదాలు పొడచూపిన తర్వాత మహారాష్ట్ర పీఠాన్ని సొంతం చేసుకోవటానికి మోడీషాలు చేసిన ప్లానింగ్ గురించి తాజాగా వెల్లడించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. 2019లో ఎన్నికల తర్వాత ఏ పార్టీకి సరైన మెజార్టీ రాని వేళ.. ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావించిందని పవార్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఆకాంక్ష కూడా అదేనని చెప్పారు.

పూణెలోని మరాఠీ పత్రిక లోక్ సత్తా నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరైన పవార్ ఒక ప్రశ్నకు బదులిస్తూ.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ.. శివసేన ఉమ్మడిగా పోటీ చేశాయి. ఫలితాల అనంతరం రెండు పార్టీల మధ్య ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కాలన్న విషయంలో లెక్కలు తేల్లేదు. దీంతో.. ఉద్దవ్ ఠాక్రే బీజేపీతో ఉన్న మిత్ర బంధాన్ని వదులుకున్నారు.

అనంతరం ఎన్సీపీ.. కాంగ్రెస్ లతో కూడిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ మధ్యలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అవన్నీ నిజాలే అన్న విషయం తాజాగా పవర్ చెప్పిన మాటలతో అర్థమవుతుంది. బీజేపీతో ఎన్సీపీ కలవాలని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మోడీ ఆకాంక్ష అని.. అయితే.. ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లి అది సాధ్యం కాదని చెప్పి వచ్చినట్లుగా పవార్ ప్రకటించారు.

ఇందుకు ప్రధాని మోడీ స్పందన ఏమిటి? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. బాగా ఆలోచించుకోండి అని చెప్పారని.. అప్పటికి ఎన్నికల ఫలితాలు వచ్చి 90 రోజులు అవుతున్నా ప్రభుత్వం ఏర్పడలేదన్నారు. ఎన్సీపీతో కలిసి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది మోడీ ఆలోచన కావొచ్చన్నారు. పవార్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్నిఏర్పాటు చేయాలనుకుందన్న విషయాన్ని శరద్ పవార్ ఎందుకు వెల్లడించలేదని మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పవార్ తాను సొంతంగా చెప్పలేదని.. మాటల సందర్భంలో అడిగిన ప్రశ్నకు బదులిచ్చారన్న విషయాన్నిబీజేపీ నేత ఎందుకు మిస్ అయ్యారంటారు?


Tags:    

Similar News