బాబుకు గ‌ట్టిప‌రీక్షే పెట్టిన మున్సిప‌ల్ చైర్మ‌న్‌

Update: 2017-06-20 07:59 GMT
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు పార్టీలో మ‌రో షాకింగ్ ప‌రిణామం ఎదురైంది. పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ పీసీ గంగన్నను ప‌ద‌వి నుంచి త‌ప్పుకొని  మ‌రొక‌రికి చాన్స్ ఇవ్వాల‌ని ఇటీవ‌లే చంద్ర‌బాబు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. అయితే రాజీనామా యోచన తనకు లేదని పీసీ గంగ‌న్న స్ప‌ష్టం చేశారు. ముఖ్యమంత్రిని కలిసి అన్ని విషయాలు సవివరంగా వివరించిన‌ తరువాతే తన నిర్ణయం ఉంటుందన్నారు. పుట్టపర్తి సింగిల్‌ విండో అధ్యక్ష పదవి - ఎంపిపి - పుడా చైర్మన్ - మరికొన్ని పదవుల విషయంలో ఒక విధంగా మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో మరో విధంగా నిర్ణయాలు ఉండ‌డం సముచితం కాదన్నారు.

మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌విలో తాను రెండున్నరేళ్లు మాత్రమే ఉంటానని ఏనాడు అంగీకరించలేదని పీసీ గంగ‌న్న తెలిపారు. కొందరు ఉద్దేశ పూర్వకంగా తనను దించే కుట్రలో భాగంగా ఈ మాట‌ల‌ను చెప్తున్నార‌ని ఆరోపించారు. అందుకే  ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడును కలిసి అన్ని విషయాలు వివరిస్తానన్నారు. పుట్టపర్తి మున్సిపల్ నూతన కార్యాలయ భవనాన్ని తన హయాంలోనే నిర్మించి తీరుతానన్నారు.  కాగా, పోలీసు కేసు నుంచి పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ పీసీ గంగన్నకు విముక్తి ల‌భించింది. ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్ర‌బాబు రాక సందర్భంగా పోలీసులను దూషించారన్న కారణంగా గంగన్నపై కేసు నమోదుచేశారు. అప్పటి నుండి పీసీ గంగన్న అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఎట్టకేలకు సోమవారం పుట్టపర్తి పోలీస్ స్టేషన్‌ కు హాజరై స్టేషన్ బెయిల్‌ పై విడుదలయ్యారు.

కాగా బెయిల్‌ పై విడుద‌లైన అనంత‌రం తన అనుచరులతో కలిసి హనుమాన్ సర్కిల్ వరకు గంగ‌న్న ర్యాలీగా వెళ్లారు. సత్యసాయి విమానాశ్రయంలో అవమానం జరిగిందని భావించి అసహనానికి లోనై నోరుజారి రెడ్ల కులం పేరుతో దూషించడం ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదన్నారు. డీఎస్‌ పీని మాత్ర మే ఉద్దేశించి అన్నానన్నారు. రెడ్ల సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని తాను దూషించలేదని, వారి మనోభావాలు దెబ్బతిని వుంటే ఆ సామాజిక వర్గానికి, అధికారులకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నానన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News